Monday 19 February 2018

ఉపసర్గాః-1

ఈ పదాలను గమనించండి–

1. వాదం, వివాదం, సంవాదం, ప్రతివాదం,అపవాదం, అభివాదం

2. వచనం, నిర్వచనం, ప్రవచనం,ప్రతివచనం, అనువచనం

3. యోగం, సంయోగం, వియోగం,ప్రయోగం, అభియోగం,

4. విచారం, ప్రచారం, సంచారం, ఉపచారం,ఆచారం, అపచారం, అభిచారం.

5. ఉత్పత్తి, ఆపత్తి, ప్రపత్తి, ప్రతిపత్తి,ఉపపత్తి, సంపత్తి, నిష్పత్తి

మనం గమనిస్తే ఈ పదాలలో ఒక ప్రారంభిక పదాంశం మాత్రం మారుతున్నది. (ఉదా– 4వ దానిలో- మొదట్లో ఉన్న ‘వి’, ‘ప్ర’, ‘సం’ మాత్రం మారినవి. చివర మాత్రం ‘చారం, చారం’ అని వస్తున్నది.) తరువాత పదాంశం అట్లగే ఉంటున్నది. మారిన అంశం వల్ల పదం అర్థంలో రకరకాలుగా మార్పు వస్తున్నది. ఔనా? అంటే ‘విచారం’ వేరు, ‘ప్రచారం’ వేరు. ‘చారం’ ఒకటే అయినా ‘వి’, ‘ప్ర’ వల్ల అర్థంలో మార్పు ఉన్నది.

ఇట్ల ఒక పదానికి ముందు వచ్చి చేరే పదాంశాన్ని ‘ఉపసర్గ’ అంటారు. ఉపసర్గలు మొత్తం 20, లేదా 22. అవి– ప్ర, పరా, అప,సమ్‌, అను, అవ, నిస్‌, నిర్‌, దుస్‌, దుర్‌, వి, ఆ (ఆఙ్‌), ని, అధి, అపి, అతి, సు, ఉత్/ఉద్‌, అభి,ప్రతి, పరి, ఉప। ( కొందరు నిస్/నిర్, దుస్/దుర్ ని రెండు ఉపసర్గలుగా కాక ఒకటిగానే చెప్తారు.)

అయితే తెలుగులో మనం ఉపసర్గలను విడిగా చూడము. తెలుగువారు సంస్కృతం నుండి పదాలను తీసుకునేటప్పుడు వాటిని ఉపసర్గ సహితంగా తీసేసుకొన్నారు. కనుక ఈ 22 ఉపసర్గలు వారికి ప్రత్యేకించి వేరే పదాంశాలన్న సంగతి తెలిసే అవకాశం లేదు. కొంత అభ్యాసం చేసి, ఒక పదంలో వాటిని విడిగా తెలుసుకుని, మిగిలిన పదం మూలధాతువు అని గ్రహించాలి.

ఉపసర్గలు చేరినప్పుడు ధాతువును ‘సోపసర్గక ధాతువు’ అనవచ్చు. ఒకసారి ఉపసర్గ చేరాక ఇంక అర్థంలో మార్పు వచ్చింది కనుక ఆ ధాతువును ప్రత్యేకంగానే చూడాలి. ఉపసర్గ లేనిది సామాన్యధాతువు లేదా మౌలికధాతువు, లేదా కేవలధాతువు.

కొన్ని సోపసర్గకధాతువులు క్రియాపదాలను మాత్రమే తయారు చేస్తాయి. కొన్ని నామపదాలను మాత్రమే చేస్తాయి. (పైన మనం చూసినవన్నీ నామపదాలే. క్రియాపదాలు మున్ముందు చూస్తాము.)

సంస్కృతపాఠమాల 4.2

ఉపసర్గాః -2

అయితే అన్నిసార్లూ మాత్రం ప్రారంభంలో చేరిన ఉపసర్గ వల్ల పదం అర్థంలో మార్పు ఉండదు. ఒక్కొక్కసారి ఏ అర్థం మూలధాతువుదో అదే అర్థం సోపసర్గక ధాతువుదీ అవుతుంది.

