Monday 12 April 2021

ఉ.శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు
ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!1
ఉ.రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!2
చ.అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!3
ఉ.రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స
త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా
తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!4
ఉ.శ్రీద సనందనాది మునిసేవితపాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూతపరిపాలవినోద విషాదవల్లికా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!5
ఉ.ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుఁడనై రఘునాథభట్టరా
చార్యుల కంజలెత్తి కవిసత్తములన్‌ వినుతించి కార్యసౌ
కర్యమెలర్పనొక్క శతకంబొనఁగూర్చి రచింతునేఁడు తా
త్పర్యమునన్‌ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ!6
చ.మసకొని రేఁగుబండ్లకును మౌక్తికముల్‌ వెలబోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా
రసములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!7
ఉ.శ్రీరమణీయహార యతసీకుసుమాభశరీర భక్తమం
దార వికారదూర పరతత్త్వవిహార త్రిలోకచేతనో
ద్ధార దురంతపాతకవితానవిదూర ఖరాదిదైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!8
చ.దురితలతాలవిత్ర ఖరదూషణకాననవీతిహోత్ర భూ
భరణకళావిచిత్ర భవబంధవిమోచనసూత్ర చారువి
స్ఫురదరవిందనేత్ర ఘనపుణ్యచరిత్ర వినీలభూరికం
ధరసమగాత్ర భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
9చ.కనకవిశాలచేల భవకాననశాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుతసద్గుణకాండ కాండసం
జనిత పరాక్రమ క్రమవిశారద శారద కందకుంద చం
దనఘనసార సారయశ దాశరథీ! కరుణాపయోనిధీ!10

No comments:

Post a Comment