Wednesday 4 September 2013



"గురు బ్రహ్మ, గురు విష్ణు 
గురు దేవో మహేశ్వరహ 
గురు సాక్షాత్ పరబ్రహ్మ 
తస్మై శ్రీ గురవే నమః"

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యనభ్యసించినప్పుడే..!

ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ.. తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికీ కేటాయించనంత సమయాన్ని గురువువద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి, తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను... విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు, స్మరించుకునేందుగానూ సెప్టెంబర్ 5వ తేదీని "ఉపాధ్యాయ దినోత్సవం"గా "గురు పూజోత్సవం"గా జరుపుకుంటున్నారు.

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. అసలు గురువును బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో పోల్చారంటే వారికి లభించిన గౌరవం, మన్నన అర్థం చేసుకోవాలి.
భారతీయ సంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైనది. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాలనాటి నుండి గురుశిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది. భారతీయ పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తరువాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపాయి. అందుకే అవి గురువుకు దైవత్వాన్ని ఆపాదించి పెట్టాయి.

ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..!. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్‌గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్. 

అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది.
ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.


ఇకపోతే... సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించతగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి. విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.
ప్రారంభ జీవితం, విద్య
సర్వేపల్లి రాధాకృష్ణ మద్రాస్రెసిడెన్సీలోని తిరుత్తణి ప్రాంతంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో (ప్రస్తుత తమిళనాడులోని తిరువల్లూర్జిల్లా) ఆయన జన్మించారు. ఆయన మాతృభాష తెలుగు. ఆయన తల్లి పేరుసీతమ్మ. ఆయన బాల్య జీవితం తిరుత్తణి, తిరుపతి ప్రాంతాల్లో గడిచింది. ఆయన తండ్రి రెవిన్యూ అధికారిగా పనిచేశారు. తిరుత్తణిలోని ప్రైమరీ బోర్డు హైస్కూల్లో ప్రాథమిక విద్య ముగియగా, తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ఎవాంజెలికల్లూథర్మిషన్స్కూల్లో సైతం ఆయన చదువుకున్నారు. మద్రాస్క్రిస్టియన్కాలేజీలో గ్రాడ్యుయేషన్పూర్తిచేశారు. అనంతరం ఎం.. పూర్తిచేశారు. ఇక డాక్టర్రాధాకృష్ణన్అనుకోకుండా వేదాంతం చదువుకోవాల్సి వచ్చింది. తర్వాత వేదాంతంపై ఎంతో ఆసక్తి కనబరిచి అధ్యయనం చేశారు. నేపథ్యంలో వేదాంతంపై ఎన్నో రచనలు చేశారు. ఆయన రచనలు ఎందరినో ప్రభావితుల్ని చేశాయి.
.
సమయంలో ఆయన ప్రముఖ జర్నల్స్ క్వెస్ట్‌, జర్నల్ఆఫ్ఫిలాసఫీ, ఇంటర్నేషనల్జర్నల్ఆప్ఎథిక్స్కు ఎన్నో ఆర్టికల్స్రాశారు. ఆయన తొలిసారిగా   ‘ది ఫిలాసఫి ఆఫ్రవీంద్రనాథ్‌’   అనే పుస్తకాన్ని రాశారు. ఆయన ఠాగూర్ఫిలాసఫీని ఉత్తమ వేదాంతంగా పేర్కొన్నారు. ఇక రాధాకృష్ణన్ఆంధ్రా యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా 1931 నుంచి 1936 వరకు పనిచేశారు. 1939లో పండిత్మదన్మోహన్మాలవ్య బనారస్హిందూ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా చేయాలని రాధాకృష్ణన్ను విజ్ఞప్తిచేశారు. దీంతో రాధాకృష్ణన్బనారస్యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా పదవీబాధ్యతలు స్వీకరించి 1948 సంవత్సరం జనవరి వరకు పనిచేశారు. దేశానికిస్వాతంత్య్రం వచ్చిన తర్వాత డాక్టర్రాధాకృష్ణన్యునెస్కోలో
 ఇండియా ప్రతినిధిగా1952 వరకు కొనసాగారు. ఇక 1952లో దేశ ఉపాధ్యక్షుడిగా ఆయన ఎంపికయ్యారు. తర్వాత దేశ రెండవ అధ్యక్షుడిగా 1962 నుంచి 1967 వరకు పనిచేసి ఎంతోపేరుతెచ్చుకున్నారు.
విశ్వవిఖ్యాత తాత్వికుడిగా, ఆదర్శ ఉపాద్యాయుడిగా అందరి మన్ననలు చూరగొన్న సర్వేపల్లి కనుమరుగైనా.. ఆయన భావనలు.. నాడు, నేడు, మరెప్పటికీ అధ్యాపక లోకానికి స్పూర్తిగా నిల్చిపోతాయి. తనలోని జ్ఞానసంపదను విద్యార్థులకు పంచడం ద్వారా వారి భావి జీవితానికి బంగారు బాటను వేసిన గురుదేవుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరి మనసుల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప వేదాంతిగా పేరుతెచ్చుకున్నారు.1888 సంవత్సరం సెప్టెంబర్‌ 5 జన్మించిన ఆయన 1975 ఏప్రిల్‌ 17 మృతిచెందారు. ఇక ఆయన దేశ తొలి ఉపాధ్యక్షుడిగా 1952 నుంచి 1962 వరకు పనిచేయగా పనిచేశారు. రాధాకృష్ణ తన వేదాంత పద్ధతులతో పాశ్చాత్య దేశాలు, మన దేశానికి మధ్య వారధిని నిర్మించేందుకు ప్రయత్నించారు. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.





