Thursday, 19 February 2026
అనురాగ విజయం
మానస దేశపు రాకుమారి పేరు చైత్రసేన. ఆమెకు చిత్రలేఖనం వచ్చుగాని, ఆమె గీసిన చిత్రాలలో ఏమాత్రం జీవం లేదా సౌందర్యం కనిపించేది కాదు. రాకుమారి గీసిన చిత్రాలు కనుక, ఆ బొమ్మలు ప్రజల్లోకి వెళ్ళేవి. ఎవరూ మనస్ఫూర్తిగా వాటిని మెచ్చుకునేవారు కాదు. రాకుమారికి ఆ విషయం తెలుస్తూనే ఉండేది.
ఇలా ఉండగా ఒకనాడు ఓ హంస ఎక్కడి నుండో ఎగిరి వచ్చి, "నేను చెప్తాను, నీవు బొమ్మలు గీయి. అవి ఎంత బాగుంటాయో ఆ తరువాత చూచుకో," అంది.
నిజంగానే హంస ఏ బొమ్మను ఎలా ఊహించి గీయాలో వివరంగా, చక్కగా చెప్తూ ఉండేది. హంసకు ఇన్ని మాటలు రావటం చూచి రాకుమారికి విస్తుపోయేది.
"నాదేముంది? అంతా మా గురువుగారి ప్రసాదం. ఈ ఊహాశక్తి, చిత్రలేఖనం జ్ఞానం ఆయనది. నేను మాట్లాడే మాటలు ఆయనవి. నాలాంటి పక్షి చేత ఇన్ని మాట్లాడించటం ఆయన గొప్ప," అనేది ఆ హంస.
"ఆయన ఎవరు? ఎక్కడ ఉంటారు?" అని అడిగింది చైత్రసేన ఆత్రంగా.
"చెప్పవలసిన రోజున తప్పక చెప్తాను. ముందు నీవు బొమ్మలు గీయి. అవి నలుగురిలో 'అద్భుతం' అనిపించుకోనివ్వు," అంది హంస.
రాకుమారి ఎందరివో యువరాజుల బొమ్మలు గీసింది. అవి అన్నీ హంస చెప్పగా ఊహించి గీచిన చిత్రాలు. రాకుమారి ఆ బొమ్మలను పొరుగుదేశపు యువరాణులకు పంపుతూ ఉండేది. ఆ చిత్రాల్లోని యువకులను చూచి, ప్రతి యువరాణి పెళ్ళాడితే అలాంటి యువకుడినే పెళ్ళాడాలని అనుకునేది.
చైత్రసేనకు చిత్రలేఖనంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆమె మాత్రం చిత్రాల్లోని యువరాజుల సౌందర్యానికి మురిసిపోక, హంస గురువు ఎవరో, అతడే తన ఆరాధ్య పురుషుడిగా భావిస్తూ వచ్చింది.
రాకుమారి తన గురువును ప్రేమిస్తుందని నమ్మకం కలిగాక, అతడెవరో హంస విప్పి చెప్పింది. అతడు విజయ్ అనే ఓ సామాన్య పౌరుడు.
నిజానికి అతడికి చిత్రలేఖనం రాదు. ప్రముఖ గ్రంథాలలో, పురాణాలలో ఉన్న సౌందర్యవంతుల వర్ణనలు గుర్తుంచుకుని, వాటిని హంసకు నేర్పుతూ వచ్చాడు.
రాకుమారికి చిత్రలేఖనం వచ్చుగాని, ఊహాశక్తి లేని కారణంగా, ఆమె రాణించలేక పోయింది. హంస అందించే ఊహలతో కావ్య నాయకుల బొమ్మలు అనేకం గీయగలిగింది. విజయ్కి చిత్రలేఖనం రాదని తెలిసి, రాకుమారి నిరుత్సాహపడినా, అతడి నుండి మనస్సు మరల్చుకోలేదు.
