శ్రీమతే రామానుజాయ నమః తాళ్లపాక యన్నమాచార్యులు తిరువేంగళనాథ దేవునికి విన్నపము చేసిన శృంగార మంజరి. |
శ్రీకామినీవక్షు జితహిరణ్యాక్షు - భువనపాలనదక్షుఁ బుండరీకాక్షు వివిధగీర్వాణాద్యు వేదాంతవేద్యుఁ - బరమతత్త్వాపాద్యు భవరోగవైద్యు శోభితగుణధాము సురసార్వభౌము - మౌనిమానసహంసు మథితోగ్రకంసు శేషాహివరతల్పు సిద్ధసంకల్పు - నీలోత్పలవ్యూహ నీలాంబువాహ నీలాద్రిసంకాశు నిబిడప్రకాశు - నిర్మలతరదేహు నిగమాంతగేహు గోపాంగనాకుంభకుచశాతకుంభ - కుంభకుంకుమ చారుగురుతరాకారు వేణునాదామోదు విహితప్రసాదు - నవ్యక్తు నతవేద్యునాద్యు నద్వంద్వు నధ్యాత్ము నచ్యుతు నాద్యంతరహితు - నిర్గుణు నిఖిలాండనిర్మాణనిపుణు నిర్వాణు నిర్మలు నిత్యు నిశ్చింతు - సర్వజ్ఞు సాకారు సచ్చిదానందు సర్వతోముఖరూపు సత్యస్వరూపు - నఖిలహిరణ్యగర్భాండనాయకుని వివిధలోకాధీశు వేంకటాద్రీశు - నధిక తేజోమూర్తి నలరెడువాని గంగానదీజన్మకారణం బనఁగ - బొగడొందు తనపదాంభోజముల్ సూపి యింపొంద వైకుంఠ మిదియ సుమ్మనుచు - సొంపొంద వలకేలఁ జూపెడువాని ఘనదైత్యగర్వాంధకారంబు లెల్ల - మానుప దేదీప్యమానమై వెలుఁగు చక్రగదాశంఖశార్గంబు లెపుడు - తలకొని యిరువంకఁ దాల్చినవాని నరకంట సిరితోడ నలిగి భూకాంతఁ - గలసి యిద్దఱలోనఁ గైలాటమిడుచు వలపునఁ గడకంట నలరెడువాని - నెండవెన్నెలతోడ నేకమై కూడి రెండుకన్నుల సంధి రెట్టింపుచున్న - గగనంబు దాఁకినకన్నులవాని ద్రవిళాంగనాఘనస్తనమండలాగ్ర - పరిరంభ జృంభిసంభ్రమవిలాసముల బెరసినకుంకుమపీతాంబరంబు - కడఁగి రింగులువాఱఁ గాసించువాని బ్రహ్మాండమైయుండి బ్రహ్మమైయుండి - పరమాణువైయుండి పరమమైయుండి సచరాత్ముఁడై చరియించువాని - నమరాద్రితో మాద్రియగు వేంకటాద్రి నున్నతోన్నతలీల నుండెడువాని -శృంగారవిఖ్యాతి చెలువంబురీతి నొయ్యారములబాగు నొసపరిలాగు - రాజసంబులసొంపు రసికతపెంపు సరసత్వములచెల్మి చతురతకల్మి - సకలజనానందసంస్తుతిచేత వినివిని యొక బాల వికచాంబుజాక్షి - చెలువ కోకిలవాణి చిగురాకుఁబోణి తలఁపులవిశ్రాంతి తలిరాకు బంతి - వలరాజు చిగురెల్లి వలపులవెల్లి కడివోనిపూముల్కి కన్నులకల్కి - చిత్తంబు చిగురించి స్వేదంబు వెంచి సిగ్గులు వో సురిఁగి చింత లోఁబెరిగి - కాంక్షలఁ గడుఁ బొదలి గర్వంబు వదలి కోరికి మదిఁ బేరి కోపంబు మీఱి - వినుకలి దలపోసి వెరవులఁ బాసి వెట్టల కెదురేఁగి వెతలను గ్రాగి - యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి