Monday 19 February 2018

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-    పద్య  ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు:

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థమదార్భట ఢంకృతి ప్రజృం
భణ త్రుటితాభ్రతార గణరాజ దినేశముఖగ్రహప్రఘర్
క్షణగుణతాండవాటన"ఢ"కారనుతా! బసవేశ పాహిమాం!
ప్రతిపదార్థం
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢంమృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణ= ఢణ, ఢణ, ఉద్ధణ మొదలయిన చప్పుళ్ళతో
నటన = నాట్యము చేయు
త్వదీయ= నీ సంబంధమైన
డమరు= డమరుకము నుండి( చర్మవాద్యం)
ఉత్థ= పుట్టిన
మద= సంతోషపు
ఆర్భట = కేకలతో
ఢంకృతి=డోలుచప్పుళ్ళతో
ప్రజృంభణ =బాగా అతిశయించుచూ
త్రుటిత= తెగిన
అభ్ర=ఆకాశములోని
తారగణ= నక్షత్ర సమూహముల
రాజ = చంద్రుడు
దినేశ= దిన+ఈశ=సూర్యుడు
ముఖగ్రహ= మొదలుకొని మిగతా గ్రహముల
ప్రఘర్షణ = రాపిడి కలిగిన
గుణ= శ్రేష్ఠమయిన
తాండవ= తాండవనృత్యములో
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
ఢ"కారనుతా=ఢ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా !ఓ పరమశివా ! ఢణ, ఢణ, ఉద్ధణ మొదలయిన చప్పుళ్ళతో నువ్వు తాండవం చేయుచున్న సమయములో, నీడమరుకము నుండి  పుట్టిన  ధ్వనుల తీవ్ర వేగానికి  ఆకాశములోని నక్షత్రాలు తెగిపోయాయి., చంద్రుడు, సూర్యుడు  మొదలయిన గ్రహాలు కదిలిపోయి అటు ఇటు ఊగుతూ ఒకదానికొకటి రాసుకొంటున్నాయి. ఇంతటి భయంకరమైన ధ్వనులు కలిగిన తాండవ నృత్యము చేయువాడా ! ఢ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా !పరమశివా ! నన్ను రక్షించు.

No comments:

Post a Comment