ఎందరో అందగాళ్లను చిత్రాలలో చూపించి, ఓ సామాన్య పౌరుణ్ణి పెళ్ళాడతానంటే రాజు ఒప్పుకోడని చైత్రసేనకు తెలుసు. అందుకని మరో కంటవారికి తెలియకుండా, విజయ్కి కోటలో సైనికులకు శిక్షణ ఇచ్చేవాడి ఉద్యోగం ఇప్పించింది. అతడు శ్రద్ధగా పని చేస్తున్నట్టు కొన్ని సందర్భాలను సృష్టించి, తండ్రి దృష్టిలో పడేలా చేసింది. విజయ్ సైనిక శిక్షకుడి పదవి నుండి ఖజానాలో పత్రాల రక్షకుడి పదవిలోకి వచ్చాడు. యువరాణి చాటుమాటుగా అందించిన చేయూతతో కొన్నాళ్ళకు రాజు అంతరంగిక సలహాదారులలో ఒకడయ్యాడు.
ఇలా ఉండగా, రాజు ఓసారి తన కుమార్తె యొక్క చిత్రకళా కౌశల్యం చూడాలనే ఉబలాటంతో, ఆమె లేని సమయంలో ఆమె కళామందిరానికి వెళ్ళాడు.
అక్కడ అనేకమంది అందగాళ్ళ చిత్రాలు గీయబడి ఉన్నాయి. ఆ చిత్రాలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా విజయ్ చిత్రాలు వివిధ భంగిమల్లో గీయబడి ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ఒకవేళ తన కూతురు అతణ్ణి ప్రేమిస్తుందేమోనన్న అనుమానం వచ్చింది.
నేరుగా చైత్రసేనను పిలిచి విజయ్ చిత్రాల సంగతి అడిగాడు. చైత్రసేన మొదట కంగారు పడినా, తమాయించుకుని ఓ సామాన్య అందగాడి చిత్రాలకు, ఊహా చిత్రాలలో కనిపించే అందగాళ్ళ చిత్రాలకు వ్యత్యాసం తెలియజెప్పటం కోసం అతడి చిత్రాలు గీశానని చెప్పింది.
ఆమె మాటలకు నమ్మినట్టు కనిపించినా, ఒక పరాయి మగాడి చిత్రాలు ఏ పరిచయమూ లేకపోతే, అంత స్పష్టంగా గీయటం కష్టమని భావించాడు. చైత్రసేనకు తెలియకుండా గూఢచారులను నియమించాడు. చివరకు రాకుమార్తె చాటుగా అతణ్ణి కలుసుకుంటున్నట్టూ, రాకుమార్తె అతణ్ణి గాఢంగా ప్రేమిస్తున్నట్టూ గూఢచారులు కనిపెట్టి, రాజుకు తెలియజేశారు. చైత్రసేన తన ఊహా చిత్రాలలో ఉన్న అందగాళ్ళలాంటి వాడిని ఎవరినైనా ప్రేమించి ఉంటే రాజు ఆశ్చర్యపడేవాడు కాదు.
ఇలా ఉండగా చైత్రసేన గీచిన చిత్రాలలో అచ్చంగా ఓ చిత్రాన్ని పోలిన యువరాజు నరేంద్రుడు ఆ రాజ్యానికి రావటం జరిగింది. అతడు రాకుమారిని కలుసుకొని మాట్లాడేందుకు అనుమతి పొంది, ఆమెను కలుసుకున్నాడు. హంస చెప్పినవన్నీ ఊహలే కనుక, ఊహల్లో మనుషులు నిజంగా ఉండరని చైత్రసేన భావిస్తూ వచ్చింది. అందుకే తన చిత్రపటాల్లోని అందగాళ్ళను చూచి, ఆమె మైమరచిపోలేదు. కాని, నిజంగా అలాంటి అందగాడే తారసపడేసరికి, ఆమె నిర్ఘాంతపోయింది.
ఏమైనా అతడు పరాయివాడు కనుక, రాకుమారి గంభీరతను తెచ్చుకుని, "నన్ను దేనికి కలుసుకోవటం?" అని అడిగింది.
"ఇదివరకు మనం ఎప్పుడూ కలుసుకోలేదు. నన్ను చూడకుండా నా చిత్రం గీయగలగటం నాకాశ్చర్యంగా ఉంది. నా చిత్రాన్ని మీరు అన్ని దేశాల యువరాణులకు పంపారు. ఇప్పుడు వాళ్ళంతా నా గురించి తెలుసుకుని, నన్ను వివాహమాడేందుకు తొందరపడుతున్నారు. నాకు మాత్రం నన్ను ఊహల్లో ఊహించిన యువతినే పెళ్ళాడాలని ఉంది.