యీముద్దరాలికి నీవిలాసినికి - నీపూవుఁబోడికి నేలొకో నేఁడు వివరింపఁ దలఁపులు వింత లై తోఁచెఁ - బంచశరాసక్తి ప్రభవింపఁ బోలు నింతలో మరుఁడు దండెత్తకమున్న పచ్చనివిలు చేతఁ బట్టకమున్న చిగురంపగమి చికిలి సేయక మున్న - కోకిల మద మెత్తి గొణఁగకమున్న కీరంబు వాయెత్తి కెలయకమున్న - రాయంచ లెదిరించి రాయకమున్న సుదతి కారామంబు చూపి మరుపిచ్చి - మాటలమాటున మఱపింత మనుచు నారామఁ దోడ్కొని యారామమునకుఁ - జనుచోట నెదిరె వసంతోత్సవంబు పాంథులనునుసిగ్గు బయ లైనరీతి - కారాకు లెడలి వృక్షంబులు నిలిచె తగ విరహులకోర్కి తలిరించె ననఁగ - నవకమై చిగుళులు ననిచె భూజముల వలరాజురాకకు వనమహీజములు - కలయఁ గట్టినమేలుకట్లో యనంగ నిండారఁ దరువులనీడలు నిండెఁ - గోల తమాల తక్కోల కాకోల తాల హింతాలకోత్తాలకుద్దాల - సాలబాలరసాల జాలనేపాల తారజంబీరమందారఖర్జూర - గంధఫలీకుండఘనపిచుమంద తరువులు విరువులై తలిరించి మించెఁ - దీఁగలు సోగలై తెగమాఱి పాఱె వనలక్ష్మి పూర్ణయౌవనవీథియందుఁ - గడఁగిమాధవుఁడు వేడ్కలఁ గ్రొత్తగాఁగ నొత్తిననఖపంక్తు లున్నచందమునఁ - గింశుకంబులు గోరగించి మోదించె గురువింద లిగిరించె గుత్తులు నించె - మాకందతరు లేచె మల్లెలు పూచెఁ బొన్నలు వికసించెఁ బొగడలు నించెఁ - బనసలు నెరిసె సంపంగలు విరిసె మలయజంబు లెలర్చె మరువంబు పేర్చె - నేవంకఁ జూచిన నెల్ల భూజములు శాఖోపశాఖ లసంఖ్య మై నిగుఁడ - బూవుగుత్తులచేతఁ బూపలచేతఁ బరిపక్వరసపూర్ణఫలములచేత - గగనమండల మెల్లఁ గలయ నందంద కప్పిన నిబిడాంధకారంబు దోఁపఁ - దారనివిరు లెల్లఁ దారలు గాఁగఁ గురియుపూఁదేనెల క్రొమ్మంచుమించ - మలయఁబుప్పొళ్లదుమారంబు రేఁగఁ గేలీగృహాంగణాంకితఘననూత్న - వజ్రప్రకాశదివ్యప్రభావలుల వెలుఁగొంది దట్టంపు వెన్నెల గాయఁ - గుముదాకరంబులఁ గూటంబు మాని కుముదాకరంబులఁ గొమరు దీపించి - పద్మరాగప్రభాప్రౌఢిమ వంపఁ బద్మరాగప్రౌఢిమ దోఁప - జ్యోతిర్లతాక్రాంతశోభితశ్రీలు బాలార్కకిరణసౌభాగ్యంబు లొదవ - సకలవనాంత విశ్రాంత పాంథులకుఁ బగలు రేలై తోఁచుఁ బరికింప రేలు - పగళులై తోఁచి విభ్రాంతి పుట్టించు నత్యంతవేగవిహారమారుతము - సొరిది నవ్వనవీథి సొచ్చినంతటను గడఁగి గందపుఁగొండకందువ మఱచి - క్రమ్మఱ నొకవంకఁ గదలిపోలేక ఫణిరాజముఖులకుఁ బసలు పుట్టించు - ఫణిరాజగోత్రసౌభాగ్యంబు మరఁగి కదిసి యాకాశగంగాతరంగముల - నాడెడునవ్యదివ్యాంగనాశ్రేణి కుచకుంభలిప్త కుంకుమములతోడఁ - జల్లుఁ బోరాడు నిచ్చలు నొక్కవేళ మాధవీనవలతామందిరామంద - సౌధవీథీఘనస్థలములు మెట్టి తీఁగెయుయ్యల లూఁగు దిన మొక్కవేళ - శ్రీవేంకటేశు నూర్జితకృపావేశు నినకోటిరుచిమంతు నిందిరాకాంతుఁ - గనుఁగొనఁ గోరి వేడ్కలు దొంగలింప సకలదిగంతర స్థలములనుండి - చక్కని చిక్కని జవరాండ్రు నడవ నడపులయెడల నెన్నడుములు బడలఁ - గస్తూరిపూఁతలు గరఁగి లోజాఱ శిరసులజవ్వాది చెక్కిళ్లఁ గాఱ - నలసతఁ గనుఁగ్రేవ నలరు కామినుల పయ్యద లెడలించి పాలిండ్లుదూరి - కుటిలకుంతలములఁ గునిసియల్లార్చి చిగురాకుఁబోడుల సేదలు దీర్చి - గొబ్బునఁ దావి దిక్కులఁ జోడుముట్ట నుబ్బున విహరించు నొక్కొక్కవేళఁ - తలకొని వనవీథిఁ దలవరివోలెఁ గార్తవీర్యుఁడువోలెఁ గంతుఁడువోలె - నాగరికుఁడువోలె నానావిధముల మలయుచు విహరించు మందానిలుండు - అంత నాకామినుల లందఱుఁ గూడి చల్లనినెత్తావి చల్లెడుచోటఁ - దూఁగుటుయ్యలలఁ కందువల చెందొవల కొలఁకులఁ గెలఁకులఁ గురివిందపొదల - భామలో రతిరాజు పసనిసామ్రాజ్య సీమలో రసికుల చిత్తంబులోని - ప్రేమలో యనఁగ గంభీరంబు మెఱసి కళుకులో చిగురాకు కరవాలుఁగొనల - తళుకులో విటులడెందములఁగాపాడు ములుకులో యనఁగ నిమ్ముల నుల్లసిల్లి - బాలలో పుష్పాస్త్రు బంగారు నాట్య శాలలో పూవింట జడికొన్న యంప - కోలలో తలఁపులో గుదికొన్న తాల్మి చీలలో యనఁగ నచ్చెలు లెల్లఁ గూడి - యవయవశ్రీల నొయ్యారంబుదొరయ ఘనవయోగర్వాంధకారంబు మెఱయఁ - దోరంపుటినరశ్మి దూఱక నిగుడి మత్తిల్లునవలతామంటపవీథిఁ - దఱచుచీకట్లు బిత్తరములు చిమ్మఁ దమముఖచంద్రవిస్తారదీధితులు - వెలుఁగొంద నలుగడ విహరించువారు దట్టంపు లేమావి తరువుల క్రింద - సొంపైన పూఁదేనె సోనలఁ దడిసి పొదరిండ్లచాటునఁ బొదిగొని నిలువ - తమముఖాంబుజములతావులఁ దగిలి పైకొన్న యలికదంబముల సందడికిఁ - దప్పించుకొని తొలఁగ దాఁటెడువారు చెలులతోఁ బడి దప్పి చెదరినసఖులు - రమణీయశుకపికారావంబు వినుచుఁ జెలికత్తెలో యని చీరెడువారు - మదవతీజనులకమ్మఁదనంపుఁబూవు బంతులసరసంబు పైకొనియాడఁ - జెదరినపుప్పొళ్ళచేఁ దొప్పఁదోఁగి సిబ్బెంపుమేనులఁ జెలఁగెడువారు - కొలికిఁదామరకొలంకులదండ (మెండు) నిలిచి తమతమమేనినీడలపొలుఁపు - గనుఁగొని యానాగకన్నెలో యనుచు వేడుకఁ బలుమాఱు వెఱఁగందువారు - నై సఖీరత్నంబు లంతంత నిలిచి లేమా విలాసంబు లేమావి మంచి - లేమావిఁజేచాఁపలేమా యటంచుఁ దిలకంబు దీర్పక తిలకించిచూడు - తిలకంబు మానినీతిలకంబ యనుచు నడుగుకందువ గోరియడుగు నశోక - మడిగెడు బోఁటి నీ యడుగు లాననుచు గర్ణికారంబు లాకర్ణింపఁ బలుకు - గర్ణికారమణీయకాంతిగా ననుచుఁ గురవకావలికిఁ జేకుఱ వకావిరులు - కొమ్మకౌఁగిటఁ జేర్చుకొమ్మకాయనుచుఁ గేసరంబుల బోఁటి కేసరంబులుగ - వారుణిఁదోఁచు దైవాఱగా ననుచుఁ జతురభావంబుల సరసభాషణము - లాడుచు విహరించు నంతలోపలను వనపాలకాంతలు వనవిలాసినులు - పొదిగొన్న చక్కని పుష్పకోమలులు గర్వంపుఁజూపుల కమలలోచనులు - కైసేసి శృంగారగరిమలు వొదల నఖిలలోకేశుమోహనమూర్తిఁ గాంచి - ప్రణయపూర్వకముగాఁ బ్రస్తుతి చేసి యోదేవతారాధ్య యోభక్తసాధ్య - యోలోకమందార యోభవదూర యోవేంకటాద్రీశ యోకృపావేశ - శృంగారవనకేలిఁ జిత్తంబు గలిగి విచ్చేసి వేడ్కల విహరింపవలయుఁ - గోనేటిదరి నున్న కొదమసంపెంగ తరువులు వికసించెఁ దముఁ గానరావు - గుఱిలేనిపువ్వులు గురిసి క్రిక్కిఱిసి పరవనిచోట్లెల్లఁ బాన్పులై చూడఁ - బొగడల విశ్రాంతి పొగడ నచ్చెరువు పొదిగొన్న సేవంతిపొదరిండ్లక్రిందఁ - బలుమాఱుఁ గురిసినపన్నీటిసోన పలవల నునుజాలువాఱి దైవాఱి - యేఱులై యేప్రొద్దు నీఁతలఁ బాఱు గందంపుమ్రాఁకులకడ నున్నఫణులు - చందనగంధులసౌరభంబునకుఁ బైకొని మైగాలిఁ బసివట్టి తిరుగు - మెలఁగు మయూరగామినులౌట యెఱిఁగి తఱచైనఘనసార తరువులక్రిందఁ - బొర లూడి రాలుకర్పూరంపుసిరము తిన్నలై విహరింపఁ దిన్ననై యుండు - నని యని తరితీపు లతివలు వలుక నఖిలలోకారాధ్యుఁ డతికృపామూర్తి - మగువల వయసు లామనికొల్లకాఁడు భామల తలఁపులోపలి గారడీఁడు - వెలలేని వలపుల వేడుకకాఁడు కోనేటిరాయండు కుంభినీస్వామి - శ్రీవత్సధారుఁ డాశ్రితవత్సలుండు వెలఁదులమాటలు వేడ్క దీపింపఁ - జిత్తాబ్జమునఁ జేర్చి చిఱునవ్వు నవ్వి యత్యంతరూపమహామూర్తి గాన - నఖిలశృంగారాబ్ధి కధిపతి గాన సకలవైభవమహోజ్జ్వలతఁ బెంపొంది - గమనోన్ముఖుం డైనగదలు దానెఱిఁగి పాదారవిందసంస్పర్శంబు సేయఁ - గోరిక దలకూడఁ గుండలికర్త (భర్త?) పసిఁడిపాదుకల స్వభావమై నిలువఁ - గైకొని మెట్ట నక్కడిచోటు లెల్లఁ బ్రతిపదంబును మోక్షపదములై నిలువ - నింద్రాది దిక్పతులిరువంకఁ గొలువఁ గమలభవాదులు గదిసి తో నడవఁ - గిన్నర గంధర్వ ఖేచర యక్ష గరుడ విద్యాధర గాన మానములు - వీనుల కిం పొంద విందులు సేయ విరివైన యుద్యానవీథులు సొచ్చి - విశ్రాంత భూముల విహరించుచోట నేవేళ నేకాల మెక్కడఁ దలఁచె - నావేళ నాకాల మక్కడఁ గలిగి సకలపదార్థగోచరములై యుండి - చతురవిద్యాగోష్ఠిఁ జరియించునంత నఖిలాదినాథు మోహన మహామూర్తిఁ - బలుమాఱు మును విన్న భామాలలామ చెలులకు మన సీక చిత్తంబు రాక - పొలుపైనయలవోకఁ బ్రొద్దులు వోక సఖులతోఁ బుష్పాపచయకేలిఁ దగిలి - యున్నంతఁ జెలిభావ మువిదలు చూచి పువ్వులు జడిగొన్న పొదరిండ్లు దూఱి - కాంతల నొండొంటిఁ గడవంగఁ బాఱి తఱచైనవిరు లెల్లఁ దమ వని కోరి - చెదరిన లతలెల్లఁ జేరంగఁ దీసి యందనిక్రొవ్విరు లందంది కోసి - తావి వోవకయుండఁ దలిరులు మూసి రాలినపుప్పొళ్లు రాసులు చేసి - యనిలంబు కెదురు మహాఫణి వ్రాసి తుమ్మెదదాఁటులఁ దొలఁగఁ దూపొడిచి - పై కాపుగాఁగ సంపంగలు ముడిచి చేతులపన్నీరు చెలులపైఁ దుడిచి - పయ్యదఁబూఁదేనె పలుమాఱుఁ బిడిచి యారామవీథుల నతివలు మెలఁగి - యొఱపైన చోటుల నొయ్యనఁ తొలఁగి దట్టంపువిరు లెల్లఁ దమవని చెలఁగి - మరునమ్ములో యని మదిలోనఁ గలఁగి బింబంబు లని యోష్ఠబింబంబులకును - బైకొన్న చిలుకలఁ బట్టంగఁ దలఁచి వల నైనకరపల్లవంబులు చాఁపఁ - బల్లవంబులభ్రాంతిఁ బదరి కోయిలలు చేరినఁ బయ్యెదచెఱఁగులఁ జోఁపఁ - బయ్యదబయ లైన పాలిండ్లు చూచి జక్కవదోయిమచ్చరమున మొరయఁ - గరమూలరుచుల బంగారుతో బెరయ నుబ్బునఁ జనుఁగవ లొండొంటినొరయ - నొసలికస్తూరులునూఁగురుల్ బెరయ వలఁతులై పొలఁతులు వనవిహారములఁ - బొదలిక్రొవ్వులు మించఁబువ్వులుగోసి శంబరారాతిఁ బచ్చనివిలుకానిఁ - బచ్చపుల్గుల తేరిపైన బిత్తరిని బొదిగొన్న కమ్మఁదూపుల పోటువాని - దనరిన చంద్రకాంతపు వేదిమీఁదఁ దలఁపులోపలివానిఁ దగవారఁ పూఁచి - పొలుపొందఁ బువ్వులఁ బూజలు చేసి యొప్పైనపూఁదేనె నుపహారమిచ్చి - మ్రొక్కుచుఁ దాంబూలములు సమర్పించి సరససంగీత ప్రసంగ వాక్యములఁ - బ్రొద్దులు పుచ్చుచుఁ బొలఁతు లున్నంత వైభవంబుల వనవాటికలందు - విహరించుచున్న గోవిందు ముకుందు సత్యభామాకాంతు సకలవిశ్రాంతు - తిరువేంకటాద్రీశు దేవదేవేశు భానుకోటిస్ఫూర్తి భాసిల్లువాని - పంచాస్త్ర కోటి సౌభాగ్యంబువాని గోటానఁ గోటులై కొలఁదులు మీఱి - గుఱు తిడఁగా రానిగుణములవాని రాకకు వెఱఁగంది రాకేందు వదన - రాకవెన్నెలలఁ బరా కైనకాంత చెలులపై నలులపైఁ జిత్తంబు వదలి - కురులపై విరులపైఁ గోర్కులు సడలి పికముపై శుకముపైఁ బ్రేమంబుమఱచి - నతనురాకకునుగూర్చినతనురాకకును దొలఁగక పులకలు తోఁ ద్రోపులాడఁ - దలకొన్నకనుఁగ్రేవ తపములు వీడ నుడివోనినునుసిగ్గు లూడనిఁబాడ - నంతంత మరుబలం బచ్చన లాడ నిరువురచిత్తంబులెదుళులుచూడఁ - బరువులో మురువును భయములోవెరువుఁ జిత్తంబుతిమురును జెక్కులచెమరు - భావంబుకదలును బలుకులోఁ గొదలు మానంబు మఱపును మరుచేతివెఱపు - నలకలజాఱును నలసంబుతీరుఁ గ్రాఁగినమతి నొప్పి కనుఁగ్రేవ డప్పి - చెలికత్తెమూఁపుపైఁ జేర్చినచేయి యల్లార్చి ఱెప్ప వేయనికన్నుదోయి - తనమేయిఁ జెలి దండ దాఁచినబాగు నంతలో మైమఱ పైయున్నలాగు - కనుఁగొని చెలులెల్లఁ గడు వెఱఁగంది యలరినవేడ్కల నబ్జాక్షిఁ జూచెఁ - జూచినయంతన సూనాస్త్రగురుఁడు జూపులు తూఁపులై సోఁకె నొండొరులఁ - దనరాజ్యలక్షణోత్తర మైన తన్విఁ గప్పంబుగా నిచ్చెఁ గందర్పుఁ డనఁగ - గంభీరనాయకుఁ గాంచెనో యనఁగఁ దీపులవిలునారితిండి మోపెట్టి - పూవుఁదూపులయంపపొది వెంటఁగట్టి చిన్నారివిరిదమ్మిచిలుకుఁ జేఁబట్టి - యల్లన పొడచూపె నారతిరాజు ఈయింతితో విభుఁ డింపొందు ననుచుఁ - నేపునఁ గీరంబు లేచి పై రొప్పె నీకొమ్మ మదికోర్కులీడేఱు ననుచుఁ - జాలిచేరువఁదీర్చె జక్కవదోయి తరలాక్షి మదిలోన దరికొన్న విరహ - మాఱెడువీపుగా పనెడుచందమున నుబ్బునఁ బైవీఁచె నొయ్యనిగాలి - కమలామనోనాథు కరుణాకటాక్ష వీక్షణం బతివపై వెల్లిగొన్నట్లు - పరిపూర్ణచంద్రికాప్రభలు పైఁ బర్వఁ గడిమి నుద్దీపనకారణం బగుచు - లావుగా మరునిబలం బెల్ల నొదరఁ గడు నింపులై యుండఁ గారింపు లౌను - నెలమిఁ గారింపులేయింపులై యుండుఁ బ్రియములైనవియె యప్రియములైయుండు - నప్రియంబులె ప్రియంబై యుండుఁ జూడ నాలోనఁ జెలులెల్ల నాలోలనేత్రఁ - బరికించి విరహతాపస్ఫూర్తి దెలిసి యీరామపోరాము లేమిట మాను - నీకాంతవలవంత లేవంకఁ దీరుఁ జూడదు తలయెత్తి శ్రుతి దండెఁ గూర్చి - పాడదు చెలులెల్లఁ బైకొన్న సరస మాడదు చిలుకతో నందంపుమాట - లాడదు వెడమాఁట లాడెడిఁగాని కొంచదు ప్రాణంబు గుఱుతుగాఁజేసి - యెంచదు వీణె వాయించదు పరిణ మించదు మది సంభ్రమించదు చెలియ - కించుకేనియును సయించదు కాని కప్పదు చనుదోయి కనుఁ గ్రేవఱెప్ప - విప్పదు తనప్రాణవిభుమీఁదిమనసు త్రిప్పదు మదిలోన దీకొన్నప్రేమ - చెప్ప దెవ్వరితోడఁ జెప్పునోకాని పెట్టదు కస్తూరి పేర్కొని చేతఁ - బట్టదు సేవంతిబంతి నెత్తమ్మి ముట్టదు సిగ్గుల మొద లించుకైనఁ - బుట్టదు తలఁ పెందుఁ బుట్టునోకాని తాపంబు మేనఁ బ్రతాపింపఁ దొడఁగె - నూర్పులు మిగుల నిట్టూర్పులై నిగుడెఁ బగలెమృగాక్షికి వ(ఁబ?)