Monday 15 July 2013

ఈ పద్యం చూడండి యెటు నుండి యెటు చదివినా ఒకేలా ఉంటుంది. 

ఎర్రన వ్రాసిన పద్యాలు ఇటువంటివి కొన్ని వందలు వున్నాయి.


కం. నాయశరగ సారవిరయ 


సాయన జయసారశుభగ ధరధీనియమా


మాయని ధీరధగభశుర


సాయజనయ సాయరవిర సాగరశయనా


దీనిని అనులోమ కందం అంటారు.



నంది తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలొ నారదుడు శ్రీకృష్ణుని 

స్తుతిస్తూ 

చెప్పిన పద్యమిది.



న్యాయం అనే శరములతో గరుత్మంతుని గమనాన్ని మించిన వేగంతో 

విజయాన్ని సాధించగల నైపుణ్యం గల మహాత్మా! ముల్లోకాలకు నీవే 

ఆదర్శం.దుర్మార్గులను అణచి, ధర్మాన్ని నెలకొల్పి,జన 

హృదయుడవైనావు. అని భావము

Wednesday 10 April 2013

మురళి||సోయగం|| 

మధువులు ఊరె నీ పెదవులు 


కెంపులు చిందే నీ చెక్కిల్లు,


వలపులు చిలికే నీ చూపులు


తలుకులు బెలికే నీ కురులు


పువ్వులు విరిసే నీ నవ్వులు


నడకలు నేర్పే నీ పదములు


గమకము నేర్పే నీ నడతలు


గానము నేర్పే నీ పలుకులు


కులుకులు ఒలికే నీ హొయలు


చెణకులు విసిరే నీ మాటలు


సిగ్గులు విరిసే నీ కన్నులు


నిగ్గులు మెరిసె ని బుగ్గలు


మరులను వీచిన నీ కురులు


పరువము పొంగే నీ వయసు


నిగ్గులు తేలే నీ పొంగులు


మత్తును గొలిపే నీ పొందులు


తళుకులు మెరిసే నీ సోయగాలు


ఊసులు చెప్పే నీ తలపులు


ఒంపులు తిరిగే నీ ఒళ్ళు


తేనెలు చిలికే నీ నవ్వులు


వలపులు పండే నీ తలపులు


ప్రేమలు పంచే నీ జ్ఞాపకాలు


వన్నెల కురిసే నీ జిలుగులు


హరివిల్లు విరిసే నీ సొగసులు


తొలకరి జల్లె నీ కలయిక


అల్లుకు పోయె నీ సొగసులు


పిలుపులు పిలిచే నీ చూపులు


మత్తులు జల్లె నీ కబురులు


కవితలు నేర్పే నీ బాసలు


మధుమాస వేళలో నీ సోయగాలు!


