Thursday 24 January 2013


అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము".
ప్రవరాఖ్యుడి దినచర్య ఎలావుండేదంటే -

వరణాతరంగిణీదర వికస్వరనూత్న
కమలకషాయగంధము వహించి
ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ
వామనస్తుతిపరత్వమున లేచి
సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట
నఘమర్షణస్నాన మాచరించి
సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి
సైకతస్థలి గర్మసాక్షి కెఱగి

ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ
తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు
బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు
వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ

ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం. ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన + అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి. అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది. కనక తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు). వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి. అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు. విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వమున) నిద్రలేస్తాడు.

శిష్యులతో సహా (సచ్చాత్రుడగుచు) రోజూ వెళ్ళి నదిలో (అయ్యేటన్ - యేరునందున్) అఘమర్షణ స్నానం చేస్తాడు. అఘమును - పాపాన్ని - తొలగించేది. పాప పంకిలాలను తొలగించే మంత్రాలు చదువుకుంటూ చేసే స్నానం అఘమర్షణ స్నానం, దాన్ని ఆచరించి సంధ్యాసమయంలో సూర్యుడికి చెయ్యవలసిన అర్ఘ్య తర్పణ ప్రదానాలు నిర్వహించి (సాంధ్య కృత్యమున్ తీర్చి) గాయిత్రీ మంత్రాన్ని (సావిత్రిన్ - సవితృ) జపించి, ఇసుకతిన్నెమీద నిలబడి, కర్మసాక్షి సూర్యభగవానుడికి నమస్కరించి (ఎఱగి) తరువాత తన శిష్యులతో కలిసి (బ్రహ్మచారులు వెంటరాన్) ఇంటికి వచ్చేవాడు. సమీపంలో దొరికిన ఫలాలు సమిధలు దర్భలు (కుశ) పువ్వులు (కుసుమాలు) ఇటువంటి పూజాద్రవ్యాలను సేకరించి కొందరు శిష్యులు తెస్తున్నారు. మరి కొందరు ఉతికిన మడుగు దోవతులు పట్టుకొని గురువుగారి వెంట నడుస్తున్నారు. ఇలా శిష్యపరివారం వెంటరాగా, బ్రాహ్మణుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకొనేవాడు.

ప్రవరుడు ఇంత నిష్టగా ఉండటం, శిష్యులకి విద్యాబోధన చెయ్యడం, క్రమశిక్షణ - ఇవన్నీ గమనించి ప్రజలు సంతోషించి ప్రవరుణ్ణి మెచ్చుకుంటూ చూసే వారట. వారి చూపులో మెప్పుదల కనిపించేది. అంటే పట్టణ పౌరులు అతడిపట్ల గౌరవంగానూ బాధ్యతాయుతంగానూ మెలిగేవారని. "ప్రజ తన్ను మెచ్చి చూడ" అని ముగించడంలో వ్యక్తి బాధ్యత - సంఘ బాధ్యతలు వాటి పరస్పర సంబంధం - అన్నీ స్ఫురణ ఉంది

ఇది ఒకరోజో, అడపా తడపానో జరిగే ప్రక్రియ కాదు. నిత్యం (నిచ్చలు) క్రమం తప్పకుండా జరిగే దినచర్య.


మురళి|| తొలి వలపు ||

నిను కాంచిన మొదలు
నా తలపులు తెరిచెను తలుపులు

నిను చూసిన క్షణమే
నా హృదిలో పడినది ముద్రణ

నిను తలచిన తడవే
నా తనువున కలిగెను అలజడి

నువు ఎదురైనంతనే
నా యెదలో  ఏదో ఆరాటము

నీ మృధు భాషణమే
నాకది మదిరాపాన సేవనము

నీ చిరు దరహాసము
నా మదిలో మధుమాసము

నీ అదిరే అధరము
నా పెదవులకది మదుపానము

నీ మెరిసే చెక్కిలి
నా ప్రతిబింబము చూపే అద్దము

నీ వలపు చూపులు
నా యెడదను నాటిన అంబకము

నీ నిరతము చింతన
నాకది మధురమైన  భావనము

నీ తొలి వలపు తియ్యదనం
నాలో రేగే భావనలకు మూలధనం

రాయల వారిని పెద్దన పొగడిన పద్యం)
శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా 
నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !

