Thursday 23 March 2023

 తెలుగు సాహిత్యం లో అత్యంత క్లిష్టమైన పద్యము-సాహిత్య గోష్ఠులలో పండితులకు కొరుకుడు పడని పద్యం...

కం. *కమలాకరకమలాకర కమలాకర కమల కమల కమలాకరమై కమలాకర కమలాకర కమలాకరమైన కొలను గని రా సుదతుల్.*


- ఈ పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పృచ్ఛకులకూ, అవధానులు ఒక కేళీ వినోదంగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి వారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.


ఆ సుదతుల్ = అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు;

 కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, 

ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, 

కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, 

కమల కమల కమలాకరమై - కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, 

కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, 

ఆకరమై = - నివేశనమైనది; *కమలాకర* - క = మన్మథునియొక్క, 

మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, 

కర = కూర్చునదై, 

*కమలాకర* - కమలా = పద్మినీజాతి స్త్రీలకు, 

క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదకై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి .... సేకరణ:వల్లూరు  దాలినాయుడు.

సేకరణ

కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకసారి ఒక కవి (ప్రెగడరాజు నరస కవి) వచ్చి అష్టదిగ్గజ కవులకు ఒక పరీక్ష పెట్టాడు. అదేమంటే మీలో ఎవరు ఏది చెప్పినదాన్ని నేను వెనువెంటనే రాయగలను మరియు మీరు చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టగలను లేదా మీరు నేను చెప్పిన దాన్ని రాయండి, నే చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టండి. వీటికి మీరు సిద్ధమేనా అని ప్రశ్నించాడు.

దీనికి అక్కడివారందరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆసమయంలో తెనాలి రామకృష్ణకవి ముందుకు వచ్చి నే చెప్పేది రాయమని ఈ క్రింది పద్యం చెప్పాడట.

తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళు
క్కవ్వట; అరయఁగ నట్టి హరునకు జేజే!

(తృప్ = సాక్షరపదముల గ్రహింపజాలని పశువు - వృషభం, బాబా = వాహనం, జాబిల్లి, తలపై పువ్వు, వలువ = కట్టుపుట్టము, బూచి = భయంకరమైన (ఏనుగు)తోలు, చేదే = హాలాహలమే, బువ్వ = ఆహారం, ఉళుళుక్ (హుళక్కి)= లేనిది - మాయ, అవ్వ = కాగా, అట్టి హరును = అలాంటి పరమశివునకు, జేజేలు)
రామకృష్ణకవి చెప్పెడి విధానం పద్యం పలికే తీరు అర్థం కాక ఆ వచ్చిన కవివతంసుడు రాయలేక నిలిచిపోయాడు. దాన్ని ఎలా రాయాలో తెలియని గందర గోళంలో పడిపోయాడా పండితుడు.

ఈ సందర్భంలోని చమత్కారం పద్యం గొప్పతనాన్ని కప్పేసింది.

పూర్తి అర్థం

తృవ్వు+అట.. ‘తృవ్వట’. పశువుల్ని బళ్లకి కట్టి తోలుతున్నప్పుడు బండివాడు వాటి తోకలను మెలిపెట్టి, ఆ ఎడ్లకి హుషారు నిమిత్తం పలికే ధ్వన్యనుకరణ శబ్దమిది.

‘బాబా’ అంటే వాహనం (గుర్రం). ‘తృవ్వట’ అనేది ఎద్దుకి సంకేతం. ‘తృవ్వట బాబా’- ఎద్దు వాహనం- శివుడిది. ‘‘ఎక్కెడిదెద్దు భూతియును నెమ్ములు సొమ్ములు...’’ (శివుడికి) అని ఎర్రన తన నృసింహపురాణంలో పేర్కొన్నాడు. ‘తలపై పువ్వట జాబిల్లి’.. హరుడి శిరసులోని పుష్పం చంద్రుడు. శివుడు చంద్రశేఖరుడు కదా! ‘‘వలిమలయల్లువాడు తలవాకధరించిన పువ్వుగుత్తి!’’ అని చంద్రుణ్ని వర్ణించాడు ముక్కు తిమ్మనకవి. ఇక ‘వల్వ బూచట!’ అనే దానికి పాఠాంతరముంది.. వల్వ బూదట! అని. వల్వ అంటే వస్త్రం. శివుడి వాలకం బూచాడు కదా! భిక్షువు లేదా దిగంబరుడు! ఆయన ఒడలంతా విభూతి (బూది).. బూచి+అట- బూచట, బూది+అట- బూదట. ‘చేదే బువ్వట!’- చేదు అంటే విషం. పార్వతీ పతికి కాలకూట విషమే అన్నమైంది. దేవదానవులు అమృతం కోసం పాలకడలిని మథించినపుడు మొదట హాలహలం పుట్టింది. దాన్ని హరుడు ‘‘అల్లనేరేడు పండువలె మిసిమింతుడు గాక మ్రింగినాడు!’’ అన్నాడు శ్రీనాథ మహాకవి. ‘‘వెన్నెలతల సేదుకుత్తు కయు’’ అని పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకంలో వాక్రుచ్చాడు. ‘‘మ్రింగమన్న సర్వమంగళ తన మంగళసూత్రమును మదిలో నెంత నమ్మినదో!?’’ అన్నాడు పోతన.
‘చూడగను హుళక్కవ్వట!’.. పరికిస్తే శూన్యమే ఆయనకి అవ్వట! ఆ శివుడి పుట్టుక ఓ మాయ! ఆ తల్లి- ఆ పరము నికి అమ్మట! లయవేళ సకల సృష్టి నాశనార్థం స్థాణు రూపేణా అవతరించే మహాతత్త్వమే ఆ అద్భుతమూర్తి. గుణా లున్నపుడే ఆయనకి ఈ రూపమూ, దానికో వర్ణనమున్నూ. నిర్గుణుడయ్యాడో ఆయన పరతత్త్వంలో లయమైపోతాడు. కాబట్టి- హుళక్కి! ఇక్కడ మరో రమణీ యార్థమూ ఉంది. ‘చూడము’- అంటే తల. అది హుళక్కి! అంటే శూన్యం- ఆకాశం! శివుడికి అద్భుతమైన మరోపేరు ‘వ్యోమకేశుడు’! శూన్యాకాశమే శివుడి జటాజూటం! ఆయన అందుకే ‘ధూర్జటి!’.
భావంలో ఇలా నిలిచిన ‘హరునకు జేజే!’- ఆ పరమేశ్వరునికి ప్రణామాలర్పించాడు రామలింగడు