Sunday 16 December 2012

పెళ్ళికి ముందు......

పున్నమి జాబిల్లిని చూస్తే

చెలి వదనం గుర్తొస్తుందట


ఆకాశంలో నెలవంకను చూస్తే

చిరునవ్వుల అధరం కనిపిస్తుందట


మధుమాసంలో మరుమల్లెను చూస్తే

మధువొలికె చిలిపి నవ్వే మదిదోచెనట


అరబూసిన వెన్నెలలో విరజాజిని చూస్తే

అరనవ్వుల పలువరుసల వెన్నెలలేనట


కరిమబ్బులలో మెరుపుతీగను చూస్తే


కరిగామని తనువే తలపునకొస్తుందట

పెళ్ళయ్యాక.......

పున్నమి జాబిల్లిని చూస్తే


పెనం మీద వేయాల్సిన దోశ కనిపిస్తుంది


ఆకాశంలో నెలవంకను చూస్తే


వంటింట్లో కూరలు తరిగే కత్తిపీట కనిపిస్తుంది


మధుమాసంలో మరుమల్లెను చూస్తే


బట్టలు వుతకగా వచ్చిన నురగ కనిపిస్తుంది



అరబూసిన వెన్నెలలో విరజాజిని చూస్తే


డాబా పై ఎండబెట్టిన వడియాలు గుర్తొస్తాయి


కరిమబ్బులలో మెరుపుతీగను చూస్తే


ఒకటో తారికున తీర్చాల్సిన అప్పులు గుర్తొస్తాయి

Sunday 11 November 2012

//బంగారు//
పేదరాశి పెద్దమ్మ ఒకరోజు వీధి గుమ్మంలో కూర్చొని ఉంది. ఆ దారిగుండా అవూరి యువకులు పిల్లలు కొందరు వలలు,ఊజులు,టిర్రెలు ఎత్తిడ్లూ,పట్టుకొని పెద్దచెరువు వైపుగా పరిగెడుతున్నారు. పెద్దమ్మ అందులో ఒకన్ని ఆపి విషయం కనుక్కొని తనూ పెడకన వున్న ఊజు తీసి బూజు దులిపి టిర్రి భుజాన తగిలించుకొని బయలుదేరింది. తొలుత చిన్న ఇలుసు దొరికింది. తరువాతప్రయత్నిస్తే పిత్తపరిగి,తరువాత చుక్క పరిగి,ఆనక బేడిసి,సీకొక్కెడం,జల్ల,బొడిగి,బొమ్మిడం,మిట్ట, తాటిమిట్ట,బురద మిట్ట,రొయ్య,ఎండ్రికి,పీత,మార్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతుంటే టిర్రెలో వేస్తూ అది తీసి ఇది.అలా అన్నీ నీటిలో వదిలేస్తూ ఉంది. చివరకు ఒక పెద్ద సవడ(కొరమీను)దొరికింది.దానితో తృప్తిచెంది, ఇంటిముఖం పట్టింది పెద్దమ్మ.
   కత్తిపీట, పొయ్యిబుగ్గి,పలక రాయి సిద్ధం చేసుకొని, సవడను పొయ్యిబుగ్గిలో పొరిపి,పీక పట్టుకొని కత్తిపీటకు ఆనించి కొయ్యబోతుంటే.... సవడ తననే దీనంగా చూస్తూ వదలమని వేడుకుంటున్నట్లుంది.
   పెద్దమ్మకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. పిల్లలు అందరూ ఎవరి దారి వారు చూసుకొని వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఒంటరి అయిపోయింది.కనుక ఈ సవడ వుంటే తనతో కాలక్షేపం అవుతుందని తలచి,సవడను నీటితో కడిగి, గోలెంలోని నీటిలో విడిచిపెట్టింది. 'బంగారూ' అని పేరు పెట్టుకుంది.షరాబులింటికెళ్ళి,చిన్న వ్యాపారంకమ్మి చేయించి బంగారుకి కుట్టించింది.  బంగారూ అని పిలిస్తే నీటిలోంచి పైకి వచ్చేది ఇన్ని నూకలు వేస్తే తిని వెళ్ళిపోయేది.రోజూ పెద్దమ్మకు బంగారు లేనిదే గడిచేదికాదు.
    ఒకరోజు సంతకు బయలుదేరుతూ ఉట్టిపైన వండిన అన్నం,అన్నీ పెట్టి, పక్కింటి వారికి ఇంటి తాళం ఇచ్చి మద్యాహ్నవేళ మా బంగారుకి కొంచెం నూకలు వెయ్యండి అని చెప్పి వెళ్ళీంది. అలబొద్దుల వేళకి(10 గంటలకు) పక్కింటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళకు మర్యాద చెయ్యడానికి వూరిల్కి గుడ్డులకోసం వెళితే దొరకలేదు.ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే  అప్పుడు వారికి పెద్దమ్మ పెంచుకుంటున్న సవడ గుర్తుకొచ్చింది. తరువాత నెమ్మదిగా పెద్దమ్మకు చెప్పుకోవచ్చనుకొని, ఆ సవడను కూర చేసి చుట్టాలకి వడ్డింఛేశారు.సాయంత్రం పెద్దమ్మ సంతనుండి వచ్చి, ఆకలికి తాలలేక ఉట్టిమీదున్న వట్టన్నమేమి తింటానని పక్కింటికెళ్ళి చారో,కూరో కసింత ఇమ్మని అడిగితే,వాళ్ళు మిగిలిపోయిన ఇగురు(గ్రేవీ)సట్టి(మట్టిపాత్ర)తో పాటు ఇచ్చేసారు.
     అన్నం లో ఆ ఇగురు కలుపుకొని తింటుంటే పంటికింద ఏదో రాయి తగిలి టిసి చూస్తే వ్యాపారంకమ్మి, ఇందులోకి ఎలా వచ్చింది, కొంపతీసి మా బంగారును పక్కింటోళ్ళు ఏమైనా చేసారా ఏమిటి? అనుకొంటు గోళెం దగ్గరకు వెళ్ళి, "బంగారూ" "బంగారూ" అంటూ పిలిచింది పెద్దమ్మ. ఇంకెక్కడి బంగారు. నీటిలో చెయ్యి పెట్టి తడిమి చూస్తే బంగారు లేదు. ఇది పక్కింటోళ్ళ పనే అనుకొని వాళ్ళను నిలదీసింది.వళ్ళు ఇలగిలగ అని పెద్దమ్మకు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసారు. కానీ ఫలితం లేకపోయింది.ఊరూ వాడా ఏకమయ్యేట్టు ఒకటే ఏడుపు, ఒకటే దీవెన,"మీకు రోజ్జెయ్య, మీకు గాడుప్పుట్ట, మీ మందమాసిపోనూ,మీకు దినవారమెట్ట,మీ నెట్టిగొట్ట,మీకు పోగాలం రాను,మికు దిబ్బెయ్య,మీకు బుగ్గెత్తా, మీకొక సంకటంపుట్ట,మీకొక పాముపొడ,ముండగాసిన ముండపాపా మా బంగారే మీకు దొరికిందా?" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా రోజల్లా తిట్టింది. ఆతిట్లు వినలేక పక్కింటోళ్ళు తలుపేసుకున్నారు. పెద్దమ్మ అంతటితో ఆగకుండా ఆ ఊరి నాయుడు దగ్గరకు వెళ్ళి తగువు పెట్టింది. నాయుడు పక్కింటోలిని పిలిచి, పెద్దమ్మ సవడ బదులుగా ఒక గొర్రె పిల్లనిమ్మని తీర్పుచెప్పాడు.
    పెద్దమ్మ ఆ గొర్రెపిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. అది పెరిగి పెద్దదయింది.
    ఒక రోజు ప్రక్క వూరిలో జాతర జరుగుతుంది. అందరూ జాతరకి వెళుతున్నారు. పొట్టేలు(గొర్రె పోతు) పెద్దమ్మతో ఇలా అంది "పెద్దమ్మా పెద్దమ్మా అందరూ యాత్రకు వెలుతున్నారు, నేనుకూడా వెళతాను "అని. ఎప్పుడూ అడగనిది అడిగిందని చెప్పి డబ్బులిచ్చి, పంపించింది."చీకటి పడిపోయేంతవరకూ అవీ,ఇవీ చూసుకోని ఉండిపోకు,ఒకవేళ చీకటిపడితే రావద్దు. సుబ్బిశెట్టి గారింటికెళ్ళి ఇలగిలగ పెద్దమ్మ తాలూకా అని చెబితే అతను మర్యాద చేస్తాడు"అని జాగ్రత్తలు చెప్పి పంపించిచింది పెద్దమ్మ.
పొట్టేలు జాతరంతా తిరిగి కావలిసినవన్నీ కొనుక్కొని, చూడాల్సినవన్నీ చూసేసరికి పొద్దుబోయింది. సుబ్బిశెట్టి ఇంటికి వెళ్ళి ఇలగిలగ అని చెబితే అతను సామాన్ల గది చూపించి అక్కద పడుకోమని చెప్పాడు. ఆగదిలో ఒక బస్తా నిండా వజ్రాలు,మరో బస్తా నిండా రత్నాలు, ముత్యాలు, బంగారం,పగడాలు, ఒకటేమిటి? ఆసంపదను చుసేసరికి కొంచెం స్వార్దం పుట్టింది పొట్టేలుకు. ఒక్కో బస్తాలో కొంచెం కొంచెం బంగారు కాసులు,రత్నాలు,వజ్రాలు,ముత్యాలు అన్నీ మింగేసి పెందిలకదనే షావుకారికి చెప్పి బయలుదేరింది. నడవలేక నడవలేక వస్తున్న పొట్టేలు దారిన పోతున్న తలయారితో "నేను వచ్చేస్తున్నానని చెప్పి బొంత పరిసి,రోకలి సిద్దం చెయ్య"మని చెప్పింది. పెద్దమ్మ బెంగపెట్టుకోని ఏటిజరిగిండా అని ఎదురుచూస్తూ కూర్చుంది. జరిగిన సంగతంతా పెద్దమ్మకు చెప్పగా రోకలి తో కుడి ప్రక్క పొడిస్తే ఇన్ని వజ్రాలు నోటింట పడ్డాయట.ఎడమ ప్రక్క పొడిస్తే ఇన్ని రత్నాలు పడ్డాయట. పడిన సంపదని కొలవడానికి పక్కింటోలింటికి సోలకు వెళ్ళింది."ఏమిటి కొలుస్తాదా చూడాలని సోల అడుగున చింతపండు అంటించి ఇచ్చారు.
   కొలిచి గూనలోవేసి దాచింది పెద్దమ్మ. సోల వారిది వారికిచ్చివేసింది.సోల అడుగున వున్న రత్నాలను,వజ్రాలను చూసి అశ్చర్యపోయారు పక్కింటివారు. పెద్దమ్మ దగ్గరకి వచ్చి ఆరా తీయగా ఇలగిలగ అని చెప్పింది.
  పక్కింటోళ్ళు ఒక కుక్కను పెంచుతున్నారు. వారు ఆకుక్కకు ఇలగిలగ అనిచెప్పి యాత్రకు పంపారు. ఆ కుక్క యాత్రలో కనిపించినవన్నీ కొనుక్కొని తిని సాయంత్రానికి సుబ్బిశెట్టి ఇంటికిపడుకోవడానికి వెళ్ళింది. అర్ధరాత్రి నెమ్మదిగా సరుకుల గదిలోకి చొరబడి రత్నాలను మింగబోయింది. దురదృష్టం కలసి వచ్చింది. అదే సమయానికి శెట్టికి మెలికువ వచ్చింది,సామాన్లగది తెరిచి వుండడం చూసి,కర్రతీసి ఎవరు తీసారో చూడగా కుక్క కనిపించింది.అంతే కర్రతో నడుముకడ్డంగా ఒక్కటేశాడు. అంతే కైయ్...కైయ్... మంటూ కుక్క ఒకటే పరుగు.
   

