Monday 19 February 2018

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-
ప్రతిపదార్థ
విశేషాలు:

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట

1) టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో
త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుతా! బసవేశ పాహిమాం!
2) పదవిభజన
టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట, ఉన్ముఖ టంకృతి, స్ఫుట+ఉత్కట
పటహ+ఆది, నిస్వన ,వియత్తల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట,  పటుతాండవ+ అటన, "ట"కారనుతా! బసవేశ ,పాహిమాం!
3) పద సమన్వయము
బసవేశ, టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట, ఉన్ముఖ టంకృతి, స్ఫుట+ఉత్కట
పటహ+ఆది, నిస్వన ,వియత్తల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట,  పటుతాండవ+ అటన, "ట"కారనుతా! పాహిమాం
4) ప్రతి పదార్థము
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట,= టకటక అను చప్పుళ్లతో
ఉన్ముఖ = ఉత్+ముఖ= పైకి విస్తరిస్తున్న
టంకృతి= ఆశ్చర్యముగొలుపు వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు  కలిగిన
స్ఫుట= స్పష్టమైన.
ఉత్కట= భయంకరమైన
పటహ=తప్పెట
ఆది= మొదలైన
నిస్వన = ధ్వనులతో
వియత్తల=ఆకాశము
దిక్తట=దిక్+తట= దిక్కుల ప్రదేశములను తాకిన
తాటిత= కొట్టబడిన
ఆర్భట=కేకలతో
ఉద్భట=అధికమైన
పటు తాండవ= నేర్పుకలిగిన నాట్యములో
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
ట"కారనుతా= టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
5) తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా ! నీ శివతాండవము  టకటక అను చప్పుళ్లతో  పై పైకి విస్తరిస్తున్న వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు  కలిగినది. స్పష్టమైనది. భయంకరమైనది.తప్పెట  మొదలైన వాటి ధ్వనులతో ఆకాశము మరియు దిక్కుల  అంచులను తాకుచున్నది.అనేక కేకలు కలిగినది.అధికమైనది.  నేర్పుకలిగిన నాట్యములోతిరుగువాడా! టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.
విశేషాలు
6) బసవేశ్వరుడు
కుల రహిత సమాజాన్ని 12వ శతాబ్దంలో ప్రబోధించి ఆచరించి చూపించినవాడు బసవేశ్వరుడు. పాల్కురికి సోమనాథుడు ఈ బసవేశ్వరుడ్ని రెండవ శంకరుడన్నాడు. ఆయననే  ఈ పద్యంలో  సంబోధిస్తున్నాడు.
7) టంటంట టంటంట టటంట టంటం
కాళిదాసు పేరు మీదుగా ఈ ట కార సమస్య  సంస్కృత సాహిత్యంలో  ప్రసిద్ధం.
ఒక రోజు భోజరాజు టంటంట టంటంట టటంట టటంట టంటం " అని సమస్య పూరించమన్నాడు.. వెంటనే కాళిదాసు ఇలా చెప్పాడు.
'రాజ్యాభిషేకే మద విహ్వాలయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘటః యువత్యాః
సోపాన మార్గేషు కరోతి శబ్దం
టంటంట టంటంట టటంట టంటం"
(రాజుగారికి పరిచారికలు స్నాన ఘట్టం లో స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి సౌందర్యం చూసి మై మరిచి పోయింది. ఆమె చేతి లోని బంగారు చెంబు జారి పోయి స్నానఘట్టం మెట్ల మీదు గా దొర్లుతూ 'టంటంట టంటంట టటంట టంటం' అని మోత చేసింది. )
8) శివతాండవం
పార్వతీ పరమేశ్వరులు  ఇద్దరూ కలిసి కైలాస పర్వతంపై ఆనంద నాట్యం చేస్తారట.  పార్వతి చేసే నాట్యాన్ని ‘లాస్యం’   అంటారు.  శివుడి నాట్యానికి ‘తాండవం’ అని పేరు. 9.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే/గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం/చకార చండతాండవం తనోతు నః శివః శివమ్
కదులుతున్న తన జటలు అనే అరణ్యంలో సురగంగ యొక్క చిత్తడి(మిక్కిలి తడి) కలవాడు
తన మెడలో వేలాడుతూ కదులుతున్న సర్పముల వరుసలు కలవాడు
డమ డమ ధ్వనులను వెలువరిస్తున్న డమరుకము కలవాడు
భయంకరమైన తాండవము చేయుచున్నవాడు అయిన పరమ శివుడు మనందరికి శుభాన్ని కలుగ చేయుగాక!
10 ఈ శివతాండవాన్ని పాల్కురికి సోమన టకారముతో మనకి సాక్షాత్కరింపచేసాడు. 

No comments:

Post a Comment