Monday 19 February 2018

"పిసినారి ముసలివాడు"
ఊరివెలుపల పాడు కోనేరు చెంత
మనుజులెవ్వరు మసలని మారుమూల
గుట్టచాటున లోతైన గోయి త్రవ్వి
పసిడి దాచెను పిసినారి ముసలి యొకడు

ప్రతి దినంబును అచ్చటికేగుదెంచి
మురిసిపడుచుండె బంగారు ముద్ద జూసి
పొదల మాటున ఇదియెల్ల పొంచి జూసి
దొంగ యొక్కడు సర్వంబు దోచుకొనియె

మరుదినంబున ముసలివాడరుగుదెంచి
గోయి త్రవ్వంగ బంగారు మాయమయ్యె
నెత్తి నోరును లబలబా మొత్తుకొనుచు
గొల్లుమనియేడ్చి యతడు గగ్గోలు పెట్టె

అంత యాతని అరుపులు ఆలకించి
పరుగుపరుగున పొరుగువారరుగుదెంచి
ఏల ఏడ్చెద వీలీల నేలపొరలి
అనుచు ప్రశ్నింప ఈరీతి పనవె యతడు

ఏమి చెప్పుదు ముప్పది యేండ్లనుండి
కూడబెట్టిన ధనమెల్ల గోతిలోన
దాచి యుంచితి ఎవ్వడో తస్కరుండు
గోతిలోపలి ధనమెల్ల దోచుకొనియె

ప్రతి దినంబును ఇచ్చటికరుగుదెంచి
కాంచనంబును కాంక్షమై కంచు చుందు
ఏమి చేయుదు అక్కటా ఇంకమీద
అనుచు ఈరీతి పల్కుచు వగచి ఏడ్చె

ఇప్పుడైననుమించిన దేమి కలదు
గోయికలచోట ఒక పెద్ద బండపాతి
పసిడిగలదని భావించి ప్రతి దినంబు
కాంచుచుండుము నిత్యంబు కాంక్ష తీర

(ఎప్పుడో 5 వ తరగతి లో చదివిన "పిసినారి ముసలివాడు" పాఠం లోది. కవి ఎవరో తెలియదు)

No comments:

Post a Comment