Tuesday, 2 December 2025

#శాప విముక్తి# ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కూతు ళ్ళుండేవాళ్ళు. వాళ్ళకు పెళ్ళియాడు వచ్చి నప్పటికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి, డబ్బు కూడబెట్టుతున్నాడు. సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగు తుంది. అక్కడ తన గిత్తను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుళ్ళను పిలిచి, " సంత నుంచి మీ కేమేం తీసుకురమ్మ న్నారు?" అన్నాడు. పెద్దకూతురు, " నాకు వెన్నెలరంగు చీరె పట్టుకురా, నాన్నా,” అన్నది. రెండోకూతురు, " నాకు ఎండరంగు చీరె పట్టుకురా, నాన్నా,” అన్నది. మూడో కూతురు తన కేమీ అక్కర్లే దన్నది. "అదేమిటి, తల్లీ? నీ అక్కలిద్దరికీ చీరెలు కొనితెస్తూ నీ కేమీ తీసుకురాకుండా ఉండటానికి నా ప్రాణం ఒప్పుతుందా ?' అన్నాడు రైతు. " సరే, నా పేరు మల్లిక కనక నాకో మల్లెపూవు పట్టుకురా, అంతకన్న ఏమీ ఆక్కర్లేదు," అన్నది మూడోకూతురు. అది ఇంకా మల్లెపూల తరుణం కాదు. ఆ సంగతి మల్లికకు గుర్తు రాలేదు; సంతకు వెళ్ళే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధ పడ్డాడు. "బస్తీలో ఏ సంపన్నుల ఇంట నైనా అకాలంగా పూసే మల్లెమొక్క లున్నా యేమో విచారించి, అమ్మాయికి మల్లెలు పట్టుకుపోవాలి," అనుకున్నా డాయన. సంతలో గిత్త అమ్ముడయింది. రైతు తన పెద్దకూతుళ్ళకు చీరెలు కొన్నాడు. మల్లెల కోసం ఊరంతా చెడతిరిగి, ఎక్కడా ఒక చిన్న మల్లెమొగ్గ నయినా సంపాదించ లేక, నిస్పృహ చెంది, సూర్యాస్తమయం వేళకు ఇంటిదారి పట్టాడు రైతు. అదేసమయానికి ఆకాశం నిండా కారుమేఘాలు కమ్మి, పెద్దపెట్టున వీచే గాలితోబాటు వర్షం ఆరంభమయింది. దాంతో అంధకారం ముంచుకొచ్చింది. రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలే ననుకుని, రైతు అడ్డదారి పట్టి బీళ్ళ మీదుగా నడక సాగించాడు. వాన మూలంగానూ, కన్నుపొడుచుకున్నా కనిపించని చీకటి మూలంగానూ రైతు దారి తప్పాడు. ఎంత దూరం పోయినా గ్రామం రాదు. రైతు తడిసి ముద్ద అయిపోయాడు. ఈదురుగాలి కత్తి లాగా కోసేస్తున్నది. ఎవరినన్నా అడు గుదామన్నా నర సంచారం లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది. బతుకుజీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి, ఒక పెద్ద రాజభవనానికి వ చ్చాడు. ఆ ప్రాంతాల అటువంటి రాజభవనం ఉన్నట్టు కూడా రైతు ఎరగడు. లోపలికి పోతే ఏ ద్వార పాలకులో అడ్డుపెడతారని ఆయన అను కున్నాడు. కాని ద్వారం వద్ద ఎవరూ లేరు. రైతు లోపలి ఆవరణ దాటి భవంతిని సమీపించాడు. అక్కడా ఎవరూ లేరు. "లోపల ఎవరండీ?" అని గట్టిగా కేక పెట్టినా జవాబు లేదు. భవంతిలో తలుపు లన్నీ భార్లా తెరిచి ఉన్నాయి. లోపల ఏ గది లోనూ ఏ ఒక్కరూ లేరు. కాని ఇల్లంతా శుభ్రంగా, ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగే ఉంది. గదులన్నీ తిరుగుతూండగా ఒక పక్క నుంచి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది. అటుగా వెళ్ళి చూస్తే, పెద్ద వంటగది, అందులో తయారై తినటానికి సిద్ధంగా ఉన్న వంటకాలూ కనిపించాయి. రైతుకు ఆకలి దహించుకు పోతున్నది. అందుచేత ఆయన మొహమాట పడక వంటకా లన్నీ వడ్డించుకుని, కడుపునిండా తినేశాడు.వంటఇంటి పొయ్యిలలో ఇంకా చాలా వేడి ఉన్నది. తన తడిబట్టలన్నీ పిండి, ఆ పొయ్యిల దగ్గిర ఆరవేసి, రైతు పడక గదికి వెళ్ళి, ఒక హంసతూలికాతల్పం పైన పడుకుని హాయిగా నిద్రపోయాడు. ఆయన తెల్లవారుతూనే లేచి, ఆరిన తన బట్టలు కట్టుకుని, శలవు పుచ్చుకోవటాని కెవరైనా కనిపిస్తారా అని మరొకసారి భవనమంతా చూశాడు. ఎవరూ కనిపించకపోయే సరికి ఆయన వెళ్ళిపోవటానికి బయలుచేరాడు. ఆయన భవంతిలో నుంచి బయటికి అడుగు పెడుతుండగానే ఆవరణలో ఒక పక్కగా మల్లెపాద ఒకటి కనిపించింది. దాని నిండా మల్లెమొగ్గ లున్నాయి! రైతుకు పరమానంద మయింది. ఆయన గబగబా పెద్ద పెద్ద మొగ్గలను కోయసాగాడు. అంతలోనే జరజరా ఏదో పాకిన శబ్ద మయింది. ఒక రాక్షసిబల్లి లాటిది పాద వెనుక నుంచి పాకి వచ్చి, రైతు కేసి ఎర్రటి కళ్ళతో క్రూరంగా చూస్తూ, మనిషిభాషలో, "దుర్మార్గుడా, నా యింటికి వచ్చి, నా తిండి తిని, నా మంచం మీద పడుకుని నిద్ర పోయినది చాలక, పోతూ పోతూ నా మల్లె పూలను నా అనుమతి లేకుండా కోస్తావా ? నీ ఆయువు తీరింది!” అన్నది. రైతు భయంతో వణికిపోతూ, రెండడు గులు వెనక్కు వేసి, " నాది పొరపాటే. క్షమించండి. కోసినపూలకు డబ్బిచ్చు కుంటాను. నా దగ్గిర ఉన్నదంతా పుచ్చు కోండి కావలిస్తే!" అన్నాడు. " అధికప్రసంగం ! నీ కెవరైనా కూతు ళ్ళున్నారా?" అని అడిగింది రాక్షసిబల్లి. ** ముగ్గు రున్నారండి. మా మూడోదాని కోసమే కోశానీ మల్లెపూలు," అన్నాడు రైతు తడబడుతూ. "అయితే చూడు, నీకు వారంరోజులు గడువిస్తున్నాను. పై వారం ఇదే రోజుకు నీ కూతుళ్ళలో ఒకతెను తెచ్చి నాకు అప్పఛీటృఆ గించు, లేదా నీ ప్రాణమైనా అర్పించు. తెలిసిందా?" అన్నది బల్లి. రైతు తెలిసిం దంటూ తలవూపాడు. " కోసిన మల్లెలేవో నువే వుంచుకో. నీ కూతురు వచ్చి మల్లెమొగ్గ ఒకటి తుంచ గానే నేను వస్తాను. బుద్ధిగల చైతే నేను చెప్పినట్టు వింటుంది. లేదా, ఏం జరగాలో అదే జరుగుతుంది,” అన్నది బల్లి మళ్ళీ. మరుక్షణమే అది ఎటో వెళ్ళిపోయి మాయమయింది. రైతు ప్రాధేయపడే అవ కాశం కూడా లేదు. ఈ రాక్షసిబల్లి వాత పడటానికి తన కూతుళ్ళలో ఎవతె ఒప్పు కుంటుంది? ఎవతె అయినా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది? "ఎంత పెద్ద పీడ వచ్చి పడిందిరా, భగవంతుడా!” అనుకుంటూ రైతు, దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు. అక్కచెల్లెళ్ళు ముగ్గురికీ వారు కోరినవి లభించాయి. అయితే మల్లిక కోరిన మల్లె పూలు ఎలాటి ప్రమాదానికి దారితీశాయో రైతు తన కూతుళ్ళకు వివరంగా చెప్పి, "ఆ రాక్షసిబల్లి పాల మీలో ఎవరు పడ తారు?" అని అడిగాడు. "అమ్మయ్యో, ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయి,” అన్నది పెద్దకూతురు. "ఇదంతా మల్లిక చేసిన పనే. కాలం గాని కాలంలో మల్లెపూలు కోరటమేం?” అన్నది రెండోది, " అవును, నా తప్పే. నేనే ఆ బల్లిపాల పడతాను,” అన్నది మల్లిక, దుఃఖాన్ని దిగమింగుకుంటూ. సరిగా ఏడోరోజున రైతు మల్లికను వెంట బెట్టుకుని నిర్జన రాజభవనానికి వచ్చాడు. ద్వారా లన్నీ వెనకటి లాగే బార్లా తెరిచి ఉన్నాయి. ఎక్కడా మనుషులున్న సూచన లేదు. మల్లిక తిన్నగా మల్లెపొద వద్దకు వెళ్ళి, ఒక మల్లెమొగ్గ కోసింది.