Wednesday 7 November 2012


మురళి//నీలమా? ఎరుపా?//



చంద్రుని చుట్టూ గుడి కట్టిందంటే 

ఎండిన పైరుల గుండెలలో ఊపిరి 

నిండే జడి వానల తడి ఉంటుందని

ఎండిన డొక్కల రైతన్నల ఆశలు

అడియాశలు చేసిందిగదా ఈ నీలం



పొట్టకొచ్చిన పచ్చని పైరుపంటల చూసి

పొట్టనిండినదని పరవశమున రైతన్నలు 

పగిలిన నేలను చూసి గుండెపగిలి ఏడ్వగా

గుడి గట్టెనులే మడితడియును అని సంబరపడి 


ఘడియైనాకాకమునుపే ఓ నీలంతుఫాను

నీలుగుతూ నిక్కుతు నలుపెక్కిన రక్కసిలా

నిలువున ముంచెత్తుతు జడివానై కురియగ

అలజడి రేగెను అన్నదాత ఎడదలొ 


వరదల పాలైన ఏడాది రెక్కల కష్టం

ఐపోయెనులే బూడిదలో పోసిన పన్నీరు

రైతు కళ్ళల్లో నిండెన రక్తపు కన్నీరు



చేరిన వరదలు చెరువును తలపగ

బరువై బతుకులు, గుండెలు చెరువైపోగా

ఉండాలో, కడతేరాలో తేల్చుకోలేక 

తిండికికరువై రైతన్న తల్లడిల్లిపోగా

dt. 06-11-12

Monday 29 October 2012

మురళి// వాకబు //

నను వీడిన నిను మరువలేక

మనసంతా కల్లోలమై నిలువలేక


నీ తలపుల భావనలను విడువలేక

నువు నడయాడిన నందన వనిలో


నీజ్ఞాపకాల సోయగమును సోకాలని

నువు తాకిన తరు శాఖల వాలాలని


నినుతాకిన సుమ సౌరభాన్ని గ్రోలాలని

నువు సాకిన నీడజముల తాకాలని


నువు పెంచిన సుమతరువుల కాంచాలని

మనసు నిలువలేక వచ్చితినా....


మల్లెలనడిగితిని నీచిరునామాఎక్కడని

నిను జూసిన మల్లెలు తెల్లబోయినవట


తుమ్మెదలనడిగితిని నీకబురిమ్మని

నీఅధరమధురసాస్వాదనలో మైమరచినవట



మధుమాసమునడిగితిని నీపదముల జాడేదని

చామంతుల చూపించి ఈవన్నెలరాశిని

నిముషమునకుముందేకన్నానని చెప్పినది


కరిమబ్బునడిగితిని నీ అలికిడి ఏదని

మెరుపుతీగల నడుమ తెలుసుకోలేవట


జాబిల్లినడిగితే మలిసంధ్య వేళలో నీకన్నుల

కలువ రేకుల లో తొంగిజూసి మరిచెనట


పండువెన్నెలనడిగితిని మనసు తాలలేక

ముఖ చంద్రుని కాంచి చిన్నబొయినవట

dt 29/10/12

Thursday 25 October 2012


 చెమర్తకారి

ఒకరోజు భోజరాజు, కాళిదాసు మారువేషాలలో రాజ్య పర్యటనకి వెలుతున్నారు. ఒక గ్రామంలో ఉదయాన్నే ఒక

ఇల్లాలు కల్లాపి చల్లుతూ ఉంది. ఇంతలో దగ్గరలోని ఒక చెట్టుపై కాకి "కావ్ కావ్" మని అరిచింది. అంతే కల్లాపి పాత్ర

అక్కడే పడేసి,తన మొగుడ్ని వాటేసుకొని "ఓరి నా మొగుడో..." అంటూ భయపడి,వణికిపోతూ అతన్ని

వాటేసుకుందట.

