Sunday 26 November 2023

     !!.మృచ్ఛకటికమ్‌.!!

  మృచ్ఛకటికమ్‌  అనేది శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం. 

     సాధారణంగా సంస్కృత నాటకం అనగానే ఉదాత్త నాయకీనాయకులు, వారి మధ్య ప్రణయం, విరహం లాటివి వుంటాయి. కానీ దీనిలో దొంగలు, జూదరులు, విటులు, పోకిరీగా తిరుగుతూ జనాలపై జులుం సాగించే రాజుగారి బావమరిది, అతన్ని ఎదిరించే విప్లవకారుడు, అతనంటే అభిమానం చూపించే సైనికులు వీళ్లందరూ వుంటారు. ఈ నాటకం లోని చాలా దృశ్యాలు వీధుల్లో నడుస్తాయి. సాయంత్రపు చీకట్లో వీధిలో వెళుతున్న వేశ్యను రాజుగారి బావమరిది వెంటాడిి, చెరపట్టడానికి చేసే ప్రయత్నంతో నాటకం ప్రారంభమవుతుంది.


చారుదత్తుడనే బ్రాహ్మడు ఉజ్జయినీ నగరంలో ఉన్నాడు. అతని తాతముత్తాతలు వ్యాపారం చేసి చాలా గడించారు. ఇతను దానధర్మాలు చేసి డబ్బంతా పోగొట్టుకుని ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాడు. మనిషి అందగాడు, గుణవంతుడు. భార్య, చిన్నపిల్లాడు ఉన్నారు. అతన్ని ఆశ్రయించుకుని మైత్రేయుడు, వర్ధమానకుడు అనే అనుచరులు, రథనిక అనే పనిగత్తె ఉన్నారు. ఆ వూళ్లో వసంతసేన అనే వేశ్యాకులంలో పుట్టి, యింకా ఆ వృత్తిని చేపట్టని సుందరి ఉంది. ఆమె ఒక ఉత్సవంలో యితన్ని చూసి యిష్టపడింది. శకారుడనే రాజుగారి బావమరిది ఆమెను చూసి యిష్టపడ్డాడు. ఓ రోజు సాయంత్రం తన అనుచరుడితో కలిసి ఆమె వీధిలో నడిచి వెళుతూంటే వెంటపడ్డాడు. వసంతసేన అతని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వీధిలోనే వున్న చారుదత్తుడి యింట్లోకి దూరి రక్షణ పొందింది. చారుదత్తుడు కూడా ఆమెను చూసి యిష్టపడ్డాడు. మళ్లీమళ్లీ ఆ యింటికి వచ్చేందుకు వీలుగా తన నగలు తీసి మూటగట్టి 'శకారుడంటే భయంగా వుంది, మీ దగ్గర దాచండి' అని చెప్పింది. చారుదత్తుడి యిల్లు శిథిలావస్థలో ఉంది. ఈ నగలపాత్ర పోయిందంటే దరిద్రానికి తోడు అప్రదిష్ట కూడా. అందుకని పగలు వర్ధమానకుడు, రాత్రి మైత్రేయుడు దీన్ని కాపలా కాయాలని చెప్పాడు.