( అర్జునుడు, సింహము, క్షితి - మూడింటిలోని లోపాలు గణించక పోతేనే 
వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదం లో సింహం తో
పోల్చ రాదంటూనే పద్యం చివర "రాజ సింహమా" అని పిలవడం ఏం సబబు ?
అని తప్పు చూపించి తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం)

కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్ తార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో
గలగంబారుతునేగె నీవయనుశంకన్ కృష్ణరాయాధిపా !!

(ఇంకొక పద్యం)
నరసింహ కృష్ణ రాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభి త్తురంగ కమనీయంబై !
‎|| దమ్మిడీ||
ఒకరోజు పేదరాశి పెద్దమ్మ వేకువజామునే నిద్రలేచి, వాకిలి ఊడ్చుతూ వుండగా ఒక దమ్మిడీ దొరికందట.ఉదయాన్నే లక్ష్మిదేవి దొరికిందని సంబరపడి, ఆ దమ్మిడీని బియ్యం దాచే కుండలో వేసిందట.అన్నం వండడానికి ఆకుండలోని బియ్యాన్ని చేటలో ఒంపి దోసెడు బియ్యం మరల కుండలో వేసి, ఆదమ్మిడిని కూడా అందులో వేసిందట. కొన్ని బియ్యం ఎసరులో పోసి, మిగిలిన బియ్యం కిరాణా దుఖాణానికి తీసుకుపోయి ఆబియ్యానికి బదులుగా నూనె చింతపండు,ఉప్పు,కారం,దినుసులూ తీసుకువచ్చింది.
మద్యాహ్నం తన కొడుకులకు వడ్డించి,తనూ తిని విశ్రాంతి తీసుకుంది.కొడుకులు పొలంకి వెళ్ళిపోయారు.సాయంత్రం కుండలో బియ్యం ఉన్నాయనుకొని తీయబోయింది పెద్దమ్మ. కుండకు సగం ఉన్నాయి బియ్యం. పరద్యానంలో ఆబియ్యాన్ని చేటలో వేసి వంటకు ఉపక్రమించింది.దోసెడు బియ్యం కుండలో వేసి,దమ్మిడీని కూడా అందులో వేసింది.రాత్రి అందరూ భోంచేసారు.
మరుదినం వేకువనే నిద్రలెచి,నిళ్ళకుపోయి,స్నానాధికాలు ముగించి,వంతకు ఉపక్రమించి,కుండ తీయబోతే కుండలో సగానికి బియ్యం ఉన్నాయి. కొడుకులెవరాన తెచ్చి వేసారేమోననుకొని వంటచేసి,దమ్మిడీని కుండలోనే భద్రపరచి,దోసెడు బియ్యం అందులో వేసింది. రాత్రి వంట కోసం కుండలో చూడబోతే కుండకు సగానికి బియ్యం ఉన్నాయి.ఆశ్చర్యం .కొడుకులనడిగింది. మేమెవ్వరం బియ్యం అందులో వెయ్యలేదన్నారు వారు. ఎవ్వరూ వెయ్యకపొతే ఈ బియ్యం ఎలా వచ్చాయని తెలుసుకోవాలని అనుకుంది పెద్దమ్మ.ఆ రాత్రి నిద్రపోలేదు కుండ వైపే చూస్తూ గమనించసాగింది రాత్రంతా. తెల్లవారి కుండలో చూస్తే సగానికి బియ్యం ఉన్నాయి.ఈదమ్మిడీ ప్రభావం వల్లనే ఇదంతా జరిగిందని అనుకొని, దమ్మిడి తీసి చూసింది. బియ్యం ఎలావేసినవి అలాగే వున్నాయి.
పెద్దమ్మ ఆనందానికి అవధుల్లేవు కొడుకులతో ఆ దమ్మిడి మహత్యం గూర్చి చెప్పింది. ఆ కుండలో నుండి తీసి ఒక పెద్ద గూనలో ఆదమ్మిడిని వేసి కొంచెం బియ్యం వేసి చూడగా ఆ గూనకు సగం వరకు బియ్యం తయారైనవి. ఈవిధంగా తయారైన బియ్యాన్ని అమ్మి తొందరలోనే ధనవంతులయ్యారు. 
ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న ఎలుగుబంటి పేద్దమ్మ ఇంటికి వచ్చి, దమ్మిడీ ఇమ్మన్నది, ఇవ్వకపోతే ఈరాత్రికి నిన్ను మింగేస్తానని వెళ్ళిపోయింది. పెద్దమ్మ దిగులుతో కొడుకులకోసం ఎదురుచూడసాగింది. పెద్దకొడుకులు వచ్చారు వారితో చెబితే "ఇప్పూడే వస్తాము" అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు. చిన్నోడొచ్చాడు. చిన్నోడుతో చెబితే సరే రానీ చూద్దాం దాని పని పడతాను అని బళ్ళెం తీసి సానరాయి మీద నూరుతున్నాడట."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని మినుములు అడిగాయట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి ద్వారందగ్గర దాగుకో. మళ్ళీ "సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని పిచ్చుక అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి గూటిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని తేలు అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి పెడక(చూరు) దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని ఉప్పు అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి పొయ్యిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని పీత అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి బిందిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని దుడ్డుకర్ర అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి తలుపుమూల దాగుకో.అని చెప్పి చిన్నోడు అటక పైన దాగున్నాడట.
బాగా పొద్దుపోయింది యెలుగుబంటి పెద్దమ్మ ఇంటికి వచ్చింది తలుపేసి ఉంది. తన బలం అంతా ఉపయోగించి విసురుగా వచ్చి తలుపును ఢీకొట్టింది ఎలుగు. అంతే ఒక్క ఉదుటున లోనికి పడింది. కిందనున్న మినుములపై పడి జారి దొర్లుకుంటూ వెళ్ళి గోడను ఢీకొట్టింది.దులపరించుకొని, కింద ఏమున్నాయో చూద్దామని, గూటిలో దీపం తీయబోతే పిచ్చుక తన రెక్క్లతో ఆర్పేసింది. పెడకన అగ్గిపెట్టె ఉంటుందేమోనని వెత్కుతుంటే తేలు కుట్టింది.ఏది కుట్టిందో చూద్దామని 
పొయ్యిలో నిప్పులు రాజేసి మంట వెలిగిద్దామని మూతిపెట్టి ఊదితే ఉప్పుపేలి తన కంటిలోకి దుమ్మంతా ఎగిరి పడింది.
ఎలుగుబంటికి కళ్ళు మండుతుంటే నీటితో కళ్ళు కడగాలని బిందిలో చేయి పెట్టింది. అంతే పీత తన డెక్కలతో వేలు కత్తిరించింది. తలుపు మూలనున్న దుడ్డుకర్ర దిబ్బడ దబ్బడమని ఎలుగుబంటి వీపు విమానం మోత మొగిస్తుంటే, అటక పైనుండి చిన్నోడు బళ్ళెం పట్టుకొని దిగి చంపబోయాడు. యెలుగుబంటి తనను చంపవద్దని వెడుకుంటె, క్షమించి విడిచిపెట్టి ,బుద్ధిగా బ్రతుకు, మాజోలికి ఇక రావద్దంటూ చెప్పాడు.