    ఆ సన్నివేశాన్ని చూసిన భోజుడు కాళిదాసుతో "నారాజ్యం లో ఇంత పిరికివారు ఉంటారా"అన్నాడట. అప్పుడు

కాళిదాసు "పట్టపగలు కాకి అరిస్తే భయపడే ఆడది అర్ధరాత్రి కావేరీ నదిని అవలీలగా దాటిపోతుందట" అని అన్నాడు.

కావేరీ నదిలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. పగలే యెవ్వరూ దాటలేరు.

    కాళిదాసు చెప్పాడంటే నమ్మవలసిందే... అని గూఢచారులను నియమించి ఆమెను ఒక కంట

కనిపెట్టమన్నాడట.

   ఆమె తన ఇంటికి వచ్చిన కుక్కలను తలుపులేసి చంపి వాటి మాంసాన్ని ఒక బుట్టలో పెట్టి మొగుడుకి రాత్రి

భోజనం లో నల్లమందు కలిపి పడుకోబెట్టి అర్ధరాత్రి ఆ బుట్టను మోసుకుంటు కావేరీ నది దాటుతూ తనను

తినబోవడానికి వచ్చే మొసళ్ళకు ఈ మాంస ఖండాలను విసురుతూ కావేరీ నదిని అవలీలగా దాటిపోయి ఆవలి

తీరాన వున్న తన ప్రియుని రోజూ కలుసుకుంటుందట.

Wednesday 17 October 2012


మురళి// ఉపమానం //
మన స్నేహాన్ని పువ్వుతో పోల్చకు
ఎందుకంటే పువ్వు వాడిపోతుంది

మనస్నేహాన్ని కడలితో పోల్చవద్దు
ఎందుకంటే ఉప్పగా ఉంటుంది అది

మన స్నేహాన్ని మంచుతో పోల్చకు
ఎందుకంటే అది కరిగిపోతుంది చూడు

మన స్నేహాన్ని వసంతంతో పోల్చకు
శిశిరం వచ్చిందంటే మోడుబారిపోతుంది

మనస్నేహాన్ని కాలంతో పోల్చకు
ఎందుకంటే అది కదిలిపోతుంది

మనస్నేహాన్ని గువ్వతో పొల్చకు
ఎందుకంటె అది ఎగిరిపోతుంది

మన స్నేహాన్ని సుధతో పోల్చకు
ఎందుకంటే అది దేవతల సొంతం

మన స్నేహాన్ని తేనెతో పోల్చకు
ఎందుకంటే అది ఎత్తులో ఉంటుంది

మన స్నేహాన్ని స్వర్గంతో పోల్చకు
ఎందుకంటే అక్కడ అనుబంధాలుండవు

మరి దేనితో పోల్చాలి...........

అవినీతితో పోల్చు
ఎందుకంటే అది శాశ్వతంగా ఉంతుంది

అన్యాయంతో పోల్చు
ఎందుకంటే అదెప్పుడు తరిగిపోదు

అధర్మంతో పోల్చు
అదెప్పుడూ నాలుక్కాళ్ళతో నడుస్తుంది

లంచగొండితనంతో పోల్చు
అది వేళ్ళు పాతుకు పోయింది

దారిద్యంతో పోల్చు
అది అంతులేనంత ఉంది

పేదరికంతో పోల్చు
అది దిదినాభివృద్ధి చెందుతూవుంది

తే 17/10/12 దీ రాత్రి 7.45










Sunday 14 October 2012


మురళి//ఆరాటము//
మధుమాసపు వెన్నెలలో
మరుమల్లెల జల్లులలో
మదిని దోచిన చిన్నది
ఎచట దాగి యున్నది
ఎదుట రాకయున్నది

నీ బుగ్గమీది  నిగ్గు చూచి
అరవిరిసిన గులాబి మొగ్గ
సిగ్గులతో తలదాచుకున్నది
నా చెంపకెంత చెలగాటమో
నీ బుగ్గపైన నిగ్గులన్నినిమరాలని

నీ పెదవులపై  మధువుజూచి
తనివితీర తాగాలని తుమ్మెద
సంపంగి ముక్కు జూసి వెళ్ళి పోయె
నా పెదవులకెంత పరితాపమో
నీఅధరసుధామధురసాన్ని గ్రోలాలనీ

నీ మోము కాంతి మెరుపు చూసి
చందమామ సిగ్గుతో మంచు దుప్పటి
తీసి ముఖముపై కప్పుకున్నది
నా కన్నులకెంత ఉబలాటమో
నీకన్నులతో బాసలు చేయాలని

నీ మేని చాయ మెరుపు చూసి
విరబూసిన చిరుచామంతి
సిగ్గుతో ముఖము చాటువేసింది
నా యెడదకు యెంత ఆరాటమో
నీయెద పైన పదిలంగా వాలాలని
తే14/10/12దీ రాత్రి 9.00




Friday 12 October 2012

మురళి// విస్మయము//

చంద్రుని చూస్తే కలువలు వికసిస్తాయి అంటారు

మరి చంద్రునిలోనే కలువలు వికసించాయేమిటి?


నీటి లో చేపలు విహరిస్తూవుంటాయంటారు 

కానీ చేపలలోనే నీరు ఉంది ఎందుకు?


కలువలపై తుమ్మెదలు వాలుతాయంటారు

మరి కలువలే తుమ్మెదలైనాయేమిటీ?


సంపంగి దక్కరకు తుమ్మెదలు రావు అంటారు?

ఐనా సంపంగి ఇరువంకలా తుమ్మెదలున్నాయి!?



చంద్రునిలో చంద్రులు ఉదయిస్తాయా ఎప్పుడైనా?

చంద్రునిలో పలువరుసచంద్రికలు వెన్నెలలు కాసాయి



గిరిశృంగముల పై పయోధరములుంటాయి గానీ

పయోధరముల పై గిరిశృంగములున్నాయేమిటి?


జలధరంబుల దాటి చంద్రబింబముండు కానీ

చంద్రబింబము పైన జలధరంబులున్నవేమి?



ఇట్లు చూపరులకు విస్మయము కల్గునట్లుగా

కనులు,ముఖము,ముక్కు,పలువరుసలు,

కురులు,పయోధరములు అమరియున్నవి.


