Thursday, 19 February 2026
స్వార్థపరుడు
లింగాపురం గ్రామాన్ని చేరబోతున్న రవికి ఒక విచిత్రం కనిపించింది. ఊరి బయట రకరకాల పంటపొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నెర్రెలు విచ్చుతున్నది. పైర్లు ఎండిపోతున్నాయి. కాని వాటిని ఆనుకుని ఉన్న చెరువు నిండా నీరున్నది!
మరికొంత ముందుకు పోయి, చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు. ఒక పెద్ద తోపులో చింతా, మామిడి మొదలైన చెట్లకు పొదులు తవ్వి, కొందరు మనుషులు నీరు పెట్టుతున్నారు!
"ఈ ఊరివాళ్ళకు మతులు లేవా?" అనుకుంటూ, రవి పొలాలలో ఉన్న మనుషుల దగ్గిరికి పోయి,' ''ఒక పక్క పంట పొలాలు నీరు చాలక ఎండి పోతుంటే. ఇంకోపక్క మహావృక్షాలకు నీరు పెటుతునా) రేం? చెరువులో అంతనీరుండగా పొలాలు ఎండిపోవలసిన ఖర్మ ఏం పట్టింది?'' అని అడిగాడు.
"చెరువులో నీళ్లు మా పొలాల కెలా వస్తాయి, బాబూ? చెరువు జమీందారుది; పొలాలు మావి. ఆ చింతచెట్లూ, మామిడి చెట్లూ కూడా జమీందారువే. వర్షం కురిస్తే గాని మా పొలాలు పండవు. ఏం చెయ్యాలి?'' అన్నారు రైతులు.
చిన్నడికి ఒళ్లు మండిపోయింది.
"మీరు వట్టి వెర్రివాళ్లలా ఉన్నారు, చెరువు జమీందారుదైతే, అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా?'' అని రవి అడిగాడు.
"జమీందారు తాతకేం, బాబూ? మహా దాత! మా పొలాలు తడిసినాకనే తన పొలాలకు నీరు పెట్టుకునేవాడు. ఒక్కొక్కసారి, పాపం, తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడురావుబహదూర్ కొడుకు రాజారాం బహదూర్ తన పొలాలకు చాలగా మిగిలిన నీరు మమ్మల్ని పెట్టుకోనిచ్చే వాడు. ఇప్పుడు ఉన్న జమీందారు ఆయన కొడుకు. ఈయనగారి హయాంలో ఎలా వున్నదీ నువు చూస్తున్నావుగా! చుక్క రానియ్యడు! మా బతుకులు చింతచెట్లకన్నా హీనమయిపోయాయి!'" అన్నారు రైతులు.
ఈ మాటలు వింటూంటే చిన్నడికి కడుపులో దేవినట్టయింది. వాడు రెండు రోజులు ఊళ్ళో ఉండి, జమీందారు గురించి వాకబు చేశాడు. జమీందారు ప్రవర్తనకు ప్రత్యేకమైన కారణం ఏమీ
లేదు. అతనికి ఇంగిత జ్ఞానం తక్కువ, మూర్ఖపు చాదస్తం ఎక్కువ. నయానో భయానో జమీందారు వైఖరి మార్చి ఊరివాళ్ళకు ఉపకారం చెయ్యవచ్చునని చిన్నడు అనుకున్నాడు.
తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటు న్నారేమోనన్న అనుమానంతో, జమీందారు ప్రతిరోజూ చెరువుగట్టున వెళుతూ, ఎండి పోతున్న రైతుల పొలాలనూ, పచ్చగా ఉన్న తన పొలాలనూ తిలకిస్తూ, ఆనందించేవాడు.
ఒకరోజు జమీందారు వచ్చే వేళకు రవి కాషాయవస్త్రాలూ, గడ్డాలూ, మీసాలూ, మెడలో రుద్రాక్షలూ ధరించి, మొలలోతు నీటిలో నిలబడి, చెంబుతో చెరువునీరు ముంచి తీసి పరీక్షించి, తిరిగి ఒలకబోస్తూ కనిపించాడు. అతను చేస్తున్న పని చూసి, జమీందారు ఆశ్చర్య పోయాడు. ఎంతసేపటికీ చిన్నడు నీరు తీసి చూసి, ఒలకబోయటం మానకపోయే సరికి కుతూహలం కలిగి, జమీందారు చిన్నణ్ణి సమీపించి కొంచెం పరిహాసంగా, "ఏయ్ సన్యాసీ! ఏమిటి , నీళ్ళలో దేవులాడుకుంటున్నావు? ఏం పారేసు కున్నావు అందులో?" అని అడిగాడు.
