Wednesday 10 April 2013


(ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన నా కవిత)
మురళి||నేలతల్లి సోయగాలు||

పొగమంచు మేలి ముసుగు పరదాలో
పుడమితల్లి ముద్దు మోము దాచగా
భానుని ఉదయారుణ తరుణకిరణం
కొనగోటిని ముసుగును తొలగించగ

అరుణరాగ శోభిత తరుణభాను కిరణము
పుడమితల్లి పెదవులపై ముద్దిడువేళ

మధుపము మకరందము గ్రోలినట్లుగ
అధరామృతమధురసుధారసముల గ్రోలగ
ఘాఢ పరిష్వంగణమున చెలరేగిన
హుతాసన జ్వాల పుడమి తనువు
నంతటినీ నులువెచ్చగ చేయగ

ఆమని ఇంకా ఏమని రాలేదని గోముగ
ఎదురుచూసి ఎరుపెక్కిన కన్నులతో
శిశిరమందు ఎడబాటును భరియించక
మూగదైన కోయిల విరహముతో వేగలేక

మోడువారి నిదురుంచిన మామిడి తోట
మంచుతెరల తాకిడితో మరలా చిగురించగ
చిగురాకుల తిన మరిగిన ఎలకోయిల
మైమరచి గానముతో వసంతునే పిలువగ

పిలుపు విని వసంతుడే సుమదళములు
ఏరితెచ్చి కిసలయతల్పము పరువగ
హరిత వర్ణ చీరలోన నేలతల్లి సోయగాలు
వేయికన్నులున్నగాని చూడ తనివితీరదుగా

1 comment:

  1. (ఉగాది కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన నా కవిత)

    ReplyDelete