తే 12/10/12దీ 8.45 రాత్రి

Thursday 11 October 2012


మురళి// పొంగడాల చెట్టు //
 ఒకరోజు పేదరాశి పెద్దమ్మ సోలు ఎండబోసిందట. ఒక అడవి పంది ఆ చోలుని తినబోతే పెద్దమ్మ చేటతో కొట్టిందట. చేటడు వెంట్రుకలు రాలాయాట,వాటిని పులుసులో వేసి కొడుకులకు వడ్డిస్తే వారు అడిగారు."ఈ రోజు పులుసు రుచిగా వుంది, ఏమిటి కలిపావు" అని.పెద్దమ్మ విషయం చెప్పింది.ఐతే ఆఅడవి పందిని వేటాడి పట్టుకొస్తామని బయలుదేరి వెళ్ళారు వారంతా.
     వెళ్ళినవాళ్ళు రెండు రోజులైనా తిరిగిరాకపోయేసరికి చిన్నోడితో చెప్పింది. చిన్నోడు ఒక చురకత్తి పట్టుకు బయలుదేరాడు. అడవిలో వెతకగా వెతకగా పందుల జాడ తెలిసింది. అటుగా వెళ్ళి వాటిని వుల్లగించాడు.ఒక పెద్ద అడవిపంది వీడిపై తిరగబడి మింగేసింది.కడుపు లోపల అన్నలందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు అడిగారు"నువ్వు ఇక్కడికెలాగ వచ్చావు"అని.ఇలగిలగ అనిచెప్పాడు చిన్నోడు.చురకత్తి తీసి పంది కడుపుని కోసుకొని అందరూ బయటపడ్డారు.పందిని ఒక పెద్ద కర్రకు కట్టి ఇంటికి తీసుకు వచ్చారు. పెద్దమ్మ వీళ్ల రాకకు సంతోషించి, వారిని స్నానానికి వెళ్ళమని చెప్పి మాంసం వండింది.మిగిలినది ఊరందరికి పంచింది.కొడుకులు వస్తే వారికి వరుసగా వడ్డించింది. ముందు పెద్దోడు,తరువాత రెందోవాడు అలా...చివరకి చిన్నోడు.అందరూ కొసరి కొసరి వడ్డించుకోగా చిన్నోడి దగ్గరికి వచ్చేసరికి మాంసం అంతా అయిఫొయింది. ఆఖరుకి ఆ ఇగురులో అన్నం పొరిపి వేసింది చిన్నోడికి. అందరూ ఆవురావురుమని తింటున్నారు.చిన్నోడు "ఒరే పెద్దన్నా పెద్దన్నా ఒక్క సితకియ్యురా" అని,"అబ్బా నేనెందుకిస్తాను" అన్నాడు వాడు."ఒరే రెండన్నా, రెండన్నా చిన్న ముక్కియ్యురా" అంటే వాడూ ఇవ్వలేదు. ఇలా అందరినీ అడిగితే అందరూ "ఇవ్వము" అన్నారు. చివరకు చిన్నన్నను అడిగాడు. వాడు చీకి చీకి ఒక దుమ్ము ఇచ్చాడు. ఆదుమ్ముని సప్పరించుకోని జోబులో దాచుకున్నాడు.
     మర్నాడు ఆవులను మేతకు తోలుకెలుతూ దుమ్ము తీసి చీకుతూ వున్నాడు. అది కాస్తా జారిపోయింది,ఒకపుట్టలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు.అప్పుడన్నాడు"నేను రేపు ఈ యేలకి వొచ్చీసరికి మొక్కవ్వకపోయావో పెద్దన్న గొడ్డలి తో ఒక్కటేసేస్తాను".మరుచటి రోజుకి మొక్కైంది.వచ్చాడు,చూసాడు,మళ్ళీ అన్నాడు"రేపీపాటికి పొంగడాల చెట్టవ్వక పోనావా చిన్నన్న గొడ్డలితో నరికేస్తాను". మరచటినాటికి చెట్టై పోయింది.మళ్ళీ అన్నాడు"రేపీపాటికి పువ్వులుపూసి కాయలు కాయకపోయావో నడిపన్న గొడ్డలితోటి అడ్డగ నరికేస్తాను.మరునాటికి కాయలు కాసింది."రేపొచ్చేసరికి పొంగడాలు పండకపోయావో అన్నకొక గొడ్డలి తెచ్చి అన్ని ముక్కలు చేసేస్తాను" అన్నాడు చిన్నోడు.
     ఎప్పుడెప్పుడు తెల్లారుతాదా అని ఎదురుచూసాడు. చివరకు తెల్లారేసరికి, పొంగడాలవాసన వస్తే చెట్టుదగ్గరకి వెళ్ళాడు చిన్నోడు పలకర్ర చేసుకోవడం మరిసిపోయి చెట్టెక్కి పొంగడాలను తెంపుకోని తింటున్నాడు. ఆవాసనకి పెద్దన్న వచ్చాడు,ఒరే చిన్నోడా ఒక్క పొంగడమియ్యురా అంటే "నువ్వు చిన్న సితకియ్యురా అంటే ఇచ్చావేటి? నేనివ్వను" అన్నాడు,"మాతమ్ముడువికదూ ఈసారి ఇస్తాలే" అన్నాడు అన్న.అప్పుడు చిన్న పిసరంత ఇచ్చాడు.అలగే అందరూ వచ్చి అడిగితే అలగే చిన్నపిసర్లు ఇచ్చి పంపించేశాడు. చివరకు చిన్నన్న వచ్చి అడిగితే "ఓరె నీకెందుకివ్వనేస్ చెట్టెక్కురా నీకెన్ని కావాలంటే అన్ని తినురా" అని అన్నాడు. ఇద్దరూ అన్ని పొంగడాలూ తినేశారు.
dt 11/10/12.8.00PM.

Wednesday 10 October 2012


మురళి//తొట్రుపాటు//
కురుల సంపద చీకటిగొన్న అపరాదమేమియని
మానసమందు అనునయించు నంతలో
ముఖచందురుని వెన్నెల కాంతుల గని విస్తుపోయె

చిన్నబోయిన పెదవుల సిగ్గులను జూచి చింతించి
అధరసుధారసాపూరముల ధారల గ్రోలి
పరవశమ్మున మధురసాస్వాదనమున మునిగిపోయె

మృదుల కోమలయుతమైన కరయుగము గాంచి
మధుర భావనమున మదిని మెచ్చుకొనగ
కఠిన కర్కష పాషాణ సదృశ పయోధరము గాంచి
సద్భావము నంతయు సమసు కొనియె

నిరుపేద తనుమధ్యమ కడుదీన స్థితిని గాంచి
జాలిపడి, బాధపడి, మనసున కలతనొందె
ఒత్తుకొనివచ్చు కుచకుంభోద్వృత్తి జూచి
విస్మయంబు గొలుప విషమచిత్తమయ్యె

క్షీణగతినున్న ఉదరపు కడు(పు)పేద స్థితిని జూచి
కారుణ్యభావముదయింప ఎడదను తల్లడిల్లె
దృత్యోన్నతోధ్రుతినున్న కటివలయము గాంచ
కారుణ్యభావమంతలో అంతరించె

వైవిధ్యభరితమైన అంగాంగనను గాంచి
విషమాకృతులు చూడ్కికి తొట్రుకొనగ
రాత్రి7:35... తే10-10-12దీ


మురళి//తొట్రుపాటు//
కురుల సంపద చీకటిగొన్న అపరాదమేమియని
మానసమందు అనునయించు నంతలో
ముఖచందురుని వెన్నెల కాంతుల గని విస్తుపోయె

చిన్నబోయిన పెదవుల సిగ్గులను జూచి చింతించి
అధరసుధారసాపూరముల ధారల గ్రోలి
పరవశమ్మున మధురసాస్వాదనమున మునిగిపోయె

మృదుల కోమలయుతమైన కరయుగము గాంచి
మధుర భావనమున మదిని మెచ్చుకొనగ
కఠిన కర్కష పాషాణ సదృశ పయోధరము గాంచి
సద్భావము నంతయు సమసు కొనియె

నిరుపేద తనుమధ్యమ కడుదీన స్థితిని గాంచి
జాలిపడి, బాధపడి, మనసున కలతనొందె
ఒత్తుకొనివచ్చు కుచకుంభోద్వృత్తి జూచి
విస్మయంబు గొలుప విషమచిత్తమయ్యె

క్షీణగతినున్న ఉదరపు కడు పేద స్థితిని జూచి
కారుణ్యభావముదయింప ఎడదను తల్లడిల్లె
దృత్యోన్నతోధ్రుతినున్న కటివలయము గాంచ
కారుణ్యభావమంతలో అంతరించె

వైవిధ్యభరితమైన అంగాంగనను గాంచి
విషమాకృతులు చూడ్కికి తొట్రుకొనగ
రాత్రి7:35... తే10-10-12దీ

Tuesday 9 October 2012


స్నేహమనే కొలనిలో
చేపను నేనైతే......
గాలం వేసి గాయం చేస్తావో
గాయం చేసి ప్రాణం తీస్తావో
గాలై వీచి ప్రాణం పోస్తావో!

స్నేహమనే కడలిలో
పడవను నేనైతే.....
సుడివై నడి ముంచుతావో
చుక్కానివై దారి చూపుతావో
తెరచాపవై దరి చేర్చుతావో!

స్నేహమనే తోటలో
పువ్వును నేనైతే....
తుంటరివై త్రుంచెదవో
గొంగలివై మ్రింగెదవో
తుమ్మెదవై మధు గ్రోలెదవో!

స్నేహమనే కొండపై
బండను నేనైతే....
సమ్మెటవై పిండిని చేసెదవో
ఉలివై ప్రతిమను మలిచెదవో
గుడి గుండియలో నిలిపెదవో!