సన్యాసి చిరునవ్వుతో, ' " అవును
బాబూ! చెంబెడు కొత్తనీటికోసం వెతుకు తున్నాను. కాని యీ చెరువులో చాలా భాగం పాత నీరులాగే ఉంది. ఆ లోకం నుంచి నడిచివచ్చిన నా శ్రమ అంతా వృధా అయిపోయింది. ఎందుకంటే, ఆకాశంలో వేళ్లాడుతున్న ఒక పాపిని ఈ చెరువులోని కొత్తనీటితో స్వర్గానికి పంప వలసి ఉన్నది.'' అంటూ వెళ్లిపో బోయాడు.
జమీందారు కుతూహలం కంగారుగా మారింది. అతను చిన్నడిని వెళ్లిపో నియ్యక, ''అయ్యా, ఆకాశంలో పాపి వేళ్లాడటమేమిటి? కొత్త నీ రేమిటి? ఆ పాపికీ, ఈ చెరువుకూ ఏమిటి సంబంధం? మీరు లోకం నుంచి నడిచి రావటమేమిటి? దయ చేసి విపులంగా చెప్పండి," అన్నాడు.
దానికి చిన్నడు ఇలా చెప్పాడు :
"నేను పరలోకవాసిని. స్వర్గంనుంచి వస్తున్నాను. ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూర్ అటు స్వర్గానికీ, ఇటు నరకానికీ కాకుండా, ఆకాశంలో వేళ్లాడుతూ హైరానాపడి పోతున్నాడు. స్వర్గంలో ఉన్న అతని తండ్రి రావు బహదూర్ తన కొడుకు దుస్థితికి విచార పడి, ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబెడు తెచ్చి పాపిమీద చల్లి
నట్టయితే, అతను స్వర్గానికి రావచ్చునని దేవతల అనుమతి పొంది, ఆ పని చెయ్యటానికి నన్ను పంపాడు. కాని ఇప్పటి జమీందారు మహా పాపి లా ఉన్నాడు! చెరువు కింది పొలాలు ఎండి పోతున్నా, గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిలవచేశాడు ఈ పాపి గతి ఏం కానున్నదో మరి?'' జమీందారు మహాపాపిలా ఉన్నాడు.
జమీందారు భయంతో కంపించిపోతూ, ''అయ్యా, ఈ చెరువు నీటిలో అంత మహత్తు ఉన్నదా?" అన్నాడు.
“దీని మహత్తు నీకు తెలియదు. ఇందులోకి వచ్చే నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తుంది.అందుకే చచ్చిపోయిన ఇద్దరు జమీందార్ల పాప పుణ్యాలు దీనిమీద ఆధారపడి వున్నాయి. రావు బహదూర్ హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతుల పొలాల కిచ్చి, మిగిలిన నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు. తన పొలాలు పండక పోయినా, రైతుల పొలాలు పండితే చాలుననుకునేవాడు. బతికినన్నాళ్లూ ధర్మదాతగా పేరు పొంది, చచ్చి ఉత్తముడుగా స్వర్గానికి వచ్చాడు' తరవాత, అతని కొడుకైన రామచంద్ర బహదూర్ స్వార్థపరుడు; తన కడుపు నిండినాక నే ఇతరులను తిననిచ్చే స్వభావం గలవాడు; తన పొలాలకు నీరు సరిపడితేనే ఇతరుల పొలాలకు ఇచ్చే వాడు. ఆ కారణంచేత అతను స్వర్గానికి కాకుండా, నరకానికి కాకుండా మధ్యలో వేళ్లాడుతున్నాడు. రావు బహదూర్ ఉత్త ము డు, రామచంద్ర బహదూర్ మధ్యముడు, ఇప్పుడున్నవాడు అధ ముడు అన్నాడు.
వెంటనే జమీందారు చిన్నడి కాళ్లమీద పడి, "నేనే, బాబూ, ఆ అధముణ్ణి!,నేను స్వర్గానికి వెళ్లే ఉపాయంచెప్పు, "అన్నాడు.
చిన్నడు జమీందారును లేవనెత్తి, "భయపడకు! పాపభీతి ఉంటే చాలు, అన్ని పాపాలూ పోతాయి. నేను చెప్పినట్టు చేశావంటే, నువే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్లగలడు. చూడు, మీ తాత చేసిన పుణ్యం అతన్ని స్వర్గానికి లాగుతుంటే, నువు చేసిన పాపం అతన్ని నరకం కేసీ లాగుతున్నది. ఇప్పుడు. నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తేగాని మీ తండ్రికీ, నీకూ విమోచనంకలగదు. గతాన్ని మరిచిపోయి, కొత్త జీవితం ప్రారంభించు.ఈ చెరువులో నీరు రైతుల పొలాలకు విడుదల చెయి" అన్నాడు.
తరవాత త్వరలోనే జమీందారు ధర్మ దాతగా పేరు తెచ్చుకున్నాడు. ఆతడి చెరువులో ఏటా కొత్తనీరే ఉంటూ వచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment