Friday 6 April 2018

శ్రీకాకుళం బాస...అందమైన యాస..
// బెమ్మరాచ్చసి//
ఒకరోజు తోటలొ పరింపళ్ళు ఏరుతున్న పెద్దమ్మ కూతుర్ని ఎలుగుబంటి ఎత్తుకుపొయింది.ఆ సంగతి ఆఊరి బారికోడు పెద్దమ్మతో సెప్పినాడు.పెద్దమ్మ తన పెద్దకొడుకులతో ఇలగిలగ అయ్యిందని...ఎల్లి మీసెల్లుల్ని ఇడిపించుకురమ్మని సెబితే "అమ్మో!!! మేమెల్లము.మమ్మల్ని సంపీదూ ఎలుగుబంటి" అని సెప్పి తప్పించుకున్నారు. సిన్నోడుతో సెబితే సరే అని సెప్పి పెడకన దోపిన బళ్ళెంతీసి దారుతీసి పట్టుకు బయలుదేరాడు.అలా ఎళుతుండగ సాకలిరేవు దగ్గర గాడిదలు మేస్తన్నాయి. మడియారి సూరయ్యనడిగి ఒక గాడిదను బాడుగకు తీసుకున్నాడు. దారిలో ఒక కుమ్మరోడు కుండలు కావిడిలొ ఏసుకొని ఎదురైనాడు. ఆడిని నీదగ్గర ఏటేటున్నాయి.అడిగినాడు. నాదగ్గర పిచ్చికలు,పమ్మిదలు,సిచ్చుబుడ్డీలు,పిడతలు,కుడతలు,గుగ్గిలం కుడతలు,సట్టిలు,మట్టులు,మూకుడ్లు,కలాయిలు,పెనాలు,దాకలు,అటికిలు,అంబలటికలు,కూటికుండలు,కుండలు,కడవలు,కూజాలు,గూనలు,బానలు,జాడీలు, అన్నీ ఉన్నాయి. నీకేటి కావాలో బేగి సెప్పు. నాకేటీ అక్కరనేదు కానీ మీయిల్లు కాలిపాతంది. నీకు తెలుసా... ఓరి నీ తస్సాదియ్య...ఇప్పుడా సెబుతావు... అని ఆ కుండలు అక్కడే వదిలేసి పరిగెత్తాడు. ఒక పెద్ద బాన,కుంపటి ఒకటి ఎంచుకొని గాడిదమీద కట్టేసాడు. గాడిదను తోలుకోని ఎలతన్నాడు. అలా ఎలుతుంటే ఒక మేదరోడు ఎదురైనాడు. మేదలన్నా!.... మేదరన్నా!...నీదగ్గిరేటున్నాయి?... నా దగ్గర జిబ్బిలు,బుట్టలు, గిలకలు,పెట్టిలు,సజ్జలు,మట్టులు,తట్టలు,గాడితట్టలు,కోలగూలు,కోలబుట్టలు,ఉల్లిపాయలబుట్టలు,ఉల్లిపాయల సజ్జలు,ఒడాల తడకలు, గత్తం పొడకలు, దాన్నెంపొడకలు,ఇతనాలపొడకలు, తడకలు, పచ్చబద్దల సేటలు, సేటలు, జంగిడ్లు, పట్లుకర్రలు, టిర్రిలు,ఊజులు, మానిలు,గుల్లలు,మూతిబుట్టిలు, ఈతసాపలు, తాటిసాపలు, ఇసనకర్రలు, తుంగసాపలు,కవ్వాలు, మునకాలకర్రలు, దుడ్డుగర్రలు,కత్తవ కర్రలు,కొరడాకర్రలు, ఉన్నాయన్నాడు. సరేగాని నీకీసంగత్తెలుసా? మీ పిక్కిరోడు నూతిలోన పడిపోండట. అంతే అవన్నీ అక్కడే పడేసి పరిగెత్తాడు. అందులో రెండుపెద్ద పచ్చబద్దల సేటలు, ఇసనకర్ర ఎంచుకొని గాడిదమీద కట్టేసాడు..కొంత దూరం ఎళ్లాక ఒక కమ్మరోడు సామాన్లు అమ్ముతూ ఎదురైతే వాడిని ఆపి నీదగ్గర ఏటేటి ఉన్నాయో సెప్పు అంటే...కత్తులు, చాకులు, సురకత్తులు, బళ్ళేలు,కటార్లు, కత్తిపీటలు, బొరిగిలు,కత్తవలు, గునపాలు, నక్కులు, సీలలు, కమ్ములు,కుంచం కట్లు,కుంచాలు, నక్కాకులు,తొడపలు, నాలు,మేకులు, మడతబందులు, గెడలు, అడ్డుగెడలు, పారలు, ఇంకా ఏటి కావాలన్నా ఉన్నాయి. అన్నాడు. సరేగానీ నీకో ఇసయం తెలుసా? మీఇంటిల దొంగలు పడ్డారట... అంతే...