Thursday, 19 February 2026

అల్లుడి అదృష్టం భద్రయ్య కూతురు సీత పెళ్ళికుదిరింది. ఊళ్ళోనే వున్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు, భద్రయ్య పెళ్ళి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తను వుంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు. ఇంటి పక్కనే వున్న శాంతయ్య తనకి కలిసి వస్తుందని కొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బు బయానాగా ఇచ్చాడు. కాని భద్రయ్యంటే పడని గోపయ్య ఆ ఇంటికి వాస్తు సరిగ్గా లేదనీ, కొంటే అరిష్టమనీ భయపెట్టాడు. శాంతయ్య భయపడి తను ఆ ఇల్లు కొనలేనని బయానాగా ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నాడు. భద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్ళి పెళ్ళి వాయిదా వెయ్యమని కోరాడు, ఇల్లు అమ్ముడైతే తప్ప కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు. అప్పుడు వరుడు శివయ్య ముందుకు వచ్చి, "నాన్నా! కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను. పెళ్ళయిన తర్వాత అన్నయ్య మీ దగ్గర వుంటాడు. నేను ఆ ఇంట్లో కాపురం వుంటాను" అన్నాడు. "ఆ ఇల్లు చాలా పాతబడింది. గదా?" అని సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య, "ఆ ఇల్లు వున్న స్థలం మంచి కూడలిలో గ్రామం మధ్యలో వుంది నాన్నా! నేను దాన్నిపడగొట్టి ఇంటితో పాటు దుకాణం కట్టిస్తాను. వ్యాపారానికి అనుకూలంగా వుంటుంది" అని తండ్రికి నచ్చజెప్పాడు శివయ్య ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్ళియిన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో వున్న కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు. తర్వాత శివయ్య పెంకుటిల్లు వేడ గొట్టించాడు. కొత్త ఇల్లు, దుకాణం కట్టించ దానికి పునాదులు తవ్వుతుంటే లంకెబిందె దొరికింది. దాన్నిండా బంగారు కాసులున్నాయి. శివయ్య పట్నం వెళ్ళి మామగారిని కలుసు కుని ఇంటి పునాదుల్లో లంకె బిందె దొరికిందనే సంగతి చెప్పాడు. "మావయ్యా! ఆ లంకెబిందె మీ పూర్వీకు లదై వుంటుంది. అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండి" అన్నాడు శివయ్య.. భద్రయ్య నవ్వి "అదంతా నీ అదృష్టం అల్లుడూ, అదే నేనా ఇల్లు శాంతయ్యకు అమ్మి వుంటే లంకె బిందె బైట పడినా, నాకు చెప్పే వాడా? తిరిగి ఇచ్చేవాదా? ఇల్లు కొనడానికి బయానాగా డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే, మా పెద్దల ఆస్తి బైటకు పోకుండా వుండటానికే అనుకుంటాను. ఇదంతా ఆ దేవుని దయ. నీ అదృష్టము కాబట్టి ఆ బంగారం నీదే" అని లంకెబిందె తీసు కోవడానికి తిరస్క రించాడు. శివయ్య సంతోషించాడు.

No comments:

Post a Comment