Wednesday 10 April 2013

శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.
ఉగాదినాడు సూర్యోదయాత్ పూర్వమే తైలాభ్యంగన ( నువ్వుల నూనె రాసుకుని, సున్ని పిండితో ఒళ్ళురుద్దుకుని, తలంటు పోసుకోవాలి) స్నానం ఆచరించాలి. చక్కని సాంప్రదాయ వస్త్రధారణ చేయడం ప్రతీ ఒక్కరు మరువ వద్దు. అలాగే ఈ రోజు స్వయంగా భార్యా భర్త ఇద్దరు కూర్చుని పూజను చేసుకోవడం మరువకండి. అలా పండగ రోజైనా కాసేపు ఇద్దరు కలసి భగవత్కార్యంలో పాల్గొన్నట్లౌతుంది. ఇంటికి వచ్చిన బంధు,స్నేహితులతో కలిసి దేవాలయ దర్శనం- పంచాంగ శ్రవణం చేయవలసినది. 

"ప్రపాదానం" అంటే దారిన పోయే వారికి దాహము తీర్చుకోడానికి జలము అందించడం ( చలివేంద్రాల ఏర్పాటు ) ఈరోజునుండి మొదలు పెట్టి నాలుగునెలలపాటు చెయ్యాలట. ఈక్రింది శ్లోకాన్ని పఠిస్తూ జలమును అందిస్తే పితృదేవతలు, దేవతలు కూడా ప్రీతిచెందుతారు.

" ప్రపేయం సర్వసామన్యా భూతేభ్యః ప్రతిపాదితా
ప్రదానాత్ పితరస్సర్వే తృప్యంతు చ పితామహాః
అనివార్యం ఇతోదేయం జలం మాస చతుష్టయః "

అట్టి ప్రపాదానం చేయలేని వారు "ఉదకుంభ దానము" ( జలముతో ఉన్న కలశ ) ను దినమునకొకటి చొప్పున ద్విజులకు ఇవ్వవలెను.

" ఏషధర్మ ఘటో దత్తో బ్రహ్మవిష్ణు శివాత్మకః
అస్య ప్రదానా త్సకలా మమసంతు మనోరథాః "

బ్రహ్మాది దేవతా స్వరూపమైన ఈ ధర్మఘటమును ఇచ్చుచున్నాను. అందువలన నా మనోరథములన్నియు సమకూరవలెను అని అర్థము.
అని పఠిస్తూ ఉదకుంభ దానము చేయవలెను. ( కనీసం ఈ ఉగాదినాడైననూ ఈ ఉదకుంభదానము చేయుట శుభము. )

ఉగాది నాడు బ్రాహ్మణులకు పంచాంగము, విశన కఱ్ఱ, మామిడి పండు దానము చేయడం పరిపాటి.

ఈ చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు శుక్ల నవమి వరకు "వసంత నవరాత్రి వ్రతము"ను ఆచరించెదరు. ఈ నవరాత్రులలో దేవీ ఉపాసన చేయవలెను.

ఈ చైత్రమాసము మొత్తము పెరుగు,పాలు,నెయ్యి, తేనెలను తినకుండా నియమము కలవారై - "గౌరీవ్రతమును" ఆచరించెదరు. దంపతీ స్వరూపమైన గౌరీపూజను నిత్యమును చేయుటయే ఇచటి గౌరీవ్రత విధానము.

ఈ నూతన సంవత్సరం అందరం ధార్మిక ఆసక్తి కలిగిన వారమై, భగవద్భక్తితో, లక్ష్మీ అనుగ్రహాని కి పాత్రులమవ్వాలని ఆపరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరకీ శ్రీ విజయనామ సంవత్సర నూతన ఉగాది శుభాకాంక్షలు.

No comments:

Post a Comment