స్నేహమనే వసంతంలో
కోయిల నేనైతే....
బోయవై గొంతు కోసెదవో
మావివై చిగురునిచ్చెదవో
శ్రోతవై గానము మెచ్చెదవో!

Monday 8 October 2012




ఓ వాలుకన్నుల వయ్యారీ
నీ ఓర చూపులు విసరకే

ఓ కొంటె చూపుల కోనంగీ
జుంటి తుమ్మెదలంపకే

ఓ చేపకన్నుల చిన్నారీ
చూపు బాణాల విడువకే

ఓ మొలక నవ్వుల నెలవంకా
మనసు నంతను దోచకే

ఓ లేత బుగ్గల లలితాంగీ
గుండెలలజడి లేపకే

ఓ చురిక చూపుల సంపంగీ
గుండె కోతను కోయకే

ఓ చంద్రకాంతుల చిరుదంతీ
వేడి వెన్నెల విరియకే

ఓ బృకుటికా దనుర్ధారీ
వలపు బాణాలను వేయకే

ఓ నీలి కురులా నీలవేణీ
మరుల వింజామర దాచకే

ఓ చొట్ట బుగ్గల సొగసరీ
బెట్టు ఇంకను మానవే

ఓ మందహాసపు మరుమల్లీ
మదిని మంటలు రేపకే

Thursday 4 October 2012

  ***సితా జననం***
బూమిలో పుట్టింది -వారుద్ర పురుగూ
మేగాన పుట్టింది- అది మెరుపు గన్నె
తమ్ముడా ఇబీషణా- తొందరగా బయలెల్లు
యేటలకె యేల్లాలా- అడవెల్ల తిరగాల
లంక సుట్టూ తిరిగి-లంక వనముల తిరిగి
వనముల్లా తిరిగి- వేటలే ఆడారూ
ఆవనములోపలా- ఎర్రనీ కండా
ఎర్రనీ కండనూ- ఏటలే ఆడారు
మంసమూ ముద్దనూ-మండోద్రి కిచ్చీ
వండవే మండోద్రి - కండనూ వండవే
వండబోయి మండోద్రి- కుండలో బెట్టి
కుండలోన మండోద్రి- కండనే బెట్టే
మూడు రోజుల్నాడు- రావణులె అడిగే
వోలోలె మండోద్రి-వయ్యారి మండోద్రి
మొన్న తెచ్చిన కండా-కూరసెయ్యావే
కుండ మీదన కుండ- మూత జూసేనా
మూత తీసిన కుండా-యెత్తిజూసేనా
మూడురోజుల నాడూ- బాలసినదాయే
బాలలాగా మారి- మెరుపుతీగలాగా మారీ
దీనిజూసి నామొగుడూ-నన్నుమరిసేడూ
కంసాలోడి కాడా-కనకాల పెట్టొకటిజేసీ
బాలాకు తగ్గట్టు- పెట్టొకటి జేసీ
పెట్టిలో బాలాను- బద్రంగా పెట్టి
ఇరిసి కట్లూ గట్టీ- మారు కట్లూ గట్టీ
అలాగ మండోద్రి- బుర్రకెత్తేనా
నట్టేట సంద్రంలో- పెట్టి ఇసిరేనా
జనకులవారేమో-ఏరుబూసేరూ
నాగలీ పట్టుకొనీ- సాలుదున్నేరూ
సాలుకూ ఆపెట్టీ- తగలగా ఆపి
పెట్టెలో ఏముందో- డబ్బు దనముందో
దనముంటె పంచెదనూ-బిడ్డాంటే పెంచెదనూ
బిడ్డనే గాంచీ- ఇడ్డూరమొందీ
ఇంటికీ తీసుకెళ్ళి- ఉయ్యాల్లోవేసె
ఊరంత కదిలిందీ- జోల పాడిందీ



సేకరణ: //మురళీ//*** శ్రీకాకుళం జానపద సాహిత్యం***తే04-10-2012దీ
గ్రంధాలలో దొరకని జానపద సాహిత్యం తరతరాలుగా శృతిస్మృతులుగా పరంపరగా
వస్తున్న జానపద సాహిత్య సంపద యాచకవృత్తి చేసే మాలదాసర్లు,యెరుకలి వాళ్ళు
బుడబుక్కల వాళ్ళు, వొగ్గు కధకులు చెప్పేవాళ్ళూ మొదలైన జానపదులు పాడుకొనే
ఈ గేయాలు నేడు కనుమరుగైపోతూ ఉంటే , ఎక్కడో ఎవరి స్మృతి పదం లోనో మిగిలినవి,
ముఖ్యంగా రామాయణ, భారత ఇతివృత్తాలుగా వున్నవాటిలో కొన్నిమీ ముందుంచుచున్నాను.
***శ్రీరామ జననం***
సిర సాగ్రము పైని -సిద్విలాసుండు
సేసతల్పమూ పైని -పవలించియుండి
అమురులందరితోడా-ఆమునులంతా కూడీ
ఆ రావణూ బాదలకూ- బరియించా లేకా
సీర సంద్రములోన - పడి సావబోగా
అమరులంతా కలిసీ- ఆమునులంతా కలిసీ
ఆదివిష్ణు పాదాలూ- అమరంగా పట్టీ
ఆ విష్ణువావేలా- అబయమొసగేరూ
కరుణించి కమలాచ్చు-కనికరించేరూ
కడుపుణ్యవతియైనా- కౌసల్య గర్భాన
రాముడై జలిమించీ- ఐవోజ్యయందూ
ఆదిశేసువుబుట్టె-లచ్చనామూరితియై
సెంకుసెక్కరాలే-బరత సెత్రికులుగా
అవతారమెత్తేరూ-అవని లోపలనూ
బాలచందురినిలా- దినదినము వుద్దియై
ఆటపాటల తోడ-ఆనందముల తోడ
తల్లిదండ్రులకెల్ల -తనివితీరంగా
కడుబాల్యమందునా- కవుసికిని వెంటా
వనములకె వెళ్ళారూ-విలువిజ్జె నేర్చారూ
మంత్రంబులను నేర్చి- మర్మములను తెలిసి
అకిల విద్దెలనెల్ల- అలవోకగా నేర్చి
యాగమును కాసారూ- రక్కసుల జంపారు
మునులు ఆనందింప- సురలు పువ్వులనొంప