వెంటనే బల్లి ప్రత్యక్షమయింది. దాని ఎర్రని కళ్ళూ, ముడతలుపడి, నూనె మెరుగు కలిగిన దాని చర్మమూ, అసహ్య కరమైన ఎర్రని నోరూ చూసేసరికి మల్లికకు శరీరమంతా గరిబొడిచింది. ఆమె నిలువునా వణికింది. "నీ పేరేమిటి?" అని బల్లి మృదు వుగా అడిగింది. దాని కంఠంలో గాని, చూపులో గాని క్రూరత్వం ఏమీ లేదు. "మల్లిక,” అని మల్లిక జవాబిచ్చింది. " చూడు, మల్లికా, నీ కిక్కడ ఏ ప్రమా దమూ ఉండదు. వివేకంగా మసలుకున్న పక్షంలో నీకు బోలెడంత నుఖం కూడా లభించవచ్చు. ఈ భవనంలో నీకు ఏ లోటూ లేకుండా జరుగుతుంది. ఇక్కడ నువు యథేచ్ఛగా ఉండవచ్చు. నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా, ఒక మల్లె మొగ్గ తుంచావంటే నేను వస్తాను," అంటూ బల్లి పొదచాటుకు వెళ్ళి మాయ మయింది. నైతూ, మల్లికా మూడు రోజులు ఆ భవ నంలో గడిపారు. ఆ కాలంలో వారి కక్కడ ఎవరూ కనిపించలేదు. కాని మూడు పూటలా వంట అవుతూనే ఉన్నది. వాళ్ళకు ఏ లోటూ లేదు. ఛీటృ "ఇక నువు ఇంటికి వెళ్ళిపో, నాన్నా. అమ్మా, అక్కలూ నీ కోసం దిగులు పడి పోతారేమో,” అన్నది మల్లిక రైతుతో. రైతు కూడా, తా నక్కడ ఇంక ఉండి పోపటం భావ్యం కాదనుకుని, ఇంటికిపోయి, తన వ్యవసాయపు పనులలో నిమగ్నుడయాడు. తండ్రిని బయటి ద్వారందాకా సాగ నంపి, మల్లిక లోపలికి తిరిగి వస్తూ, మల్లె పొద దగ్గిరికి వెళ్ళి, ఒక మొగ్గ కోసింది. వెంటనే రాక్షసిబల్లి పాద వెనక నుంచి వచ్చింది. ఆ బల్లిని చూస్తుంటే మల్లికకు జాలి వేసింది. అదేదో కష్టంలో ఉన్నట్టు ఆమెకుతోచింది. ఆ కష్టం తొలగించటానికి తానేమైనా చేయగలిగితే బాగుండునని ఆమె అనుకున్నది. ఆమె బల్లితో, "నాకూ, మా నాన్నకూ మీరిచ్చిన ఆతిధ్యానికి చాలా కృతజ్ఞురాలిని. ఆయనను పంపించేశాను. నేను శాయ శక్తులా మీకు విధేయురాలినిగా ఉంటాను," అని చెప్పింది. "ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా, మల్లికా? నువు చాలా అంద మైన దానివి, నా వికారాకారం చూస్తే నీకు అసహ్యం పుట్టక పోవటం ఎంత ఆశ్చర్యం! బల్లి. దాని కంట కన్నీరు కారణం చూసి మల్లిక హృదయం ద్రవించింది. "మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు. నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను. ఎం జరిగినా సరే, నేను ఈ ఇల్లు వదలను, మిమ్మల్ని విడిచి పుచ్చను,” అన్నది మల్లిక, "చూడు, మల్లికా ! నీ మీదే నా ఆశ లన్ని పెట్టుకున్నాను. పచ్చే అమావాస్య వెళ్ళిన మర్నాడు బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళటానికి నీకు అనుమతి ఇస్తున్నాను. వెళ్ళి, అక్కడ మూడు రోజులుండి, మూడో రోజే బయలుదేరి వచ్చెయ్యి. ఈ మూడు రోజులూ నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను. మూడో రోజుకు రాకపోయావో నేను మంటలోపడిన మిడతలాగా అయి పోతాను. నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్ళనిస్తున్నాను. నన్ను మోసగించకు,” అన్నది బల్లి. అమావాస్య వెళ్ళింది. పాడ్యమినాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆమె తల్లి దండ్రులూ, అక్కలూ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. మల్లిక ప్రాణాలతోకలలో కూడా అనుకోలేదు. వాళ్ళు మల్లి కను బల్లి గురించి ర క ర కాల ప్రశ్నలు వేశారు. ఆ బల్లి క్రూరమైనది కాదనీ, దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కు