చారుదత్తుడి వద్ద ఒళ్లు పట్టేవాడిగా గతంలో పనిచేసిన సంవాహకుడు అనేవాడు యిప్పుడు జూదగాడై, జూదంలో ఓడిపోయాడు. జూదమండపం అద్దె కూడా చెల్లించకుండా పారిపోబోతే వాళ్లు తరుముకుని వచ్చారు. అతను పారిపోతూ, దారిలో వున్న వసంతసేన యింట్లో చొరబడ్డాడు. వాడు చారుదత్తుడి తాలూకు మనిషనే అభిమానంతో వసంతసేన అతని తరఫున డబ్బు చెల్లించి ఋణవిముక్తుణ్ని చేసింది. అతను సిగ్గుపడ్డాడు. ఇకపై యీ అలవాటు మానేసి బౌద్ధసన్యాసిగా మారిపోతానని చెప్పి వెళ్లిపోయాడు. శర్విలకుడనే బ్రాహ్మణుడు ఒక దొంగ. వసంతసేన వద్ద పనిచేసే మదనికను ప్రేమించాడు. ఆమె బానిసత్వాన్ని విడిపించడానికి డబ్బు సంపాదించాలని, దొంగతనానికి బయలుదేరాడు. రాత్రి చారుదత్తుడి యింట్లో కన్నం వేసి దూరాడు. అక్కడ మైత్రేయుడు నగలపాత్ర పట్టుకుని నిద్రపోతూ భయంతో పలవరిస్తున్నాడు. దొంగ తన దగ్గరకు రాగానే అతనే తన స్నేహితుడు వర్ధమానుడనుకుని 'ఇదిగో తీసుకో' అని దాన్ని యిచ్చేశాడు. అనాయాసంగా చేతి కందిన పాత్రను పట్టుకుని వచ్చి మదనిక దగ్గరకు వచ్చాడు. వసంతసేనకు విషయమంతా తెలిసి, నాకే పరిహారమూ అక్కరలేదు, వెళ్లి పెళ్ళి చేసుకోమంది. మదనికను బండి ఎక్కిస్తూండగానే ఆర్యకుడనే విప్లవకారుణ్ని బంధించారన్న ప్రకటన వినబడుతుంది. 'అతను నా స్నేహితుడు, వెళ్లి విడిపిస్తాను, నువ్వీమెను మా నాన్నగారింట్లో విడిచి వెళ్లు' అని బండివాడికి చెప్పి అతను వెళ్లిపోయాడు.


నగలు పోయిన సంగతి గ్రహించిన చారుదత్తుడు బాధపడుతూంటే అతని భార్య తన పుట్టింటివాళ్లు యిచ్చిన నగను చేతిలో పెట్టి వసంతసేనకు పంపించేయమంది. వసంతసేనను చారుదత్తుడి యింటికి వచ్చి దొంగతనం గురించి చెప్పి తన నగలను చూపించింది. వాళ్లిద్దరి మధ్య అనురాగం వెల్లివిరిసింది. మర్నాడు ఉదయం చారుదత్తుడు ఒక తోటకు వెళుతూ మైత్రేయుడితో వసంతసేనను గూటిబండిలో అక్కడకు తీసుకుని రమ్మనమని చెప్పి వెళ్లిపోయాడు. చారుదత్తుడి కొడుకు పొరుగింటి కుర్రాడు బంగారు బండితో ఆడుకోవడం చూసి తనకు కూడా అలాటిది కావాలని ఏడిస్తే పనిమనిషి మట్టి బండి చేసి దానితో వసంతసేన వద్దకు తీసుకెళ్లింది. పిల్లాణ్ని చూసి వసంతసేన నువ్వు కూడా బంగారుబండి చేయించుకో అంటూ తన ఒంటి మీద నగలు మట్టిబండిలో పోసింది. శకారుడి కోసం అదే తోటకు వెళుతున్న ఒక గూటిబండి సంచార రద్దీ కారణంగా చారుదత్తుడి యింటి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అది చారుదత్తుడు తనకోసం పంపించిన బండే అనుకుని వసంతసేన ఆ బండిలో కూర్చుంది.


శర్విలకుడు ఆర్యకుణ్ని విడిపించాడు. అతని సంకెళ్లతో సహా పారిపోయి వస్తూ వుంటే రాజభటులు వెంటాడారు. అతను తప్పించుకోవడానికి యిటుగా వచ్చి వసంతసేన కోసం వచ్చిన గూటిబండిలో ఒదిగి కూర్చున్నాడు. అది తోటకు చేరాక చారుదత్తుడు ఆర్యకుణ్ని చూసి, బంధనాలు విడిపించి పంపించివేశాడు. వసంతసేన ఎక్కిన బండి శకారుడి వద్దకు చేరింది. తను బతిమాలుకున్నా ఆమె వినకపోవడంతో కోపం తెచ్చుకుని పీక పట్టుకుని నులిమివేశాడు. ఆమె కుప్పకూలింది. శకారుడు ఆమెను ఎండుటాకులతో కప్పివేశాడు. ఇదంతా చూసిన తన సేవకుణ్ని తన మేడలో బంధించాడు. వసంతసేన వలన ఉపకారం పొంది బౌద్ధసన్యాసిగా మారిన సంవాహకుడు ఆ తోటలో తన బట్టలు వుతుక్కుని తడిబట్టల్ని ఆ ఆకులపై ఆరబెట్టాడు. అంతలో ఆకులగుట్ట కదిలింది. ఆకులు కదలించి చూసి వసంతసేనను కాపాడి తన ఆరామానికి తీసుకెళ్లాడు.