Tuesday 1 January 2013

మురళి ||సౌందర్యము||

నీ తొలిచూపు తొలకరులే విరిజల్లులు కురియగ

నీ దరహాసపు చంద్రికలే విరికలువలు విరియగ


నీ నవనీతపు చెక్కిలిలే జిలుగులు వొలకగ

నీ వూసుల గుసగుసలే కవితలు పలుకగ


నీ అదిరే అధరములే మధువులు వొలకగ

నీ చెదిరే కురువీచికలే వింజామర వీచగ


నీ బెదిరే చూపులే మరులను కురిపించగ

నీ మరిగే పొంగులు బడబాగ్నిని రగిలించగ


నీ పొంగే పరువము విరహమునే రేపగ

నీ సుందర రూపమే విందులు పంచివ్వగ 

dt 31/12/12 time 7:50 PM


ప్రియా!
  నిన్ను చూసిన తొలి చూపులో ఏదో తెలియని మధుర స్మృతి. ఇంతకు ముందెన్నడో ఎప్పుడో చూసిన గుర్తు లీలగా మెదులుతుంది. నీవు నాతో ఏదో బాస చేసినట్లు, నేను నీతో ఏవో ఊసులాడినట్లూ, మంచుతెరల దుప్పటిలో పుడమికాంత ఆదమరచి నిదురోతున్నప్పుడు, నీ నులివెచ్చని ఒడితలగడపై నేను తలవాల్చి నీకన్నులలోకి తదేకంగా చూస్తున్నప్పుడు నీ కురుల వింజామరలతో విసురుతుంటే మలయమారుతమేదో నాముఖాన్ని తాకినప్పుడు ఆప్పుడు కలిగిన పులకరింత ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నట్లుంది. నీ అద్దం లాటి చెక్కిలిపై నా ముఖ ప్రతిబింబము సుస్పష్టంగా కనిపిస్తుంటే,అనుకోకుండా నాచేతితో నీ బుగ్గతాకినప్పుడు సిగ్గుతో ఎరుపెక్కిన నీచెక్కిలి గులాబి మొగ్గలా ముడుచుకుంటే అరవిరిసిన లేత గులబి మొగ్గ నీ బుగ్గ నిగ్గు చూసి సిగ్గుతో తలవాల్చుకోలేదా?  ఆప్పుడే వచ్చిన గండుతుమ్మెద నీ ముఖపద్మము పై వాలాలని ఎంతో ఆశగా వచ్చి, సంపంగి పువ్వు వంటి నీ ముక్కును చూసి గక్కున వెనుతిరిరుగలేదా(సంపంగి దగ్గరకు తుమ్మెదలు రావుకదా!)
 అప్పుడే ఉదయిస్తున్న చంద్రబింబం నీ ముఖం పైనున్న కురులు చిరుగాలికి తొలగిపోగా కనిపించిన ముఖ చంద్రాన్ని చూసి అప్పుడే చంద్రోదయం అయిందా అని తడబడి మబ్బుచాటుకు వెళ్ళి దాగుకోలేదా?
 మధుర మదిరా రసాఛ్ఛాదిత మదురసాపూరిత అధరసుధామధురసాన్ని గ్రోలాలని నా పెదవులు ఎంత ఆరాట పడలేదూ?
  మధుమాసంలొ ఒక సాయంసంధ్యాసమయంలో మరుమల్లెలు విరబూసి సౌగంధాన్ని వెదజల్లుతూ సోయగాలను వొలికిస్తున్న వేళలో మందహాసం తో మత్తెక్కించి వలపులు చిలికే ఆ వగలాడి చూపుతో పిలువక పిలిచే భావాలను రేపుతూ  నా ఎదలో నాకే తెలియని అలజడులను సృష్టిస్తూ, మదిని దోచిన చిన్నదానా!నీవు నా ఎదుటనే నిలుచుంటే మనసు దాచుకోలేక నీ ఎడద పై వాలలని నా ఎదలో రగిలే విరహాగ్నిని చల్లార్చుకోవాలని ఎంత తహతహలాడలేదూ?
    హేమంతఋతువు, చల్లని రేయి,అప్పుడే మంచు తెరలలను తొలగించుకొంటూ బాల శశిబింబము కురిపిస్తున్న వెన్నెల వెలుగులు నా విరహాగ్నిని నిప్పులను విసనకర్రతో విసిరినట్లు మరింత అధికం చేయుచున్నాయి. ఆ తరుణంలో నీ రాక గ్రీష్మఋతువు మిట్టమద్యాహ్నం భానుని తీక్షణ కిరణ తాకిడికి వేడెక్కిన సుర్యకాంతశిల పై పడిన మంచు వర్షం వలే నాకు హర్షం కలిగించలేదా? పరవశాన నీ చెక్కిలి తాకిన న పెదవులు చిరునవ్వుల అలికిడికి చిరుగాలి సవ్వడికి అదిరె చిగురాకుపెదవులు చిలికిన మధువును మరిగి నా చూపులు నీ పెదవులు దాటి ఎటులైనా మరలాలని ఎంత ప్రయత్నించలేదూ?
   నీవు లేక పోయినా, నీరూపం నా హృదయ మందిరంలో ఇంకా పదిలంగానే ఉంది. నీ చూపు నా పై లేక పోయిన న కన్నుల్లో నీరూపం ఇంకా కదలాడుతూనే వుంది. నిను తాకకపొయినా నీ మనసంతా నలోనే పరచుకొని ఉంది.
   వెన్నెల్లో విరబూసిన విరజజుల నడిగాను నీ చిరుదరహసపు అరవిరిసిన పెదవుల మాటున వెదజల్లిన వెన్నెలల చిరు దంతపు వెలుగుల చూసి తను రాల్చిన విరజాజులెమో నని తడబడినాయట.
    ................ఇంకా ఈలేఖ రాయడానికి  సమయం లేక నా ప్రియను కలవడనికి స్వప్న లోకాని వెళ్ళుచున్నాను.
              _____మీ ప్రియమైన ప్రియుడు.