అవన్నీ అక్కడ పడేసి ఇంటికి పరిగెట్టాడు.అందులో ఒక పార,గునపాం(గడ్డపార), ఒకనక్కు తీసుకున్నాడు.. అలా కొంతదూరం వెళ్ళాక ఒక తాలు, పడుగులు అమ్మేవాడు కనిపిస్తే..."నీదగ్గర ఏటున్నాయి"? అడిగాడు. వాడి దగ్గర నులకతాలు,నులకుండలు, పురితాలు, పురికొసలు,సేదతాలు, కొబ్బరి తాలు, కన్నిలు, సిగిమోరలు, ఉట్టిలు, ఎత్తిడ్లు, వలలు, ఉయ్యాల తాలు, నొగతాలు,ముకుతాలు, మూతిబుట్టిలు,పడుగులు,పలుపులు...ఉన్నాయన్నాడు. సరేగాని నీకీ బోగట్టా తెలుసా...మీ ముసిల్దాయి జారిపడిపోయిందట.... అనేసరికి అవన్నీ అక్కడ పడేసి పరిగెత్తాడు. అందులో ఒక పెద్ద పడుగు తీసుకొన్నాడు.అవన్నీ గాడిదపై వేసుకొని తిన్నగా ఎలుగుబంటి ఒండకు ఎళ్ళాడు.
అక్క చిన్నోడిని పలకరించింది. "ఎలుగుబంటి చూసిందంటే నిన్ను అమాంతం మింగెస్తది. వెళ్ళి అటక పై దాగో"అన్నది."అయితే ఈటన్నిటినీ అటక పైకి తీసుకెలతాను" అంటే " అలాగె" అన్నది. ఒక కుంపటి లో నిప్పులేసి నక్కును అందులొ పెట్టి విసనకర్రతో విసురుతూ ఎర్రగా కాల్చాడు.ఇంతలో ఎలుగుబంటి వచ్చి అన్నం వడ్డించమన్నది. పెద్దమ్మ కూతురు అన్నం వడ్డిస్తే తింటూ నెయ్యి వెయ్యమంది. అటక పై వున్న నెయ్యిని కుంపటిలో వేసి అందులొ గాడిద ఉచ్చను వేసి కిందికి విసిరేసాడు చిన్నోడు. "మీదను ఎవులున్నారు "అని అంటె పిల్లులు అని సర్దిచెప్పింది అక్క. సరేలే అని ఆ ఉచ్చను అన్నంలోకలుపుకొని తింటూ "ఏమిటో ఈరోజు నెయ్యి చాలారుచిగా ఉందని కంచం నాకేసి మరీ తిన్నాడు. అటక పై మళ్ళీచప్పుడు. మీదికెళ్ళి పిల్లులని తరిమేస్తనుండు అంటే అవే పోతాయిలే అని సర్దిచెప్పింది వీడి అక్క. ఇంతలో మళ్ళీ చప్పుడు. "పిల్లి కాదు ఏదో ఉంది అటక పైన బుడ్డీ(దీపం) ముట్టించు చూస్తాను"అంది ఎలుగుబంటి. చిన్నోడు "నేను బెమ్మరాచ్చసుడ్ని నిన్ను మింగేస్తాను "అన్నాడు. అప్పుడు ఎలుగుబంటి"ఐతే నీ పల్లు(దంతాలు) చూపించు అంటే పార చూపించాడు.నీ గోలు చూపించు అంటే గునపం చూపించాడు.నీ చెవులు చూపించు అంటే చేటలు చూపించాడు. నీ కడుపేది అంటే బానను చూపించడు. నీ తోకేది అంటే పడుగు(పెద్ద లావుపాటి తాడు)ను కిందికి వదిలాడు. ఐతే నా అరుపు చూడని బబ్బబ్బ అని బబ్బర్లు కొట్టింది ఎలుగుబంటి. చిన్నోడు ఎర్రగా కాలిన ఇనపనక్కు(మొన కల్గిన ఇనుప కడ్డీ)ను గాడిద పై మోపాడు అంతే గాడిద గట్టిగా ఓండ్ర పెట్టింది.ఓరినాయనొ ఇంతపెద్ద బెమ్మరాచ్చసా అంటూ ఎలుగుబంటి భయపడిపొయి పరుగు లంకించుకుంది.చిన్నోడు అక్కను తీసుకొని ఇంటికి సుబ్బరంగా పారొచ్చినాడు.పెద్దమ్మ సంతసించింది.
LikeShow More Reactions

No comments:

Post a Comment