శకారుడు న్యాయాధికారుల వద్దకు వెళ్లి చారుదత్తుడు నగలపై ఆశతో వసంతసేనను చంపివేశాడని అభియోగం చేశాడు. మట్టిబండిలో దొరికిన నగలు ఆ ఆరోపణకు బలం చేకూర్చాయి. చారుదత్తుణ్ని కొరత వేయమని తీర్పు యిచ్చారు. అతన్ని వధ్యభూమికి తీసుకెళుతూ చాటింపు వేస్తే అది విన్న శకారుడి సేవకుడు మేడ నుంచి దూకేసి శకారుడే హంతకుడని అందరికీ చెప్పాడు. శకారుడు వాడు దొంగ అనీ, పట్టుకున్నందుకు తనపై కోపంతో అలా చెప్తున్నాడనీ జనాల్ని నమ్మించి చారుదత్తుడికి సహాయం అందకుండా చేశాడు. అతని కొరత ప్రకటన విన్న వసంతసేన వధ్యభూమికి చేరింది. చారుదత్తుడిపై కత్తి ఎత్తిన తలారి తత్తరపడ్డాడు. వసంతసేన సజీవంగా వుందని చూసిన శకారుడు భయంతో పారిపోసాగాడు.


    ఇంతలో శర్విలకుడు వచ్చి ఆర్యకుడు రాజుని చంపి కొత్త రాజయ్యాడని, తనను కాపాడినందుకు కృతజ్ఞతగా కుశావతీ రాజ్యాన్ని చారుదత్తుడికి ధారాదత్తం చేశాడనీ చెప్పాడు. పారిపోబోయిన శకారుడు పట్టుబడ్డాడు. అతన్ని చంపెయ్యబోతూ వుంటే చారుదత్తుడు ప్రాణభిక్ష పెట్టాడు. చారుదత్తుడు మళ్లీ ఐశ్వర్యవంతుడయ్యాడు. వసంతసేనను చేపట్టడానికి అతని భార్య అనుమతించింది. ఆర్యకుడు సుభిక్షంగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు. ఇదీ కథ.


Friday 14 April 2023

 ద్వాపర యుగం లో ప్రియదర్శిని (లాప్ టాప్), దివ్య నేత్రము(CC cam),దివ్యదృష్టి(స్పైకేమ్), ఆకాశ వాణి(అంతర్జాలము)Internet, మొదలైన ఉపకరణ లు ఉండేవని ఇతిహాసములు చెప్పుచున్నవి.... అప్పుడు కూడా 

Face Book ఉండి ఉంటే,

అప్పట్లో చాటింగ్ ఎలా సాగేదో తెలుసా…….!


ప్రియుడు :- నెచ్చెలీ………!

ప్రేయసి :- సఖా……!

ప్రియుడు :- రాత్రి భోజనము భుజించితివా  ?

ప్రేయసి :- అయినది సఖా. మరి మీరు ఆరగించితిరా ?

ప్రియుడు :- ఏమి ఆరగింపులే చెలీ! నిరతము నీ పరితాపము న నేనేమరుపాటుననారగంచుటయే మరచితిని. ………..!

ప్రేయసి :- ఆఁ...ఆఁ...హతవిధీ! అంత పని చేయకుడి...!!! 


