Monday 19 February 2018

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-  02 వ పద్య  ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు

డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండ
మృం
డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం!
ప్రతిపదార్థం
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
డమరుగ= నీ చర్మవాద్య విశేషమునుండి
జాత =పుట్టిన
డండడ= డండడ అను చప్పుళ్ళతో
మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడం =మృడ (శివ)ధ్వనిని వెలార్చెడి మృడండ ....మృండమృణ మొదలయిన శబ్దములు
(అన్ని డ కార ధ్వనులు కావటం విశేషం)
కృతి=చేయుటను
విడంబిత=అనుకరించు
ఘూర్ణిత =తిరుగుడుపడినది
విస్ఫురత్=ప్రకాశించే, తళతళమని మెరిసే
జగత్= లోకమును
ప్రమథన =చిలుకు
తాండవ= నాట్యమునందు
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
డ"కారనుతా= డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో   నీ  డమరుకము నుండి డండడ,మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి.ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో  లోకాలు  తిరుగపడుతున్నాయి.. అటువంటి అద్భుతమైన  డమరుక ధ్వనులు కలిగిన  లోకాలను చిలుకు  తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు
విశేషాలు
శివుని చేతిలో నుండునది డమరుకము.
 ఆడమరుకమును వాయించుటకు మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు.
 దానిని మణి అంటారు.
 డమరుకమును కదలించినపుడు మణి డమరుకమునకు అటు ఇటు  తగిలి డమరుకమును మ్రోగిస్తుంది.
ఆ డమరుక మణుల కాంతులను పాల్కురికి ఈ పద్యంలో  వర్ణించాడు.
డమరుకము :
శబ్ద గుణకము ఆకాశము. ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్ర జపము చేసినపుడు కాని, వినినపుడు కాని స్పందనలు / తరంగాలు ఏర్పడి. అవి శివ ఢమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలిగి తాండవము చేయును. దీనికి గుర్తుగానే శివుడు  డమరుకను ధరించునని పెద్దలు చెబుతారు.

No comments:

Post a Comment