Tuesday 9 October 2012


స్నేహమనే కొలనిలో
చేపను నేనైతే......
గాలం వేసి గాయం చేస్తావో
గాయం చేసి ప్రాణం తీస్తావో
గాలై వీచి ప్రాణం పోస్తావో!

స్నేహమనే కడలిలో
పడవను నేనైతే.....
సుడివై నడి ముంచుతావో
చుక్కానివై దారి చూపుతావో
తెరచాపవై దరి చేర్చుతావో!

స్నేహమనే తోటలో
పువ్వును నేనైతే....
తుంటరివై త్రుంచెదవో
గొంగలివై మ్రింగెదవో
తుమ్మెదవై మధు గ్రోలెదవో!

స్నేహమనే కొండపై
బండను నేనైతే....
సమ్మెటవై పిండిని చేసెదవో
ఉలివై ప్రతిమను మలిచెదవో
గుడి గుండియలో నిలిపెదవో!

స్నేహమనే వసంతంలో
కోయిల నేనైతే....
బోయవై గొంతు కోసెదవో
మావివై చిగురునిచ్చెదవో
శ్రోతవై గానము మెచ్చెదవో!

No comments:

Post a Comment