ప్రియుడు :- లేదులే సఖీ!పరిహాసమున నిటుల పలికితి...ఇపుడే ముఖవాచకమును తెరిచితిని. అందు నీవు యెగుమతి చేసినట్టి “స్వచ్చిత్తరువు” మహత్తరము. అక్కజముగ మిక్కుటమైన మక్కువలను నొక్కివక్కానింప తక్కిన అక్కరలన్నీ పక్కన పెట్టి అక్కరములతో చేజిక్కిన చరవాణి ని గ్రక్కున నొక్కాలని యొక్క కోర్కె కలిగినది. కానీ ఒక్క మక్కువే నొక్కిన లెక్కకు వచ్చును కదా !అని సరిపుచ్చుకొంటి... 


ప్రేయసి :- నా యొక్క స్వీయ చిత్రము(dp) తమకు అంతగా ప్రియమైనదా ప్రియా ?


ప్రియుడు :- అవును దేవి. మధుర మదిరా రసాఛ్ఛాదిత మదురసాపూరిత అధరసుధామధురసాన్ని గ్రోలాలని నా పెదవులు ఎంత ఆరాట పడుచున్నవో!!! 


ప్రేయసి :- పోదురు!!!. మీరు మరీనూ…….


ప్రియుడు :-మంచుతెరల దుప్పటిలో పుడమికాంత ఆదమరచి నిదురోతున్నప్పుడు, నీ నులివెచ్చని ఒడితలగడపై నేను తలవాల్చి నీకన్నులలోకి తదేకంగా చూస్తున్నప్పుడు నీ కురుల వింజామరలతో విసురుతుంటే మలయమారుతమేదో  నా వదనాన్నితాకినట్లు...ఆప్పుడు ఒకింత కలిగిన పులకింత ఇంతవరకూ నాకెంతో గుర్తుంది ...తెలుసా... 


ప్రేయసి:ఛీ!!! నాకుసిగ్గేస్తుంది... 


ప్రియుడు: హేమంతఋతువు, చల్లని రేయి,అప్పుడే మంచు తెరలలను తొలగించుకొంటూ బాల శశిబింబము కురిపిస్తున్న వెన్నెల వెలుగులు నా విరహాగ్నిని నిప్పులను విసనకర్రతో విసిరినట్లు మరింత అధికం చేయుచున్నాయి. ఆ తరుణంలో నీ రాక గ్రీష్మఋతువు మిట్టమద్యాహ్నం భానుని తీక్షణ కిరణ తాకిడికి వేడెక్కిన సుర్యకాంతశిల పై పడిన మంచు వర్షం వలే నాకు హర్షం కలిగించలేదా? పరవశాన నీ చెక్కిలి తాకిన న పెదవులు చిరునవ్వుల అలికిడికి చిరుగాలి సవ్వడికి అదిరె చిగురాకుపెదవులు చిలికిన మధువును నా చూపులు నీ పెదవులు దాటి ఎటులైనా మరలాలని ఎంత ప్రయత్నించలేదూ?


ప్రేయసి: హలా!!! అలా వలపులు చిలికించి నామదిపులకించగ పలికించకు నీ మురళీ గానము నా వీనులకు నెచ్చెలీ!!! ...సరే సద్దు అవుతుంది... ఉంటాను...మరళ బ్రహ్మీముహుర్తాన తప్పిన పిలుపు నిచ్చెద... నీ చరవాణిని ప్రకంపనాయుతపరాకుననుంచుము...

Monday 10 April 2023

 *ఉత్తమ ఉపాధ్యాయుడు*

అవార్డు వచ్చిందంటే సమాజంలో చిన్నచూపు... 

అవార్డు రావాలంటే.... 

*అధికారుల చుట్టూ తిరగాలి.

*చదువు చెప్పకుండా మిగతా పనులన్నీ చేయాలి... 

-అంటే... నేత్రవైద్యశిబిరాలు

... రక్తదానశిబిరాలు

... పుస్తకాలు, కవిత్వం రాయాలి. 

... సంఘ సేవ, మొక్కలు నాటడం, ఎయిడ్స్, పేదలకు పండ్లు పంచడం, మొదలైనవి చేస్తున్నట్లు గా ఫోటోలు,... 