గలుగాఁ జొచ్చె - రాత్రులింతికి శివరాత్రులై తోఁచె శిశిరోపచారవిశేషభావనలు - సేయంగవలె నని చెలులెల్లఁ గూడి పైకొని యేప్రొద్దుఁ బన్నీరువారిఁ - బూచిన గొజ్జంగపొదరింటిలోను బద్మాక్షిఁ జల్లనిపాన్పుననునిచి - యొడఁగూర్పఁదొడఁగిన నుపచారవిధులు పలుమాఱు విపరీతభావంబులైన - ముగ్ధలు తమలోన మోములు చూచి యంతంత నొకరొక రచనలు చేసి - యీవేళఁ దడ వేల హేలావిశాల శశికాంతమణికాంత సౌధాంతరములఁ - జలువలనెలవులఁ జంద్రాస్య నునిచి గుప్పుఁడు పుప్పొళ్లు కుచములమీఁదఁ - గప్పుఁడు చెంగావి కప్రంపుబడిమి త్రిప్పుఁడు చెలులెల్లఁ దిరిగిరానుండఁ - జెప్పుఁడు మనవులఁ జెప్పెడి దేమి చిలుకుఁడు పూఁదేనె చెలిమేన నిండ - నలుకుఁడు శ్రీగంధ మప్పటప్పటికిఁ గులుకుఁడు పన్నీరు కోమలితోడఁ - బలుకుఁడు పలుమాఱుఁ బలుకరింపుచును బాయుఁడు నునుగాలి పైకొననిండు - ద్రోయుఁడు సొబగైనతొలువిరులెల్ల వేయుఁడు కమ్మఁగ్రొవ్విరులు పైపైని - సేయుఁ డింతటిలోన శీతలక్రియలు అనుచు శైత్యోపచారాదులు సేయ - నల్లనల్లన తాప మగ్గలం బైన ధవళాక్షి యున్న చందము చూచి చెలులు - కంటికిఁ గలకంఠకంఠిభావంబు జ్ఞానమొక్కటియు నజ్ఞానంబు నూఱు - మాటాడు టొక్కటి మౌనంబువేయి తాలిమి లేశంబు తమకంబు లక్ష - కోరికమదిలోనఁ గోటానఁగోటి మణుఁగులైయున్నవి మగువకు నేఁడు - తనప్రాణవిభునిఁ గందర్పుని గురునిఁ దేకయుండిన నింతిఁ దేర్పంగరాదు - పోక మీరిపు డలవోక సేసినను రాకనేఁడతఁడు నిరాకరించినను - అదయుండుమరుఁడు తీవ్రాస్త్రకోవిదుఁడు ఒడ లెఱుంగకయుండు నొక్కొక్కవేళ - నెంతకు నలుగునో యీయింతిమీఁద నని యందులోఁ బ్రోడయగుమేటిబోటి - యుడివోనిభయమేలయోచెలులార కరుణాకటాక్షు లోకైకసంరక్షు - శరణాగతత్రాణు సకలపారీణు విశ్వలోకేశు శ్రీవేంకటాధీశుఁ - గనుఁగొని యీబాల గాసిల్లియున్న చందంబు విభుఁడు మెచ్చఁగ విన్నవించి - విచ్చేయునట్లు గావించి తేకున్న నెచ్చెలులార నానేర్పు లేమిటికి - నని చెలిఁ జెలులతో నప్పనచేసి కదలి మోహనమూర్తి కడకేగి యంత - సకలసురాసురసంఘంబులెల్ల నంతరాంతరముల నంతంత నుండి - యేకాంతసుఖగోష్ఠి నింపొందువాని గనుఁగొని పూగుత్తి కానుక యిచ్చి - మ్రొక్కి హస్తాంబుజంబులు మోడ్చిపలికె దేవ జగన్నాథ దేవతారాధ్య - యఖిలాండధౌరేయ యార్తవిధేయ యారామసీమావిహారాంతరముల - మారామ నీరూపు మహనీయమూర్తి గన్నులపండువుగాఁ గనుఁగొన్న - యంతనుండియును బుష్పాయుధుఁ డేయు తలిరంపగమి నొంప ధరియింపలేదు - ఎటువంటి మోహంబొ యెట్టితాపంబొ యేలాగుతమకంబొ యేమిభావంబొ - యేచందములచూపొ యేతరితీపొ తొలిచూపు నీరూపు తొలఁగుటలేదు - కన్నీరు మున్నీరు కడగానరాదు చెలియున్నవిధమును జెప్పకపోదు- తరళాక్షి దురవస్థ తలఁపగాఁ గాదు ఇంతట