Tuesday 2 October 2012

మురళీ// బెమ్మరాచ్చసి //
    ఒకరోజు తోటలొ పరింపళ్ళు ఏరుతున్న పెద్దమ్మ కూతుర్ని ఎలుగుబంతి ఎత్తుకుపొయింది.ఆవిషయం అఊరి బారికోడు పెద్దమ్మతో చెప్పాడు.పెద్దమ్మ తన పెద్దకొడుకులతో తమ చెల్లిని విడిపించుకురమ్మంచుకురమ్మని చెబితే "అమ్మో మేమేళ్ళము.మమ్మల్ని చంపెస్తాది ఎలుగుబంటి" అని చెప్పి తప్పించుకున్నారు. చిన్నోడుతో చెబితే సరే అని చెప్పి బళ్ళెం పట్టుకు బయలుదేరాడు.అలా వెళుతుండగ చాకిరేవు దగ్గర గడిదలు మేస్తున్నాయి. సూరయ్యనడిగి ఒక గాడిదను అద్దెకు తీసుకున్నాడు. దారిలో ఒక కుమ్మరోడు కుండలు కావిడిలొ వేసుకొని ఎదురైనాడు. వాడి దగ్గర ఒక పెద్ద బాన కొని గాడిదపై పెట్టి వెలుతున్నాడు. అలా వెలుతుంటే ఒక మేదరోడు కనిపిస్తే వాడి వద్ద ఒక పెద్ద చేట కొన్నాడు.కొంత దూరం వెళ్లాక పారలమ్మే కమ్మరోడు ఎదురైతే వాడి దగ్గర ఒక పార కొన్నాడు.అలాకొంతదురం వెళ్ళాక గునపాం(గడ్డపర) లమ్మే వాడు ఎదురైతే ఒక గునపం కొన్నాడు.కొంతదూరం వెళ్ళాక ఒక పడుగులు(పెద్ద లావుపాటి తాడు)అమ్మేవాడు కనిపిస్తే వాడి దగ్గర ఒక పెద్ద పడుగు కొన్నాడు.ఇంకాకొంత దూరం వెళ్ళాక నక్కు(మొన కల్గిన ఇనుప కడ్డీ)లు అమ్మే అతను కనిపిస్తే ఒక నక్కు కొనుక్కొని అవన్నీ గాడిదపై వేసుకొని తిన్నగా ఎలుగుబంటి ఒండకు వెళ్ళాడు.
         అక్క చిన్నోడిని పలకరించి "ఎలుగుబంటి చూసిందంటే నిన్ను అమాంతం మింగెస్తది. వెళ్ళి అటక పై దాగో"అన్నది."అయితే వీటన్నిటినీ అటక పైకి తీసుకు వెలతాను" అంటే " అలాగె" అన్నది. ఒక కుంపటి లో నిప్పులు వేసి నక్కును అందులొ పెట్టి విసనకర్రతో విసురుతూ ఎర్రగా కాల్చాడు.ఇంతలో ఎలుగుబంటి వచ్చి అన్నం వడ్డించమన్నది. పెద్దమ్మ కూతురు అన్నం వడ్డిస్తే తింటూ నెయ్యి వెయ్యమంది. అటక పై వున్న నెయ్యిని కుంపటిలో వేసి అందులొ గాడిద మూత్రం ను వేసి కిందికి విసిరేసాడు చిన్నోడు. "మీదను ఎవులున్నారు "అని అంటె పిల్లులు అని సర్దిచెప్పింది అక్క. సరేలే అని మూత్రం ను అన్నంలోకలుపుకొని తింటూ "ఏమిటో ఈరోజు నెయ్యి చాలారుచిగా ఉందని పళ్ళెం నాకేసి మరీ తిన్నాడు. అటక పై మళ్ళీచప్పుడు. మీదికెళ్ళి పిల్లులని తరిమేస్తనుండు అంటే అవే పోతాయిలే అని సర్దిచెప్పింది వీడి అక్క. ఇంతలో మళ్ళి చప్పుడు. "పిల్లి కాదు ఏదో ఉంది అటక పైన బుడ్డీ(దీపం) ముట్టించు చూస్తాను"అంది ఎలుగుబంటి. చిన్నోడు "నేను బెమ్మరాచ్చసుడ్ని నిన్ను మింగేస్తాను "అన్నాడు. అప్పుడు ఎలుగుబంటి"ఐతే నీ పల్లు(దంతాలు) చూపించు అంటే పార చూపించాడు.నీ గోలు చూపించు అంటే గునపం చూపించాడు.నీ చెవులు చూపించు అంటే చేటలు చూపించాడు. నీ కడుపేది అంటే బానను చూపించడు. నీ తోకేది అంటే పడుగు(పెద్ద లావుపాటి తాడు)ను కిందికి వదిలాడు. ఐతే నా అరుపు చూడని బబ్బబ్బ అని గ్ట్ట్గ అరిచింది ఎలుగుబంటి. చిన్నోడు నక్కు(మొన కల్గిన ఇనుప కడ్డీ)ను గాడిద పై మోపాడు అంతే గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.ఓరినాయనొ ఇంతపెద్ద బెమ్మరాచ్చసా అంటూ ఎలుగుబంటి భయపడిపొయి పరుగు లంకించుకుంది.చిన్నోడు అక్కను తీసుకొని ఇంటికి క్షేమంగా వచ్చేసాడు.

Monday 1 October 2012

మురళీ//  వరం  //01-10-2012
వెయ్యేళ్ళ తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై
ఏదైనా వరం కోరుకోమంటే ఒక ముని "మరుజన్మలో మళ్ళీ నన్ను
ఈ దేశం లోనే పుట్టించు"అని కోరుకుంటాడు.
అంత సరదా ఏమిటని బ్రహ్మ అడిగితే
"నా దేశం పాడి పంటల నిలయం
అవినీతి మచ్చుకైన కనిపించదు
అన్యాయం అంటే ఏమిటో తెలీదు
అధర్మానికి అస్సలు తావే లేదు
మనిషిని మనిషిగా చూస్తారిక్కడ
బంధాలూ అనుబంధాలు ఉంటాయిక్కడ
పరులసొమ్మును పాములా చూస్తారు
పర స్త్రీని పరాశక్తిగా కొలుస్తారు
పరమత సహనం ఇంకా ఎక్కువ
కులమత భేదాలే కనిపించవిక్కడ
ప్రాంతీయ తత్వం అంటే తెలియదు
భాషా భేదం లేనే లేదు
మత కలహాలే కానగరావు
మతభేదాలే మచ్చుకు లేవు
స్వార్ధపు చింతన చూడగలేము
స్వ ఆర్జన అన్నది చస్తేలేదు
అన్న విక్రయం అసలేలేదు
దానధర్మాలకు కొదువేలేదు
ఇలాంటి దేశం లో పుట్టిస్తే నా జన్మ ధన్యం"
సరే నీఖర్మ అనుభవించు
అంటూ వరమిచ్చి అదృశ్యం అయ్యాడు బ్రహ్మ

Monday 24 September 2012

మురళి // అమెరికా వాడి 'అమ్మపాలు' ఐస్ క్రీం పార్లర్//

అమెరికా వాడు అమ్మ పాలు తాగితే కదా 
వాడికి అమ్మ పాల రుచేమిటో తెలిసేది.
డబ్బుంది కదాని డబ్బాలే కొంటాడు.
డబ్బా పాలే అమృతం అనుకుంటాడు.

వాడి అమ్మ చైల్డ్ కేర్ సెంటర్లో పెడితే
వీడేమో అమ్మని ఓల్దేజ్ హోం లో ఉంచుతాడు
ధన సంపాదనే లక్ష్యం గా బ్రతికే వారికి
అమ్మ పాల కమ్మదనం ఏమి తెలుస్తుందిలే

అనురాగం అన్నది ఒకటుందని వాడికేమి తెలుసు
అది ఎంతకి దొరుకుతుంది? కొంటానంటాడు.
మమకారం అంటేమిటో వాడికేమి తెలుసు?
అది ఎక్కడ దొరుకుతుంది? అడుగుతాడు వాడు 
(భాస్కర్ II అమ్మ పాలు అమృతం II కవితకు స్పందన గా)
మురళి//గుజ్జనగూళ్ళు//
కవిత రాద్దామని కూర్చుంటే
కలం కదలడం లేదు.

విసిగిపోయిన కలం 
తన సిరాను ఎండబెట్టింది.

ఊహలు పదాల కొసంవెంపర్లాడితే
పదాలు భావాల కోసం పరుగులు తీసాయి.

వస్తువునకు దొరకని భావం
కలాన్ని పస్తులు పెట్టడం ఏం భావ్యం.

పదాలంటున్నాయి... 
మేం బిజీగా ఉన్నామని,

సమాజం లోని కుల్లును కడగడం లో
కవులకు సాయం చేద్దామని 

వారి భావాల మాటున దాగున్నాయట.
వారి ఊహల ఊయలలో ఓలలాడుతున్నాయట.

భావాల కోసం వెళ్లిన పదాలు 
ఆ జల్లులలో తడిచి ముద్దౌతున్నాయట.

నే పిలిస్తే వస్తానుండు, 
కొంచెం ఓపిక పట్టు అంటున్నాయి.

కవి కాల్పనిక లోకం లో
కాసేపు విహరించాలంటున్నాయి. 

రవి కాంచని అందాలను 
పరవశమున చూస్తున్నాయట.

కవి అనే గిజిగాడు కడుతున్న గుజ్జన గూటికి
ఊహలై, సన్నని ఈనెలై సహకరిస్తున్నాయట

మనసుకందని భావాలకై ఊహలనే రెక్కలతో
మకరందం కొసం తావి అనుకొని కాగితం పై 

పిచ్చి పిచ్చిగా పరుగులు తీస్తున్నాయట.