... స్కూల్ కి వెళ్లక పోయినా ఫరవాలేదు... రికార్డు లు ముఖ్యం... *వచ్చిన వారందరూ ఇటువంటి వారే అనుకుంటున్నారు. సమాజము... (కొంతమంది స్కూల్ ఎగ్గొట్టి స్కీమ్ లు, రియల్ ఎస్టేట్ లు, జీవిత భీమా, చిట్ లు వంటివి చేసేవారికి అవార్డు లు రావడం చూసి.)

    కొంతమంది సైడ్ బిజినెస్ లు చేసినా వారి డ్యూటీ సక్రమంగా చేస్తారు... సమాజం లో కూడా మంచి పేరు ఉంటుంది... 

కొంతమంది వారి స్వప్రయోజనమును పక్కనబెట్టి విద్యార్థుల ఉన్నతికే పాటుపడేవారు ఉంటారు... కానీ వారికి గుర్తింపు దొరకదు... కారణాలు అనేకం... మనతో నవ్వుతూ తిరుగుతూ మన వెనకనే గోతులు తీస్తారు... 

మన స్టేఫ్ లోనే మనమంటే కొందరికి చూడలేని తనం... ముఖ్యంగా హైస్కూల్ లో ఈ జాడ్యం ఇంకా ఎక్కువ... 

... *కనుక నేను చెప్పొచ్చేదేమిటంటే రిటైర్ అయ్యే లోపు ఎలాంటి రిమార్కులు లేకుండా, మాటపడకుండా గౌరవంగా వెళిపోతే అంతకంటే పెద్ద అవార్డు మరొకటి ఉండదు...*

Thursday 23 March 2023

 తెలుగు సాహిత్యం లో అత్యంత క్లిష్టమైన పద్యము-సాహిత్య గోష్ఠులలో పండితులకు కొరుకుడు పడని పద్యం...

కం. *కమలాకరకమలాకర కమలాకర కమల కమల కమలాకరమై కమలాకర కమలాకర కమలాకరమైన కొలను గని రా సుదతుల్.*


- ఈ పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పృచ్ఛకులకూ, అవధానులు ఒక కేళీ వినోదంగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి వారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.


ఆ సుదతుల్ = అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు;

 కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, 

ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, 

కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, 

కమల కమల కమలాకరమై - కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, 

కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, 

ఆకరమై = - నివేశనమైనది; *కమలాకర* - క = మన్మథునియొక్క, 

మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, 

కర = కూర్చునదై, 

*కమలాకర* - కమలా = పద్మినీజాతి స్త్రీలకు, 

క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదకై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి .... సేకరణ:వల్లూరు  దాలినాయుడు.

సేకరణ

కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకసారి ఒక కవి (ప్రెగడరాజు నరస కవి) వచ్చి అష్టదిగ్గజ కవులకు ఒక పరీక్ష పెట్టాడు. అదేమంటే మీలో ఎవరు ఏది చెప్పినదాన్ని నేను వెనువెంటనే రాయగలను మరియు మీరు చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టగలను లేదా మీరు నేను చెప్పిన దాన్ని రాయండి, నే చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టండి. వీటికి మీరు సిద్ధమేనా అని ప్రశ్నించాడు.

దీనికి అక్కడివారందరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆసమయంలో తెనాలి రామకృష్ణకవి ముందుకు వచ్చి నే చెప్పేది రాయమని ఈ క్రింది పద్యం చెప్పాడట.

తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళు
క్కవ్వట; అరయఁగ నట్టి హరునకు జేజే!

(తృప్ = సాక్షరపదముల గ్రహింపజాలని పశువు - వృషభం, బాబా = వాహనం, జాబిల్లి, తలపై పువ్వు, వలువ = కట్టుపుట్టము, బూచి = భయంకరమైన (ఏనుగు)తోలు, చేదే = హాలాహలమే, బువ్వ = ఆహారం, ఉళుళుక్ (హుళక్కి)= లేనిది - మాయ, అవ్వ = కాగా, అట్టి హరును = అలాంటి పరమశివునకు, జేజేలు)
రామకృష్ణకవి చెప్పెడి విధానం పద్యం పలికే తీరు అర్థం కాక ఆ వచ్చిన కవివతంసుడు రాయలేక నిలిచిపోయాడు. దాన్ని ఎలా రాయాలో తెలియని గందర గోళంలో పడిపోయాడా పండితుడు.