విచ్చేసి యింతి మన్నించి - కంతుసామ్రాజ్యసౌఖ్యముల నొందింపు మని విన్నవించిన యబ్జాక్షిఁ జూచి - తలఁపులు తలఁపులు తార్కొని యుండఁ జిత్తంబు చిగురొత్తఁ జిఱునవ్వు నవ్వి - భామకు మౌక్తికాభరణంబు లిచ్చి మది నుబ్బి పన్నీట మజ్జనం బాడి - రసికతఁ బీతాంబరము దిండు దీర్చి మృగమదపంకంబు మెయి నిండఁ బూసి - పారిజాతాదిపుష్పము లెల్ల ముడిచి సౌపర్ణవాహనోజ్జ్వలతఁ బెంపొంది - విద్యాధరాహ్లాదవీణానినాద గానామృతాంభోధికల్లోలములను - నుబ్బుచు నంతంత నోలలాడుచును జంద్రాస్య యున్నపూఁజవికె కేతెంచి - యల్లన దర్వీకరాంతకు డిగ్గి కొలిచి వచ్చినదేవకోటుల ననిచి - కామినిభావంబుఁ గనుఁగొనునంతఁ గుసుమాస్త్ర తాపసంకులత వహించి - యలరుఁ బానుపుమీఁద నందందపొరలఁ జెలిమేన నంటినచెంగల్వఱేకు - లెలమిఁ గాంతునిరాక కెదుళులు చూచు గతి నొప్ప నిలువెల్లఁ గన్నులై యమరఁ - గ్రాఁగినగందంబు క్రమ్మఁ బన్నీటఁ దోఁగినచెంగావి తొడరి శైత్యమునఁ - గ్రాఁగినహృదయంబు రతిరాజుచేత మ్రాఁగినమతియుఁ బ్రమాదంబువలన - నీఁగినవగలును నేత్రాంబుధార లాఁగినఱెప్పలు నైయున్నయింతిఁ - గనుఁగొని కరుణావికాసచంద్రికలు నీలోత్పలాక్షిపైఁ నిండంగఁ జల్లి - భామిని యున్నపూఁబానుపు చేరి చిట్టంటుచేఁతల సేదలు దీర్చి - చెదరినయలకలచిక్కెల్లఁ దీర్చి యెడలేనిపులకలయింపు పుట్టించి - కళలమర్మంబులకడ గానుపించి యాలింగనాదిసౌఖ్యముల నొందించి - కరఁగించి మరగించి కలికిఁ గావించి యుడివోనిసురతాబ్ధి నోల లాడించి - చిత్తజసామ్రాజ్యసింహాసనమున బాలికారత్నంబుఁ బట్టంబు గట్టి - యరవిరిసిగ్గులు నాత్మనిగ్గులును మితిలేనితావులు మెఱుఁగుమోవులును - గనుఁగ్రేవకెంపులుఁ గలికిసొంపులును ముద్దులేఁ జెమరును మోములకొమరుఁ - గలిగినశృంగారగరిమలతోడ వందిమాగధుల కైవారంబుతోడ - సిద్ధవిద్యాధరశ్రేణులతోడఁ దనతోడఁ గూడినతన్వంగితోడ - వృషభాద్రినాథుఁ డుర్వీసతిప్రియుఁడు వేడ్కతో నగరప్రవేశంబు చేసె - నని భక్తిఁ దిరువేంకటాద్రీశుపేరఁ గారుణ్యలక్ష్మీప్రకాశునిపేర - రాజితాఖిలలోకరక్షణుపేర లాలితబహుపుణ్యలక్షణుపేర - పృథులదానవసైన్యభీషణుపేర భూరికౌస్తుభరత్నభూషణుపేర - గురుభరద్వాజైక గోత్రపావనుఁడు నందాపురీవంశనాయకోత్తముఁడు - అనఘుఁడు తాళ్లపాకాన్నయార్యుండు మధురంపుశృంగారమంజరి చెప్పె - ధరమీఁద నాచంద్రతారకం బగుచుఁ గడిమిఁ బెంపొందు మంగళమహాశ్రీల శ్రీకృష్ణార్పణమస్తు - మంగళమహా శ్రీ శ్రీఁ జేయు\న్ |
No comments:
Post a Comment