అటు తిరిగి నిలబడటం కాక, ఒక్కసారి నా వంక చూడండి. మీ ఊహాచిత్రానికి నేను కొంచెం భిన్నంగా ఉన్నా నన్ను తిరస్కరించవచ్చు," అన్నాడు నరేంద్రుడు.
చైత్రసేన అతడిని తిరిగి చూచేందుకు సాహసించలేక పోయింది. నిజానికి తాను గీచిన అన్ని చిత్రాలలోకి, అతడి చిత్రమే తనని ఎక్కువ ఆకర్షించింది. అంతటి అందగాడు ఉంటాడా అని ఎన్నిసార్లో అనుకుని, అంతటి అందాన్ని ఊహించి చెప్పగలిగిన హంస గురువును ప్రేమించింది. ఇప్పుడు వాస్తవంగా ఆ అందగాడే వచ్చి, 'నన్ను చూడు' అని పిలుస్తూంటే, ఆమెకి మతిపోయింది.
నరేంద్రుడు రాజు. లేదా, ఆ విజయ్ ఏ వీరుడో, ఏ యువరాజుడో అయినా రాజుకి ఆశ్చర్యం కలిగేది కాదు.
ఒక సామాన్యుడై ఉండి విజయ్ రాకుమార్తె మనస్సుని ఎలా చూరగొన్నాడో రాజుకి ఎంత యోచించినా అర్థం కాలేదు. రాజు విజయ్ చిత్రాలన్నీ తెప్పించి వివిధ దేశపు యువరాణులకు పంపాడు. చైత్రసేనే వాటిని పంపినట్టు చెప్పించాడు.
ఎందరో అందగాళ్ళను సృష్టించిన చైత్రసేన, అంత అందవిహీనమైన చిత్రాన్ని గీచి పంపినందుకు ఆశ్చర్యపడుతూ, "వాడు అందగాడా? ఇది నీవు గీయవలసిన చిత్రమా?” అంటూ చైత్రసేనకు కబుర్లు అందాయి.
చైత్రసేన ఏమి చేయటానికి తోచక, "నేను మిమ్మల్ని చూడవలసిందేమీ లేదు. మా తండ్రి అంతరంగిక సలహాదారుల్లో విజయ్ అనే ఆయన ఉన్నారు. ఆయన్ని వెళ్ళి కలవండి," అన్నది.
"విజయ్ అంటే, నా రాజ్యంలో నా దగ్గర సేవకుడుగా పనిచేసిన వాడొకడు ఈ రాజ్యానికి వచ్చాడు. వాడు కాదు గదా!" అన్నాడు యువరాజు ఆశ్చర్యంగా.
ఆనవాళ్ళు అన్నీ చెప్పగా ఆ విజయే గుణశేఖరుడని అర్థం అయింది రాకుమారికి. పిడుగు పడినట్టయింది. ఆమె మరి కొంత సేపు యువరాజు నరేంద్రుడితో మాట్లాడేసరికి ఎన్నో విషయాలు అర్థం అయ్యాయి. ఈ యువరాజు నరేంద్రుడే చైత్రసేనను ఓసారి అడవికి వేటకు వచ్చినప్పుడు చూశాడట.
ఆమెను ప్రేమించాడు. ఆమె చిత్రలేఖనంపై మక్కువ ఉండి, రాణించలేక తికమక పడుతున్నట్టు విన్నాడు. తన దగ్గర సేవకుడిగా పనిచేస్తున్న విజయ్ అనే వాడి దగ్గర ఓ మాట్లాడే హంస ఉంది. దానికి తనకన్నా తక్కువ అందాలతో అనేక మంది యువరాజుల అందచందాలు నూరిపోసి, ఆఖరున తన అందం గురించి నూరి పోయటం జరిగింది. హంస యజమానిగా, హంసకు మాటలు నేర్పిన వాడుగా ఆ హంసతో విజయ్ మానస దేశానికి పంపబడ్డాడు.
కాని, వాడు వంచనకు దిగి, తానే రాకుమారి ప్రియుడిగా మారాడు. ఇంత తెలిశాక, రాకుమారి మనస్సు భగభగ లాడింది.