ఈ సందర్భంలోని చమత్కారం పద్యం గొప్పతనాన్ని కప్పేసింది.

పూర్తి అర్థం

తృవ్వు+అట.. ‘తృవ్వట’. పశువుల్ని బళ్లకి కట్టి తోలుతున్నప్పుడు బండివాడు వాటి తోకలను మెలిపెట్టి, ఆ ఎడ్లకి హుషారు నిమిత్తం పలికే ధ్వన్యనుకరణ శబ్దమిది.

‘బాబా’ అంటే వాహనం (గుర్రం). ‘తృవ్వట’ అనేది ఎద్దుకి సంకేతం. ‘తృవ్వట బాబా’- ఎద్దు వాహనం- శివుడిది. ‘‘ఎక్కెడిదెద్దు భూతియును నెమ్ములు సొమ్ములు...’’ (శివుడికి) అని ఎర్రన తన నృసింహపురాణంలో పేర్కొన్నాడు. ‘తలపై పువ్వట జాబిల్లి’.. హరుడి శిరసులోని పుష్పం చంద్రుడు. శివుడు చంద్రశేఖరుడు కదా! ‘‘వలిమలయల్లువాడు తలవాకధరించిన పువ్వుగుత్తి!’’ అని చంద్రుణ్ని వర్ణించాడు ముక్కు తిమ్మనకవి. ఇక ‘వల్వ బూచట!’ అనే దానికి పాఠాంతరముంది.. వల్వ బూదట! అని. వల్వ అంటే వస్త్రం. శివుడి వాలకం బూచాడు కదా! భిక్షువు లేదా దిగంబరుడు! ఆయన ఒడలంతా విభూతి (బూది).. బూచి+అట- బూచట, బూది+అట- బూదట. ‘చేదే బువ్వట!’- చేదు అంటే విషం. పార్వతీ పతికి కాలకూట విషమే అన్నమైంది. దేవదానవులు అమృతం కోసం పాలకడలిని మథించినపుడు మొదట హాలహలం పుట్టింది. దాన్ని హరుడు ‘‘అల్లనేరేడు పండువలె మిసిమింతుడు గాక మ్రింగినాడు!’’ అన్నాడు శ్రీనాథ మహాకవి. ‘‘వెన్నెలతల సేదుకుత్తు కయు’’ అని పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకంలో వాక్రుచ్చాడు. ‘‘మ్రింగమన్న సర్వమంగళ తన మంగళసూత్రమును మదిలో నెంత నమ్మినదో!?’’ అన్నాడు పోతన.
‘చూడగను హుళక్కవ్వట!’.. పరికిస్తే శూన్యమే ఆయనకి అవ్వట! ఆ శివుడి పుట్టుక ఓ మాయ! ఆ తల్లి- ఆ పరము నికి అమ్మట! లయవేళ సకల సృష్టి నాశనార్థం స్థాణు రూపేణా అవతరించే మహాతత్త్వమే ఆ అద్భుతమూర్తి. గుణా లున్నపుడే ఆయనకి ఈ రూపమూ, దానికో వర్ణనమున్నూ. నిర్గుణుడయ్యాడో ఆయన పరతత్త్వంలో లయమైపోతాడు. కాబట్టి- హుళక్కి! ఇక్కడ మరో రమణీ యార్థమూ ఉంది. ‘చూడము’- అంటే తల. అది హుళక్కి! అంటే శూన్యం- ఆకాశం! శివుడికి అద్భుతమైన మరోపేరు ‘వ్యోమకేశుడు’! శూన్యాకాశమే శివుడి జటాజూటం! ఆయన అందుకే ‘ధూర్జటి!’.
భావంలో ఇలా నిలిచిన ‘హరునకు జేజే!’- ఆ పరమేశ్వరునికి ప్రణామాలర్పించాడు రామలింగడు