Friday 21 September 2012


పెద్దమ్మ ఇంటి ముందు ఉన్న తులసిమొక్కలు వాడిపోయాయి."ఓరి నాయనో ఓరి దేవుడో నా కొడుకులు ఆపదలో ఇరుక్కున్నారో " అంటూ దొర్లి దొర్లి ఏడుస్తుండట పెద్దమ్మ. దారిన పార్వతీ పరమేస్వరులు వెళ్ళిపోతూ మారు వేషాల్లో అక్కడికి వచ్చి, "నీ కొడుకులూ, కూతురూ క్షేమంగానే ఉన్నారు"అని చెప్పి, ఒక మిరపకాయ ఇచ్చి "సల్లందితో నంజుకుంటే నికు సీమ్మిరపకాయలాటి కొడుకు పుడతాడు. వాడు అందరిని విడిపించుకొస్తాడు"అని చెప్పి అదృశ్యం అయిపోయారు.
కాలపోలికి తొమ్మిది నెలలు, ఆకాలపోలికి తొమ్మిది ఘడియలు అనంట్లే ఒక కొడుకు పుట్టాడు.చిన్నోడు అని పేరు పెట్టింది. పుట్టీపుట్టగానే పుట్టిడు నూకలజావ తినీసాడట."అమ్మా నేనొక్కడ్నేనా నాతోడ ఇంకెవరైనా ఉన్నారా?"అని అడిగితే జరిగినదంతా చెప్పింది పెద్దమ్మ. ఒక పెద్ద బళ్ళెం పట్టుకొని బయలు దేరాడు.
చిన్నోడికీ చెరుకుల బండీ,బెల్లం బండీ,చుట్టల బండీ కనబడ్డాయట. బండి నాయుడ్లు తిరిగొచ్చీసరికి అవన్నీ అవ్వజేస్సినాడట.తోవలో ఊబి దగ్గరాగి అక్కడున్న జనాన్ని ఎలుగుబంటి జాడ గురించి అడిగితే "దాని ఊసు నీకెందుకు ?భూమికి బుక్కడు లేవు,"అన్నారు.అప్పుడు చిన్నోడు" నేను మా అప్పని, మా అన్నల్ని ఎలుగుబంటినుంచి విడిపించడానికి వెల్తున్నాను" అన్నాడు. "నువ్వుగాని బండిని ఎగ్గొట్టిస్తే అంతపనోడివేనని ఒప్పుకుంటాం" అన్నారు వారు. ఒక మునకాల కర్ర తీసుకొని దాని చివర ఒక మేకు దిగ్గొట్టి ,నొగ ఎక్కి ఒక ఎద్దు తోక మడిచి మరో ఎద్దు ముడ్డి మీద మునకాక కర్రతో ఒక్కటేసినాడట అంతే ఆబాధకు ఒక్కసారి ఎద్దులు ముందుకురికినాయి. బండి ఎగబడిపోయింది. "వీరాధి వీరుడు శూరాధి శూరుడని పొగిడి,చీమ్మిరపకాయకే వర్రెక్కువ" అంటూ "ఎలుగుబంటిని జయించి విజయుడవై తిరిగిరా" అని దీవించి పంపారు.దారిలో ఒక ఏరు. ఆఏటింట చీమలు కొట్టుకుపోతున్నాయి. చీమల్ని ఒడ్డుకు తీసి కాపాడాడు చిన్నోడు. అప్పుడాచీమలు "ఎప్పుడైనా మాఅవసరమొస్తే అప్పుడు మమ్మల్ని తలుచుకో మేము వచ్చి సాయం చేస్తాము" అని చెప్పాయి.
       చిన్నోడు ఎలుగుబంటి ఒండ చేరుకొని ఎలుగుబంటితో "మా అన్నల్ని,అప్పను ఎక్కడ దాచావో చెప్పు? మర్యాదగా వాళ్ళని అప్పగించావా సరే లేకపోతే నిన్ను చంపెస్తాను"అని బళ్ళెం ఎక్కుపెట్టాడు. "సర్లే గాని నేను ఏటికెళ్ళి తానం పోసుకొని వచ్చీసరికి ఈసోలూ, నూకలూ వేరుచేసీయాల అలా చేస్తే నన్ను చంపి మీవాళ్ళని తీసుకుపోదువు గాని, లేకపోతేనిన్ను మింగెస్తాను"అంది. "పందెం అంటే పందెం' అని ఏటికి వెళ్ళీపోయింది. అప్పుడు చీమలు గుర్తుకొచ్చాయి. వెంటనే తలచుకోగా గింజకొక్క చీమ వచ్చి అన్నింతినీ వేరు చేస్సాయి. కొంతసేపటికి ఎలుగుబంటి వచ్చి చూసి, పందెం లో ఓడిపోయినట్లు ఒప్పుకొని లొంగిపోయింది. అన్నలనీ అక్కను విడిపించి ఎలుగు బంటితో "ఇకనైనా భుద్ధిగా బతుకు "అని చెప్పి ఇంటికి తీసుకుపోయి అందరూ హాయిగా ఉన్నారట.