***************************
||ఈర్ష్య ||

కళింగ దేశపు రాజుగారికి ఇద్దరు భార్యలు ఉండేవారు. మొదటి భార్య పేరు సులోచన. రెండవ భార్య పేరు విమలాంగి.సులోచన తలపై ఒక వెంట్రుక, విమలాంగి తలపై రెండు వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు విమలాంగి "మీ మొదటి భార్యకు ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టేయండి" అని రాజుగారిని అడిగింది. దానికి సరేనన్న రాజు వెంటనే మొదటి భార్యను వెళ్లగొట్టాడు.

సులోచన ఇంట్లోంచి వెళ్లిపోతుంటే ఆమెకు చీమలు కనిపించి "మమ్మల్ని తొక్కకుండా వెళితే, నీకు వచ్చేటప్పుడు బోలెడన్ని ఉంగరాలు ఇస్తామని" చెప్పాయి. అలాగే అంటూ రాణి వాటిని తొక్కకుండా జాగ్రత్తగా వెళుతుంటే.. దారిపక్కన ఉండే గులాబీ చెట్లు "మాకు నీళ్లు పోసినట్లయితే, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని పూలు ఇస్తామని" అన్నాయి. అలాగే అంటూ రాణి చెట్లకు నీళ్లు పోసింది. ఆ తరువాత రాణికి ఆవులు కనిపించి "మాకు కుడితి పెట్టి, మేత వేస్తే నీవు వచ్చేటప్పుడు పాత్రలకొద్దీ పాలు ఇస్తామని" చెప్పాయి.

అంతలోనే రాణికి పేదరాశి పెద్దమ్మ కనిపించింది. వెంటనే ఆమెతో తనను రాజుగారు వెళ్లగొట్టిన సంగతంతా చెప్పింది. దానికి బాధపడ్డ పేదరాశి పెద్దమ్మ ఈ నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయని చెప్పింది. వెంటనే ఆ నదిలో స్నానం చేయగానే రాణిగారికి వెంట్రుకలు వచ్చాయి. ఆ తరువాత పేదరాశి పెద్దమ్మ ఇచ్చిన కొత్తబట్టలు కట్టుకుని తిరిగీ రాజుదగ్గరికి బయలుదేరింది.

ఆమె తిరిగి వస్తున్నప్పుడు చీమలు ఉంగరాలు ఇచ్చాయి, ఆవులు పాలు ఇచ్చాయి, గులాబీ చెట్లు బోలెడన్ని పూలు ఇచ్చాయి. వాటన్నింటినీ తీసుకుని సంతోషంగా రాజు దగ్గరికి వచ్చిన పెద్ద భార్య... "నాకు బోలెడన్ని వెంట్రుకలు ఉన్నాయి, మీ రెండో భార్యకు రెండే వెంట్రుకలు ఉన్నాయి. కాబట్టి ఆమెని ఇంట్లోంచి తరిమేయండని" అడిగింది. వెంటనే రాజు విమలాంగిని తరిమేశాడు.

అలా రెండో భార్య విమలాంగి ఇంట్లోంచి వెళ్తోంటే ఆమెకు కూడా చీమలు కనిపించి.. మొదటి భార్యకు చెప్పినట్లుగానే చెప్పాయి. అయినా వాటి మాటను పెడచెవిన పెట్టిన ఆమె వాటిని తొక్కుకుంటూ వెళ్లింది. అలాగే గులాబీ చెట్లకు నీళ్లు పోయలేదు, ఆవులకు కుడితి, మేత పెట్టలేదు. పేదరాశి పెద్దమ్మ కనిపించి ఈ నదిలో మునిగితే వెంట్రుకలు వస్తాయని చెప్పగా.. నదిలో మునిగిన రెండో రాణికి వెంట్రుకలు వచ్చాయి.

అంతే ఆశ పెరిగిపోయిన రెండో రాణి మళ్లీ నదిలో మునిగింది. అలా ఇంకా చాలా వెంట్రుకలు రావాలని ఆశపడ్డ ఆమె మళ్లీ మళ్లీ నదిలో మునగసాగింది. దీంతో ఆమెకు వచ్చిన వెంట్రుకలు కూడా పోయి, బోడిగుండులాగా మిగిలింది. అయ్యో.. ఇలా జరిగిందేంటి..? అని ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్న ఆమెని ఆవులు మేత వేయలేదని పొడిచాయి, గులాబీలు ముళ్లతో గుచ్చాయి, చీమలు బాగా కుట్టేశాయి.

(ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన నా కవిత)
మురళి||నేలతల్లి సోయగాలు||

పొగమంచు మేలి ముసుగు పరదాలో
పుడమితల్లి ముద్దు మోము దాచగా
భానుని ఉదయారుణ తరుణకిరణం
కొనగోటిని ముసుగును తొలగించగ

అరుణరాగ శోభిత తరుణభాను కిరణము
పుడమితల్లి పెదవులపై ముద్దిడువేళ

మధుపము మకరందము గ్రోలినట్లుగ
అధరామృతమధురసుధారసముల గ్రోలగ
ఘాఢ పరిష్వంగణమున చెలరేగిన
హుతాసన జ్వాల పుడమి తనువు
నంతటినీ నులువెచ్చగ చేయగ

ఆమని ఇంకా ఏమని రాలేదని గోముగ
ఎదురుచూసి ఎరుపెక్కిన కన్నులతో
శిశిరమందు ఎడబాటును భరియించక
మూగదైన కోయిల విరహముతో వేగలేక

మోడువారి నిదురుంచిన మామిడి తోట
మంచుతెరల తాకిడితో మరలా చిగురించగ
చిగురాకుల తిన మరిగిన ఎలకోయిల
మైమరచి గానముతో వసంతునే పిలువగ

పిలుపు విని వసంతుడే సుమదళములు
ఏరితెచ్చి కిసలయతల్పము పరువగ
హరిత వర్ణ చీరలోన నేలతల్లి సోయగాలు
వేయికన్నులున్నగాని చూడ తనివితీరదుగా
శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.
ఉగాదినాడు సూర్యోదయాత్ పూర్వమే తైలాభ్యంగన ( నువ్వుల నూనె రాసుకుని, సున్ని పిండితో ఒళ్ళురుద్దుకుని, తలంటు పోసుకోవాలి) స్నానం ఆచరించాలి. చక్కని సాంప్రదాయ వస్త్రధారణ చేయడం ప్రతీ ఒక్కరు మరువ వద్దు. అలాగే ఈ రోజు స్వయంగా భార్యా భర్త ఇద్దరు కూర్చుని పూజను చేసుకోవడం మరువకండి. అలా పండగ రోజైనా కాసేపు ఇద్దరు కలసి భగవత్కార్యంలో పాల్గొన్నట్లౌతుంది. ఇంటికి వచ్చిన బంధు,స్నేహితులతో కలిసి దేవాలయ దర్శనం- పంచాంగ శ్రవణం చేయవలసినది. 

"ప్రపాదానం" అంటే దారిన పోయే వారికి దాహము తీర్చుకోడానికి జలము అందించడం ( చలివేంద్రాల ఏర్పాటు ) ఈరోజునుండి మొదలు పెట్టి నాలుగునెలలపాటు చెయ్యాలట. ఈక్రింది శ్లోకాన్ని పఠిస్తూ జలమును అందిస్తే పితృదేవతలు, దేవతలు కూడా ప్రీతిచెందుతారు.

" ప్రపేయం సర్వసామన్యా భూతేభ్యః ప్రతిపాదితా
ప్రదానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహాః
అనివార్యం ఇతోదేయం జలం మాస చతుష్టయః "

అట్టి ప్రపాదానం చేయలేని వారు "ఉదకుంభ దానము" ( జలముతో ఉన్న కలశ ) ను దినమునకొకటి చొప్పున ద్విజులకు ఇవ్వవలెను.

" ఏషధర్మ ఘటో దత్తో బ్రహ్మవిష్ణు శివాత్మకః
అస్య ప్రదానా త్సకలా మమసంతు మనోరథాః "

బ్రహ్మాది దేవతా స్వరూపమైన ఈ ధర్మఘటమును ఇచ్చుచున్నాను. అందువలన నా మనోరథములన్నియు సమకూరవలెను అని అర్థము.
అని పఠిస్తూ ఉదకుంభ దానము చేయవలెను. ( కనీసం ఈ ఉగాదినాడైననూ ఈ ఉదకుంభదానము చేయుట శుభము. )

ఉగాది నాడు బ్రాహ్మణులకు పంచాంగము, విశన కఱ్ఱ, మామిడి పండు దానము చేయడం పరిపాటి.

ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు శుక్ల నవమి వరకు "వసంత నవరాత్రి వ్రతము"ను ఆచరించెదరు. ఈ నవరాత్రులలో దేవీ ఉపాసన చేయవలెను.

ఈ చైత్రమాసము మొత్తము పెరుగు,పాలు,నెయ్యి, తేనెలను తినకుండా నియమము కలవారై - "గౌరీవ్రతమును" ఆచరించెదరు. దంపతీ స్వరూపమైన గౌరీపూజను నిత్యమును చేయుటయే ఇచటి గౌరీవ్రత విధానము.

ఈ నూతన సంవత్సరం అందరం ధార్మిక ఆసక్తి కలిగిన వారమై, భగవద్భక్తితో, లక్ష్మీ అనుగ్రహాని కి పాత్రులమవ్వాలని ఆపరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరకీ శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.

Thursday 24 January 2013


అల్లసాని పెద్దన విరచిత "మనుచరిత్రము".
ప్రవరాఖ్యుడి దినచర్య ఎలావుండేదంటే -

వరణాతరంగిణీదర వికస్వరనూత్న
కమలకషాయగంధము వహించి
ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ
వామనస్తుతిపరత్వమున లేచి
సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట
నఘమర్షణస్నాన మాచరించి
సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి
సైకతస్థలి గర్మసాక్షి కెఱగి

ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ
తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు
బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు
వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ

ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం. ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన + అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి. అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది. కనక తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు). వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి. అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు. విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వమున) నిద్రలేస్తాడు.

శిష్యులతో సహా (సచ్చాత్రుడగుచు) రోజూ వెళ్ళి నదిలో (అయ్యేటన్ - యేరునందున్) అఘమర్షణ స్నానం చేస్తాడు. అఘమును - పాపాన్ని - తొలగించేది. పాప పంకిలాలను తొలగించే మంత్రాలు చదువుకుంటూ చేసే స్నానం అఘమర్షణ స్నానం, దాన్ని ఆచరించి సంధ్యాసమయంలో సూర్యుడికి చెయ్యవలసిన అర్ఘ్య తర్పణ ప్రదానాలు నిర్వహించి (సాంధ్య కృత్యమున్ తీర్చి) గాయిత్రీ మంత్రాన్ని (సావిత్రిన్ - సవితృ) జపించి, ఇసుకతిన్నెమీద నిలబడి, కర్మసాక్షి సూర్యభగవానుడికి నమస్కరించి (ఎఱగి) తరువాత తన శిష్యులతో కలిసి (బ్రహ్మచారులు వెంటరాన్) ఇంటికి వచ్చేవాడు. సమీపంలో దొరికిన ఫలాలు సమిధలు దర్భలు (కుశ) పువ్వులు (కుసుమాలు) ఇటువంటి పూజాద్రవ్యాలను సేకరించి కొందరు శిష్యులు తెస్తున్నారు. మరి కొందరు ఉతికిన మడుగు దోవతులు పట్టుకొని గురువుగారి వెంట నడుస్తున్నారు. ఇలా శిష్యపరివారం వెంటరాగా, బ్రాహ్మణుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకొనేవాడు.

ప్రవరుడు ఇంత నిష్టగా ఉండటం, శిష్యులకి విద్యాబోధన చెయ్యడం, క్రమశిక్షణ - ఇవన్నీ గమనించి ప్రజలు సంతోషించి ప్రవరుణ్ణి మెచ్చుకుంటూ చూసే వారట. వారి చూపులో మెప్పుదల కనిపించేది. అంటే పట్టణ పౌరులు అతడిపట్ల గౌరవంగానూ బాధ్యతాయుతంగానూ మెలిగేవారని. "ప్రజ తన్ను మెచ్చి చూడ" అని ముగించడంలో వ్యక్తి బాధ్యత - సంఘ బాధ్యతలు వాటి పరస్పర సంబంధం - అన్నీ స్ఫురణ ఉంది

ఇది ఒకరోజో, అడపా తడపానో జరిగే ప్రక్రియ కాదు. నిత్యం (నిచ్చలు) క్రమం తప్పకుండా జరిగే దినచర్య.