ఉదా– రక్షణ, సంరక్షణం, పరిరక్షణం ; శుభ్రం,పరిశుభ్రం ; దీప్తి, ప్రదీప్తి, సందీప్తి ; లుప్తం,విలుప్తం ;

అన్నింటి అర్థం రక్షణమనే. ఉపసర్గల సంయోగం కలిగిన ధాతువులలో మూడు రకాల చర్యలు కనిపిస్తాయి–

1. ధాతువు అర్థం పూర్తిగా మారుతుంది. ఉదా– లయం, ప్రలయం, విలయం, ఆలయం,

ప్రసిద్ధ ఉదా– విహారం, ఆహారం, సంహారం,ఉపహారం, పరిహారం, ప్రహారం, నీహారం– వీటిలో దాదాపుగా ఒక పదానికి ఇంకొక పదానికి పొంతన లేదు.

2. ఏమీ జరగకుండా అదే అర్థం ఉండిపోతుంది. ఉదా– యానం, ప్రయాణం ; దానం, ప్రదానం ; లక్షణం, విలక్షణం.

3. ఏదో విశేషార్థం వస్తుంది. ఉదా– గ్రహం,విగ్రహం ఆగ్రహం పరిగ్రహం సంగ్రహం అవగ్రహం ఉపగ్రహం ప్రగ్రహం (పగ్గము) నిగ్రహం ప్రతిగ్రహం– వీటన్నింటిలో ‘పట్టుకోవటం’ అనే అర్థం ఏదో విధంగా నిలిచి ఉంది. కేవలం ఆ అర్థానికి ఏదో ఒక విశేషత్వం చేరింది.

ఒక ధాతువుకు ముందు ఒకటికన్నా ఎక్కువ ఉపసర్గలు కూడా ఉండవచ్చు. ఉదా– అవమానం (అవ-మానం, 1), వ్యవధానం (వి-అవ-ధానం, 2) ; దుర్వ్యవహారం (దుర్-వి-అవ-హారం, 3). సంస్కృతంలో ధాతువుకు ఉపసర్గ చేరినదని చూపించే విధానం ఒక చిన్న అడ్డగీత పెట్టటం. ఉదా–

హస్– అప-హస్, పరి-హస్, ఉప-హస్, అవ-హస్, ప్ర-హస్, వి-హస్

వహ్– ప్ర-వహ్, సం-వహ్, నిర్-వహ్, వి-వహ్, ఆ-వహ్, ఉద్-వహ్, పరి-వహ్, ఉప-వహ్

వ్యవహారానికై ఉపసర్గల అర్థాలు ఇట్లా చెప్పుకోవచ్చు–

ప్ర, - ముందు, గొప్ప

పరా, - విరుద్ధం,

అప, - చెడు, తప్పు

సమ్‌, - కలుపుకుని

అను, - వంటి, వెంట, వెనక

అవ, - కింది, అధమ, నుండి

నిస్‌, నిర్‌, - లేని, పోయిన

దుస్‌, దుర్‌, - చెడు, కష్టమైన

వి, - విశేషం, విభాగం

ఆ, - మొత్తం, అంతా

ని, - అందు, కింద

అధి, - పైన, పెద్ద

అపి, - కూడా

అతి, - దాటి, మించి

సు, - మంచి

ఉత్/ఉద్‌, - పైకి, ఎత్తు

అభి, - దగ్గర, వద్ద

ప్రతి, - తిరిగి, మళ్ళీ

పరి, - అన్నివైపులా

ఉప – వద్ద, దగ్గర

సంస్కృతపాఠమాల 4.3

చతుర్థగణధాతవః

ఈ క్రియాపదాలను గమనించండి–

     నశ్ – నశ్యతి – నశ్-య-తి

     పుష్ – పుష్యతి – పుష్-య-తి

పురుషప్రత్యయాలు జోడించినప్పుడు కలిగే మార్పులను బట్టి, సంస్కృతధాతువులు పదిగణాలలోకి విభజించారని చెప్పుకున్నాము కదా- ఆ గణాలలో నుండి చతుర్థ గణమైన దివాదిగణాన్ని ఇప్పుడు చూద్దాం. దివాది అంటే దివ్-ధాతువు ఆదిగా గల గణం. ఆ గణంలో ధాతువులు అన్నీ ఒకతీరైన రూపాలను కలిగి ఉంటాయి

No comments:

Post a Comment