మురళి// పందెం//
    అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాసి పెద్దమ్మ ఉండేదట. ఆమెకు ఏడుగురు కొడుకులు ఒక కూతురూ ఉన్నారట. ఒక రోజు పెద్దమ్మకు ఒంట్లో బాగోపోతే కూతుర్ని పూలు కోసుకు రమ్మని అడవికి పంపిందట. అడవిలో ఒక ఎలుగుబంటి ఆమెను ఎత్తుకు పోయిందట. విషయం తెలిసి పెద్దమ్మ తన కొడుకులకు చెబితే వారు ఏడు తులసి మొక్కలు నాటి ఇవిగాని చనిపోతే మాగురించి చూడక్కరలేదు. ఒకవేళ ఓడిపోతే మాకేదొ ఆపద వాటిల్లినట్లుగా,బివి బతికేవుంటే చెల్లిని క్షేమంగా తీసుకువస్తామని ఆనిక పెట్టి ఎలుగుబంటి జాడ కనుగొనేందుకు బయలుదేరారు.
        దారిలో ఒక చెరుకుల బండి కనిపించింది. బండి అతను "మీరెక్కడికి వెలుతున్నారు" అని అడిగితే "మేము ఎలుగుబంటిని చంపడానికి వెలుతున్నాం " అన్నారు. "మీరు అంతటి వీరులైతే నేను పలకర్ర చెసి వచ్చేలోగా బండెడు చెరుకులను తినీయాలి"అని చెప్పి బండి అతను వెళ్ళాడు.అతను తిరిగి వచ్చేసరికి ఒక్క బొద్దు కూడా తినలేక పోయారు."ఓరెళ్ళర్రా ఎలుగుబంటిని సంపెత్తారట" మొదటి దానికి మోగుడు లేకపోతే కడదానికి కళ్యాణమాట" అని అనుకొని తన దారిని తాను పోయాడట.
         అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక బెల్లపుకుండల బండి ఎదురైందట."ఓయ్ బండి నాయుడూ నీకుగాని ఎలుగుబంటి కనిపించిందా?" అని పెద్దమ్మ కొడుకులు అడిగారు.అతను  "లేదు, ఆబంటి ఊసు మీకెందుకు?" అన్నాడు. దాన్ని సంపీసి మాచెల్లెల్ని విడిపించుకు వస్తాము" అన్నారు వీరు. అప్పుడు బండి అతను "అంతపాటి ఈరాది ఈరులైతే నేను మొకం కడుక్కోనొచ్చేసరికి గాని మీరు బండెడు బెల్లం తినేస్తే అప్పుడు ఒప్పుకుంటాను" అని చెప్పి వెళ్ళాడు.అతను తిరిగి వచ్చేసరికి వీరు ఇంకా ఒక్క కుండనే బక్కురుతున్నారు."ఉట్టికెగర్లేనమ్మ స్వర్గానికెగిరిందట" అంటూ తన దారిని పోయాడట బండివాడు.
ఇంకాస్తా దూరం వెళ్ళేసరికి ఒక చుట్టలబండి కనిపించిదట."ఓరయ్యల్లారా ఇటెటెల్తన్నారు అటు గనెళ్తే మిమ్మల్ని ఎలుగుబంటి నంచుకుంతాది" అన్నాడు బండివాడు.అప్పుడు వీరు" ఓహో! ఎలుగుబంటినెతుక్కుంటూ మేము వెళ్తున్నాం" అన్నారు." ఓసోస్ అంతపాటోలోనేటి? అయితే నేను పకాలి(10 గంటలకు తినే గంజి అన్నం)తినేసి వచ్చేసరికి బండెడు సుట్టలూ మీరు కాల్చియ్యాల" అని వెళ్ళాడు.వాడు పకాలి తినేసి వచ్చేసరికి ఒక్క చుట్టల కట్ట కూడా కాల్చలేకపోయారు." ఓరె సాలుసాలెళ్ళర్రా ఉడతూపులకి సింతకాయల్రాల్తాయా"అంటూ వెళ్ళిపోయాడు.
అలా వెల్తుంటే దారిలో ఒక ఊబి(బురద మడుగు) ఉన్నాదట. ఊబిలో ఒక ఎడ్ల బండి దిగబడిపోయిందట.ఎవరెంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు లాగలేక పోయారు. వీళ్ళు అందరినీ పక్కకెల్లమని అరకెత్తినారట. అంతే మరికాస్తా దిగబడిపోయింది."కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట". మనిసొక మాట అనేసరికి సిగ్గుపడిపోయి ఎలుగుబంటి ఒండ(గుహ)వైపుగా వెల్లిపోయారు. అక్కడ ఒండ ముందు ఒక పెద్ద సాపరాయి. రాయిమీద సోలు(రాగులు), నూకలు ఎందేసిందట ఎలుగు.వీరిని చూసి " మా ఈరకాలు(బావలు)లాగున్నారు,ఎందుకొచ్చారు?" అనీడిగితే "నిన్ను చంపి చెల్లిని తీసుకు వెళ్ళడానికి" అన్నారు వారు. అలగే సంపిద్దురు గాని, నేనేటికెళ్ళి తానం పోసుకొని వచ్చేలోగా సోలు మల్ల సోలూ, నూకల మల్ల నూకలు ఇడదీసీయాల లేక పోతే మిమ్మల్ని నేను మింగెస్తానని సోలూ,నూకలూ కలిపేసి వెళిపోయింది.తిరిగొచ్చేసరికి సోలడు గింజలు కూడా విడదీయలేకపోయారు. పందెం ప్రకారం ఒక తాటితో వారిని కట్టివేసి " రోజు శనివారం నేను కౌసు తిన్ను, రేపు తింటానని చెప్పి  ఏటికి వెళ్ళిపోయింది .          
పెద్దమ్మ ఇంటి ముందు ఉన్న తులసిమొక్కలు వాడిపోయాయి."ఓరి నాయనో ఓరి దేవుడో నా కొడుకులు ఆపదలో ఇరుక్కున్నారో " అంటూ దొర్లి దొర్లి ఏడుస్తుండట పెద్దమ్మ. దారిన పార్వతీ పరమేస్వరులు వెళ్ళిపోతూ మారు వేషాల్లో అక్కడికి వచ్చి, "నీ కొడుకులూ, కూతురూ క్షేమంగానే ఉన్నారు"అని చెప్పి, ఒక మిరపకాయ ఇచ్చి "సల్లందితో నంజుకుంటే నికు సీమ్మిరపకాయలాటి కొడుకు పుడతాడు. వాడు అందరిని విడిపించుకొస్తాడు"అని చెప్పి అదృశ్యం అయిపోయారు.
కాలపోలికి తొమ్మిది నెలలు, ఆకాలపోలికి తొమ్మిది ఘడియలు అనంట్లే ఒక కొడుకు పుట్టాడు.చిన్నోడు అని పేరు పెట్టింది. పుట్టీపుట్టగానే పుట్టిడు నూకలజావ తినీసాడట."అమ్మా నేనొక్కడ్నేనా నాతోడ ఇంకెవరైనా ఉన్నారా?"అని అడిగితే జరిగినదంతా చెప్పింది పెద్దమ్మ. ఒక పెద్ద బళ్ళెం పట్టుకొని బయలు దేరాడు.
చిన్నోడికీ చెరుకుల బండీ,బెల్లం బండీ,చుట్టల బండీ కనబడ్డాయట. బండి నాయుడ్లు తిరిగొచ్చీసరికి అవన్నీ అవ్వజేస్సినాడట.తోవలో ఊబి దగ్గరాగి అక్కడున్న జనాన్ని ఎలుగుబంటి జాడ గురించి అడిగితే "దాని ఊసు నీకెందుకు ?భూమికి బుక్కడు లేవు,"అన్నారు.అప్పుడు చిన్నోడు" నేను మా అప్పని, మా అన్నల్ని ఎలుగుబంటినుంచి విడిపించడానికి వెల్తున్నాను" అన్నాడు. "నువ్వుగాని బండిని ఎగ్గొట్టిస్తే అంతపనోడివేనని ఒప్పుకుంటాం" అన్నారు వారు. ఒక మునకాల కర్ర తీసుకొని దాని చివర ఒక మేకు దిగ్గొట్టి ,నొగ ఎక్కి ఒక ఎద్దు తోక మడిచి మరో ఎద్దు ముడ్డి మీద మునకాక కర్రతో ఒక్కటేసినాడట అంతే ఆబాధకు ఒక్కసారి ఎద్దులు ముందుకురికినాయి. బండి ఎగబడిపోయింది. "వీరాధి వీరుడు శూరాధి శూరుడని పొగిడి,చీమ్మిరపకాయకే వర్రెక్కువ" అంటూ "ఎలుగుబంటిని జయించి విజయుడవై తిరిగిరా" అని దీవించి పంపారు.దారిలో ఒక ఏరు. ఆఏటింట చీమలు కొట్టుకుపోతున్నాయి. చీమల్ని ఒడ్డుకు తీసి కాపాడాడు చిన్నోడు. అప్పుడాచీమలు "ఎప్పుడైనా మాఅవసరమొస్తే అప్పుడు మమ్మల్ని తలుచుకో మేము వచ్చి సాయం చేస్తాము" అని చెప్పాయి.
       చిన్నోడు ఎలుగుబంటి ఒండ చేరుకొని ఎలుగుబంటితో "మా అన్నల్ని,అప్పను ఎక్కడ దాచావో చెప్పు? మర్యాదగా వాళ్ళని అప్పగించావా సరే లేకపోతే నిన్ను చంపెస్తాను"అని బళ్ళెం ఎక్కుపెట్టాడు. "సర్లే గాని నేను ఏటికెళ్ళి తానం పోసుకొని వచ్చీసరికి ఈసోలూ, నూకలూ వేరుచేసీయాల అలా చేస్తే నన్ను చంపి మీవాళ్ళని తీసుకుపోదువు గాని, లేకపోతేనిన్ను మింగెస్తాను"అంది. "పందెం అంటే పందెం' అని ఏటికి వెళ్ళీపోయింది. అప్పుడు చీమలు గుర్తుకొచ్చాయి. వెంటనే తలచుకోగా గింజకొక్క చీమ వచ్చి అన్నింతినీ వేరు చేస్సాయి. కొంతసేపటికి ఎలుగుబంటి వచ్చి చూసి, పందెం లో ఓడిపోయినట్లు ఒప్పుకొని లొంగిపోయింది. అన్నలనీ అక్కను విడిపించి ఎలుగు బంటితో "ఇకనైనా భుద్ధిగా బతుకు "అని చెప్పి ఇంటికి తీసుకుపోయి అందరూ హాయిగా ఉన్నారట.