Wednesday 10 April 2013

మురళి||సోయగం|| 

మధువులు ఊరె నీ పెదవులు 


కెంపులు చిందే నీ చెక్కిల్లు,


వలపులు చిలికే నీ చూపులు


తలుకులు బెలికే నీ కురులు


పువ్వులు విరిసే నీ నవ్వులు


నడకలు నేర్పే నీ పదములు


గమకము నేర్పే నీ నడతలు


గానము నేర్పే నీ పలుకులు


కులుకులు ఒలికే నీ హొయలు


చెణకులు విసిరే నీ మాటలు


సిగ్గులు విరిసే నీ కన్నులు


నిగ్గులు మెరిసె ని బుగ్గలు


మరులను వీచిన నీ కురులు


పరువము పొంగే నీ వయసు


నిగ్గులు తేలే నీ పొంగులు


మత్తును గొలిపే నీ పొందులు


తళుకులు మెరిసే నీ సోయగాలు


ఊసులు చెప్పే నీ తలపులు


ఒంపులు తిరిగే నీ ఒళ్ళు


తేనెలు చిలికే నీ నవ్వులు


వలపులు పండే నీ తలపులు


ప్రేమలు పంచే నీ జ్ఞాపకాలు


వన్నెల కురిసే నీ జిలుగులు


హరివిల్లు విరిసే నీ సొగసులు


తొలకరి జల్లె నీ కలయిక


అల్లుకు పోయె నీ సొగసులు


పిలుపులు పిలిచే నీ చూపులు


మత్తులు జల్లె నీ కబురులు


కవితలు నేర్పే నీ బాసలు


మధుమాస వేళలో నీ సోయగాలు!


***************************
||ఈర్ష్య ||

కళింగ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య పేరు సులోచన. రెండవ భార్య పేరు విమలాంగి.సులోచన తలపై ఒక వెంట్రుక, విమలాంగి తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు విమలాంగి "మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.

సులోచన ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి "మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు "మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి "మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని" చెప్పాయి.

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.

ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చిన పెద్ద భార్య... "నాకు బోలెడన్ని వెంట్రుకలు ఉన్నాయి, మీ రెండో భార్యకు రెండే వెంట్రుకలు ఉన్నాయి. కాబట్టి ఆమెని ఇంట్లోంచి తరిమేయండని" అడిగింది. వెంటనే రాజు విమలాంగిని తరిమేశాడు.

అలా రెండో భార్య విమలాంగి ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి.

(ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన నా కవిత)
మురళి||నేలతల్లి సోయగాలు||

పొగమంచు మేలి ముసుగు పరదాలో
పుడమితల్లి ముద్దు మోము దాచగా
భానుని ఉదయారుణ తరుణకిరణం
కొనగోటిని ముసుగును తొలగించగ

అరుణరాగ శోభిత తరుణభాను కిరణము
పుడమితల్లి పెదవులపై ముద్దిడువేళ

మధుపము మకరందము గ్రోలినట్లుగ
అధరామృతమధురసుధారసముల గ్రోలగ
ఘాఢ పరిష్వంగణమున చెలరేగిన
హుతాసన జ్వాల పుడమి తనువు
నంతటినీ నులువెచ్చగ చేయగ

ఆమని ఇంకా ఏమని రాలేదని గోముగ
ఎదురుచూసి ఎరుపెక్కిన కన్నులతో
శిశిరమందు ఎడబాటును భరియించక
మూగదైన కోయిల విరహముతో వేగలేక

మోడువారి నిదురుంచిన మామిడి తోట
మంచుతెరల తాకిడితో మరలా చిగురించగ
చిగురాకుల తిన మరిగిన ఎలకోయిల
మైమరచి గానముతో వసంతునే పిలువగ

పిలుపు విని వసంతుడే సుమదళములు
ఏరితెచ్చి కిసలయతల్పము పరువగ
హరిత వర్ణ చీరలోన నేలతల్లి సోయగాలు
వేయికన్నులున్నగాని చూడ తనివితీరదుగా
శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.
ఉగాదినాడు సూర్యోదయాత్ పూర్వమే తైలాభ్యంగన ( నువ్వుల నూనె రాసుకుని, సున్ని పిండితో ఒళ్ళురుద్దుకుని, తలంటు పోసుకోవాలి) స్నానం ఆచరించాలి. చక్కని సాంప్రదాయ వస్త్రధారణ చేయడం ప్రతీ ఒక్కరు మరువ వద్దు. అలాగే ఈ రోజు స్వయంగా భార్యా భర్త ఇద్దరు కూర్చుని పూజను చేసుకోవడం మరువకండి. అలా పండగ రోజైనా కాసేపు ఇద్దరు కలసి భగవత్కార్యంలో పాల్గొన్నట్లౌతుంది. ఇంటికి వచ్చిన బంధు,స్నేహితులతో కలిసి దేవాలయ దర్శనం- పంచాంగ శ్రవణం చేయవలసినది. 

"ప్రపాదానం" అంటే దారిన పోయే వారికి దాహము తీర్చుకోడానికి జలము అందించడం ( చలివేంద్రాల ఏర్పాటు ) ఈరోజునుండి మొదలు పెట్టి నాలుగునెలలపాటు చెయ్యాలట. ఈక్రింది శ్లోకాన్ని పఠిస్తూ జలమును అందిస్తే పితృదేవతలు, దేవతలు కూడా ప్రీతిచెందుతారు.

" ప్రపేయం సర్వసామన్యా భూతేభ్యః ప్రతిపాదితా
ప్రదానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహాః
అనివార్యం ఇతోదేయం జలం మాస చతుష్టయః "

అట్టి ప్రపాదానం చేయలేని వారు "ఉదకుంభ దానము" ( జలముతో ఉన్న కలశ ) ను దినమునకొకటి చొప్పున ద్విజులకు ఇవ్వవలెను.

" ఏషధర్మ ఘటో దత్తో బ్రహ్మవిష్ణు శివాత్మకః
అస్య ప్రదానా త్సకలా మమసంతు మనోరథాః "

బ్రహ్మాది దేవతా స్వరూపమైన ఈ ధర్మఘటమును ఇచ్చుచున్నాను. అందువలన నా మనోరథములన్నియు సమకూరవలెను అని అర్థము.
అని పఠిస్తూ ఉదకుంభ దానము చేయవలెను. ( కనీసం ఈ ఉగాదినాడైననూ ఈ ఉదకుంభదానము చేయుట శుభము. )

ఉగాది నాడు బ్రాహ్మణులకు పంచాంగము, విశన కఱ్ఱ, మామిడి పండు దానము చేయడం పరిపాటి.

ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు శుక్ల నవమి వరకు "వసంత నవరాత్రి వ్రతము"ను ఆచరించెదరు. ఈ నవరాత్రులలో దేవీ ఉపాసన చేయవలెను.

ఈ చైత్రమాసము మొత్తము పెరుగు,పాలు,నెయ్యి, తేనెలను తినకుండా నియమము కలవారై - "గౌరీవ్రతమును" ఆచరించెదరు. దంపతీ స్వరూపమైన గౌరీపూజను నిత్యమును చేయుటయే ఇచటి గౌరీవ్రత విధానము.

ఈ నూతన సంవత్సరం అందరం ధార్మిక ఆసక్తి కలిగిన వారమై, భగవద్భక్తితో, లక్ష్మీ అనుగ్రహాని కి పాత్రులమవ్వాలని ఆపరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరకీ శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.