పోతుందనీ, దాని వెనక ఉన్న రహస్య మేమిటో తనకు తెలియలేదనీ మల్లిక వాళ్ళకు చెప్పింది. మల్లిక చెప్పిన మాటలతో వాళ్ళకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది. మూడు రోజులూ మూడు నిమిషాలలాగే గడిచి పోయాయి. మూడో రోజు సాయంకాలం మల్లిక బయలుదేరుతానంటే, అందరూ చేరి ఆమెను నిర్బంధించి మూడో రాత్రి కూడా ఉంచేశారు. నాలుగో రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేధలేక పోయింది. భోజనం చెయ్య కుండా వాళ్ళామెను వెళ్ళనివ్వలేదు. మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనాన్ని చేరుకునేసరికి సాయంకాలం కానే అయింది. ఆమె ఆవరణలోకి అడుగు పెడుతూనే మల్లెపాద వాడుముఖంపట్టి ఉండటం గమనించి, ఆత్రంగా దాన్ని సమీపించింది. పొద మీద ఒకే ఒక మల్లె మొగ్గ మిగిలి ఉన్నది. మల్లిక దాన్ని కోసింది, కాని బల్లి అక్కడికి రాలేదు. ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది. ఒక పక్క నుంచి మూలుగులాటిది విన పడింది. మల్లిక అటు కేసి పరిగెత్తి వెళ్ళి, కొనప్రాణంతో ఉన్న బల్లిని చూసి, "ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి,” అన్నది కళ్ళనీళ్ళతో. "నీ మూలంగా చచ్చి పోతున్నాను, మల్లికా. నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టు కున్నాను. నిన్ను చూడక బతకలేను!" అన్నది బల్లి హీనస్వరంతో. " నేను వచ్చాను గద ! చావవద్దు! ఇక మీ కెలాంటి కష్టమూరాదు,” అంటూమల్లిక అప్రయత్నంగా ఆ బల్లిని తన చేతులలోక తీసుకోబోయింది. ఆమె చేతులు తగలగానే బల్లి మాయమై పోయి ఒక యువకుడు నిలబడ్డాడు. అతనిలో రాజకుమారుడికి ఉండదగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ మార్పు చూశాక మల్లి నోట మాట రాలేదు. " మల్లికా, తగిన కారణం ఉండే నేనీ భయంకర శాపానికి గురి అయాను. నేను అస్తమానమూ సుఖాలలోనూ, యుద్ధాల లోనూ ముణిగితేలాను. దయాదాక్షిణ్యా లనేవి ఎలా ఉంటాయో ఎరగను. దాన ధర్మాలు చేసినవాణ్ణి కాను. చింకిపాతలు ధరించిన బిచ్చగాళ్ళంటే నాకు తగని మంట. ఒక రోజు ఒక బిచ్చగాణ్ణి తిట్టాను. వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది. నేను శాపగ్రస్తుణ్ణి అయాను. దాని ఫలితంగా నా రాజభవనం దారేపోయే వారందరికీ వసతిగృహ మయింది. నేను మాత్రం నేలబొరియలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ప్రేమ చిహ్నంగా భవంతి ముందొక మల్లెపాద వెలిసింది. ఆ పొద మీది తొలిమొగ్గ ఏ ఆడ దానికి చేరుతుందో ఆ స్త్రీ నన్ను చూసి ఆసహ్యపడకుండా, స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు శాపవిమోచనం కావలిసి ఉన్నది. అలా జరగని పక్షంలో నే నీ బల్లి రూపంతోనే చావవలిసి వచ్చేది, నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతోపాటే చనిపోయి ఉండేది,” అని రాజ కుమారుడు మల్లికకు తెలిపాడు. వారిద్దరూ కలిసి మల్లెపాదను సమీపించే సరికి, అది తిరిగి నవనవ లాడుతున్నది. దాని నిండా మొగ్గలున్నాయి. త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది. రాజ కుమారుడికి, మల్లికకూ వివాహం జరిగింది. దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులూ, అక్కలూ రాజభవనంలోనే ఉండిపోయారు.

No comments:

Post a Comment