"నన్ను చూచి మనస్సు పడగానే మీరు మా తండ్రిని కలుసుకుని ఉంటే మన వివాహం జరిగేది. అలాగాక, నా బలహీనత ఏమిటో తెలుసుకుని, ఆ బలహీనతపై దెబ్బ కొట్టి నన్ను చేజిక్కించుకోవాలనుకున్నారు. ఇప్పుడు మీ సేవకుడే మిమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అతడు నా ప్రియుడు. మా తండ్రి మా వివాహానికి ఒప్పుకోపోవచ్చు. బలవంతంగా మా తండ్రి మీకు అంటగట్టే పక్షంలో, నేను మీ భార్యను అవుతానేమో తెలియదు. మా తండ్రిని కలుసుకుని ప్రయోజనం ఉంటుందేమో చూడండి,” అంది చైత్రసేన.
ఆమె సలహాపై యువరాజు నరేంద్రుడు మహారాజుని కలిశాడు. జరిగినది అంతా ఆయనకి వివరించి చెప్పాడు. మహారాజు వెంటనే విజయ్ని పిలిపించి, అతడు ఆ యువరాజు సేవకుడని రూఢీ చేసుకున్నాడు. ఆరు నెలలు పాటు తమకు అతిథిగా ఉండే పక్షంలో, తన నిర్ణయం తెలుపుతానని రాజు యువరాజు నరేంద్రుడిని అభ్యర్థించాడు.
తాను ప్రేమించిన యువతి ఉన్న చోట ఆరు నెలలు ఉండటానికి, ఆ యువరాజు ఎంతగానో సంతోషించాడు. ఆరు నెలలూ ఆ యువరాజుకు సకల వైభోగాలతో మర్యాదలు జరపబడ్డాయి. యువరాజు ఇంకేమీ ఆలోచించలేదు. ఆరు నెలలూ గడిపాడు.
ఓ రోజున రాజు యువరాజు నరేంద్రుడిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. విజయ్ కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు.
అతణ్ణి చూచి ఆశ్చర్యపడి, "ఇంకా వీణ్ణి చంపలేదూ?" అని అడిగాడు యువరాజు.
“లేదు. చంపితే, కేవలం మా అమ్మాయిని ప్రేమించాడన్న నెపంతో చంపినట్టపుతుంది. కనుక ఆ చంపే అవకాశం మీకే ఇస్తున్నాం," అంటూ ఇద్దరికీ చెరొక ఖడ్గం అందించి, "మీలో ఎవరు గెలిస్తే వారు రెండో వారిని చంపేయవచ్చు,” అన్నాడు రాజు.
యువరాజు నవ్వుకున్నాడు. విజయ్ని రాజు పరోక్షంగా ఏ రకంగా చంపదలచింది అతడికి అర్థమయింది. ఇద్దరి ఖడ్గాలు కలిశాయి. ఇదివరకు ఖడ్గం పట్టటమే చేతగాని విజయ్ని మొదటి వేటుకే యువరాజు నరికేయగలననుకున్నాడు. కాని అలా జరగలేదు. విజయ్ ఖడ్గ యుద్ధంలో నైపుణ్యం సంపాదించినట్టు కనిపించాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ ఆరు నెలలూ విజయ్ చలాకీగా నేర్చుకునేందుకు ఖడ్గం పట్టి ఉండటము, దమ్ము పట్టటంలో, ఖడ్గాన్ని తిప్పటంలో యువరాజుకన్నా పైచేయి అయింది. ఆరు నెలలుగా ఖడ్గం పట్టక, సుఖ భోగాల్లో ఉన్న యువరాజు నరేంద్రుడు చివరకు చిత్తుగా విజయ్ చేతిలో ఓడిపోయాడు.
విజయ్ అతణ్ణి దయతలచి వదిలివేశాడు. యువరాజు అవమాన భారంతో వెళ్ళిపోయాడు. రాకుమారికి, విజయ్కి వివాహం జరిగింది.
ప్రశ్న మరియు సమాధానం:
కథ చెప్పిన కరాళుడు ప్రశ్నించడం, సావిత్వుకుడు జవాబివ్వడం:
కరాళుడు ఇంత వరకే వివరంగా ఈ కథ చెప్పి, "రాజు విజయ్ని ఎందుకు క్షమించినట్టు? ఆరు నెలలూ కొత్తగా అతడికి ఖడ్గ యుద్ధం ఎందుకు నేర్పించినట్టు? రాకుమారి ఆ యువరాజును తండ్రి దగ్గరకు పంపటంలో గల అర్థం ఏమిటి? ఓ సావిత్వుక మహారాజా! వీటన్నిటికి నీవు సమాధానాలు చెప్పగలిగినప్పుడే నీ మనుగడ. లేదా...." అని ఏదో అనబోయేంతలో, సావిత్వుకుడు అందుకుని ఈ రకంగా జవాబు చెప్పాడు.
“స్త్రీ ఒక్కసారే మనస్సు అర్పించగలదు. తాను మెచ్చినవాడు పరులకు సేవకుడు కావచ్చు, వంచకుడు కావచ్చు, కానీ తనకి ప్రియుడు. ఆ రకంగా రాకుమారి చైత్రసేన విజయ్నే తన భర్తగా నిశ్చయించుకుంది. తన గూఢచారుల వల్ల విజయ్, తన కూతురూ ప్రేమించుకున్నారని తెలుసుకున్న రాజు, ఏదైనా చేసేవాడైతే, వెంటనే విజయ్ని చంపించేవాడు. ఒక్కగానొక్క కూతురు కోరిక తీర్చటమే రాజు ధ్యేయం కనుక, ముందు మనస్థాప పడ్డా, చివరకు విజయ్ తన అల్లుడు అని నిశ్చయించుకున్నాడు. మానసికంగా రాకుమార్తె, రాజు కూడా విజయ్ తమవాడని అనుకుంటూ ఉండగా, పొరుగు దేశపు యువరాజు నరేంద్రుడు వచ్చాడు. విజయ్ గురించి అసలు వివరాలు తెలిశాయి. ఆ సమయంలో రాజు విజయ్ని చంపి, రాకుమార్తెను యువరాజు నరేంద్రుడికి ఇచ్చి పెళ్ళి చేయవచ్చు. కానీ, మోజు తీరాక, ఏదో నాడతడు, 'నీవు నా సేవకుడిని ప్రేమించిన హీనురాలువి,' అని నిందించవచ్చు. అది కాదని రాజు విజయ్కే తన కూతురిని ఇవ్వ నిశ్చయించుకున్నానని చెప్పి, యువరాజును పంపివేసే పక్షంలో, ఆ యువరాజు, 'నా భటుడిని పెళ్ళాడిన రాకుమారి,' అని దుష్ప్రచారం చేయవచ్చు. అందుకని రాజు ఆరు నెలలు వ్యవధి అడిగి, విజయ్కి ఖడ్గ యుద్ధం నేర్పించాడు. ఆరు నెలలు తర్వాత, యువరాజుతో ఖడ్గ యుద్ధం చేయవలసి ఉంటుందనీ, అతడు చేసిన వంచనకు బదులుగా యువరాజును గెలిస్తేనే మనుగడనీ, లేని పక్షంలో యువరాజు చేతిలో చావవలసి ఉంటుందనీ చెప్పాడు రాజు. భయంతో రాత్రులు పగలు నిద్రపోకుండా పట్టుదలతో విజయ్ ఖడ్గ యుద్ధం నేర్చుకున్నాడు. చివరకు అతడు గెలవటం జరిగింది. అతడు గెలిచే పక్షంలో యువరాజును చంపవద్దని రాజు ముందుగానే విజయ్కి చెప్పాడు. అలా చేయటం వల్ల, ఒక భటుడిగా విజయ్ ప్రారంభమై, పొరుగుదేశపు రాజు అంతరంగిక సలహాదారుడి హోదా వరకు పెరిగాడనీ, అంతేగాక ఖడ్గ యుద్ధంలో ఒకప్పుడు తన యజమానిని మించిన వీరుడన్న పేరు పొందగలిగాడు. అటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చి, ఆ తర్వాత విజయ్ని తన అల్లుడిగా చేసుకున్నాడు రాజు.”
సరియైన సమాధానం రావటంతో సావిత్వుకుడికి ఎదురుగా ఉన్న యువతిపై కరాళుడి ప్రభావం నశించి, ఆ కన్య పెద్ద పులిగా మారి అడవిలోకి భయంతో పరుగు తీసి, ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment