Tuesday, 2 December 2025

మణిద్వీపం ఒకప్పుడు కొందరు వర్తకులు ఒక ఓడ చేసుకుని తూర్పుదేవులకు వెళ్ళి, అక్కడ వర్తకం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు శ్వేత ద్వీపంలో వారి వెంట ఒక సింహళదేశపు యువకుడు కూడా ఓడలో ఎక్కాడు. ఓడ నడి సముద్రంలో ఉండగా అకస్మాత్తుగా ఒక భయంకరమైన తుఫాను చెలరేగింది. అలలు ఆకాశమంత ఎత్తు లేచి, ఓడను బెండును ఆడించినట్టు ఆడించాయి. చుక్కాని విరిగిపోయింది ఓడకూ, అందులో ఉన్నవాళ్ళకూ అవసానకాలం సమీపించినట్టు కనబడింది. గాలికి ఓడ ఎటుగా పోతున్నదీ తెలియరాలేదు. తెలిసినా చేసేదికూడా లేదు. ఎందుకంటే, దాన్ని కావలిసిన దిక్కుగా పోయేటట్టు చెయ్య టానికి చుక్కాని లేదు. ఈవిధంగా ఒక పగలూ, ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయిన ఓడ మర్నాడు తెల్లవారేసరికి సముద్రం మధ్య నున్న ఒక కొండ కేసి పోవటం అందరి కళ్ళా పడింది. కొద్ది ఘడియలలో ఓడ దాని కేసి కొట్టుకుని తునాతునకలయిపోవ టానికి సిద్ధంగా ఉంది. అందరూ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. ఇంతలో నావికుల పెద్ద, " ఆ ఎదురుగా కనిపించేది మణిద్వీపం! ఆ కొండరాళ్ళలో ఉన్నన్ని మణులు ప్రపంచమంతటా కలి పినా లేవు,” అన్నాడు. అందరిలోనూ తిరిగి ఆశ తల ఎత్తింది. ఒక్క సింహళంవాడు మాత్రం, "ఓడ పగిలి మునిగిపోవటానికి మామూలు కొండ రాళ్ళయితే నేం? మాణిక్యాల రాళ్ళయితే నేం?" అన్నాడు. కాని ఓడ మణిద్వీపానికి ఒక మైలు దూరంలో ఉండగానే గాలి కాస్తా నిలిచి పోయింది. ఓడను తీరానికి చేర్చే మార్గంలేదు. తీరాన రేవు కూడా లేదు. అందుచేత ఓడ నుంచి కొన్ని తెప్పలు దించి, ఓడలో వాళ్ళంతా తీరానికి ప్రయాణమయారు. సింహళీయుడు మాత్రం ఓడ నుంచి దిగలేదు, "రత్నాలన్నీ మీరే ఉంచుకోండి. నేను మా తామ్రపర్ణి నగరానికి వెళ్ళాలి. ఈ ఓడ సన్ను తప్పక మా ఊరు చేర్చు తుంది. అందులోనుంచి దిగను," అనేశాడు. అతన్ని వదిలేసి మిగతా వాళ్ళంతా తెప్ప లను తెడ్లతో నడుపుకుంటూ తీరం కేసి వెళ్ళిపోయారు. తీరం చేరగానే నావికుల పెద్ద మిగిలిన వాళ్ళతో ఇలా అన్నాడు: "ఈ లంకలో ఉండేవాళ్ళు మరు గుజ్జులు, కోపం వస్తే వాళ్ళంత చెడ్డవాళ్ళు లేరు, విషపు బాణాలతో కొట్టి చంపేస్తారు. కాని మంచిగా ఉంటే ప్రాణాలిచ్చేస్తారు. అందుచేత వాళ్ళతో జాగ్రత్తగా మసులు కోవటం అవసరం. ఆ కనిపించే కొండ నిండా రాళ్ళలో రత్నాలున్నాయి. దాని దిగువనే మరుగుజ్జులుండే నగరం ఉన్నది. కొండ అన్ని పక్కలా నిటారుగా ఉంటుంది. దాన్ని ఎక్కటం అసాధ్యం. దాని పైకి వెళ్ళటానికి మెట్లున్నాయి. ఆ మెట్లను చేరా లంటే నగరంలో నుంచే వెళ్ళాలి. మెట్ల మార్గానికి మరుగుజ్జులు అహోరాత్రాలు కాపలా కాస్తారు. అందుచేత మరుగుజ్జు లను మంచిచేసుకోకుండా మనం ఏమీ సాధించలేం.” నావికుల పెద్ద ఈ విధంగా చెప్పాక, అందరూ కలిసి కొండ కేసి కదిలారు. కొంత దూరం వెళ్ళాక నగరం కనబడింది. వాళ్ళింకా నగరానికి కొంతదూరంలో ఉండ గానే వారి మీదికి బాణాలు వచ్చాయి. అదృష్టంకొద్దీ ఆవి ఎవరికీ తగలలేదు. "అందరూ ఇక్కడే కూర్చోండి. లేక పోతే మనం తమ మీదికి యుద్ధానికి వస్తున్నామని వాళ్ళు అపోహపడగలరు,”అన్నాడు నావికుల పెద్ద. అందరూ వున్న చోటనే చతికిల బడ్డారు. కొద్దిసేపటిలో కొందరు మరుగుజ్జు భటులు ఆయుధాలు చేతబట్టి నగరం వెలువడి వచ్చారు. భటుల వెంట ఉన్న సరదారు, "ఎవరు మీరు? ఈ లంకకు ఎందుకు వచ్చారు?” అని అడిగాడు. "మా ఓడ తుఫానులో దెబ్బతిన్నది. సహాయం కోసం వచ్చాం,” అన్నాడు నావికుల పెద్ద. "మీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోయి. మా రాజుగారి ముందు పెడతాము, మీరు చెప్పుకునేదంతా ఆయనకు చెప్పుకోండి." అని మరుగుజ్జు భటులు అన్నారు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. మరుగుజ్జులు వర్తకులనూ, నావికులనూ గంతలు కట్టి, చేతులకు బందాలు వేసి నగరంలోకి తీసుకు పోయి, రాజుగారి ఎదట హాజరు పెట్టారు. "మీరు చెప్పే తుఫాను సంగతి మాకేమీ తెలియదు. మీరు వచ్చిన దిక్కుగా సము ద్రంలో మీ ఓడ ఏమీ కనిపించలేదని మా వాళ్ళు చెబుతున్నారు. ఈ లంకలో అడుగుపెట్టిన వారెవరూ తిరిగి పోరని మీకు తెలిసే ఉంటుంది. మీరేదో దురుద్దేశంతో ఇక్కడికి వచ్చారనటానికి సందేహంలేదు. ప్రస్తుతానికి మిమ్మల్ని ఖైదులో ఉంచుతాం," అన్నాడు రాజు. భటులు వాళ్ళను తమ కారాగృహంలో బంధించారు. అవి మరుగుజ్జల కోసం కట్టినవి కావటంచేత వర్తకులకూ, వారి వెంట ఉన్నవారికి చాలా ఇరుకనిపించాయి. వర్తకుల ఓడ మరుగుజ్జులకు కనిపించని మాట నిజమే. ఎందుచేతనంటే లంక చుట్టూ సముద్రంలో ఒక ప్రవాహం ఉన్నది. ఆది ఓడను క్రమంగా లంక అవతలి పక్కకు చేర్చింది, అక్కడనే మంచి రేవు కూడా ఉన్నది. ఆ రేవులోకి వచ్చి ఓడ తీరం చెంతనే నిలిచింది.'మిగిలిన వాళ్ళంతా తెప్పలలో లంక మీదికి వెళ్ళిపోయాక సింహళీయుడు నిశ్చిం తగా పడుకుని నిద్రపోయాడు. అతను తిరిగి నిద్ర లేచేసరికి నౌక రేవులో ఉండటం కనబడింది. "తామ్రపర్ణి వచ్చేసిందా?” అంటూ సింహళీయుడు నౌక నుంచి దిగి తీరానికి వచ్చేశాడు. రేవులో ఎవరూ లేరు. సమీపం లోనే కొండ ఒకటి ఉన్నది. అతను దాని పక్క గా నడవనారంభించాడు. అతను కొంతదూరం వెళ్ళాక ఇద్దరు మరుగుజ్జులు గోలీ లాడుతూ కనిపించారు. సాయంకాలపు ఎండలో ఆ గోలీలు ధగధగా మెరిశాయి. వాటి తళతళ చూసి సింహళీయుడు ఆశ్చర్యపోయాడు, కాని అవి రత్నాలయి ఉంటాయని అతనికి తట్టలేదు. సింహళీయుణ్ణి చూడగానే మరుగుజ్జులు, "అమ్మయ్యో, రాక్షసుడు!" అంటూ పారి పోబోయారు. కాని అతను వాళ్ళను పట్టు కుని ఆపి, " నేనూ, మీవంటి మనిషినే! కొంచెం లావూ, ఎత్తూ — అంతే! నాకు చచ్చే ఆకలిగా ఉంది! ముందు తినటానికేదైనా కావాలి,” అన్నాడు. మరుగుజ్జులు అతణ్ణి తమ ఇంటికి తీసుకు పోయారు. దారిలో వాళ్ళు, "నీ వంటి రాక్షసులను కొందరిని మా రాజుగారు కొట్లో పెట్టించారు,” అని చెప్పారు. "పాపం, వాళ్ళు ఓడలో నాతో వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. ఎలాగైనా వాళ్ళను ఖైదు నుంచి విడిపించాలి,” అనుకున్నాడు సింహళీయుడు. మరుగుజ్జులు అతన్ని తమ ఇంటికి తీసుకుపోయారు. ఒంటరిగాడు గనక అతని కోసం భటులు రాలేదు గాని, మామూలు వాళ్ళు అతన్ని ఎంతగానో పరీక్ష చేశారు. ఈ రాక్షసుడు మాణిక్యాలేవీ తీసుకోలేదు. ఆఖరుకు గోలీలు కూడా ఆడుకునే మరు గుజ్జు పిల్లల దగ్గిరే ఉన్నాయి.అందుచేత అతని పట్ల అందరూ స్నేహ భావం ప్రకటించారు. అతనికి కడుపునిండా తిండి పెట్టారు. అతనుకూడా పాటలు పాడి, కథలు చెప్పి వాళ్ళను ఆనందింప జేశాడు. మర్నాడు ఉదయం సింహళీయుడు తన మిత్రులైన మరుగుజ్జు పిల్లలతో, " నాకు మీ రాజుగారిని ఒక్కసారి చూడాలని ఉన్నది,” అన్నాడు. "అయితే ఇప్పుడే పోదాం. రాజుగారు తోటలో ఉంటాడు," అన్నారు వాళ్ళు. ఇద్దరినీ చెరొక భుజానా ఎక్కించుకుని సింహళీయుడు రాజోద్యానానికి వెళ్ళాడు. " అదుగో, ఆ రాతి పలక పైన కూర్చున్న వాడే మా రాజుగారు. మమ్మల్ని దింపెయ్యి. రాజుగారు చూస్తే మమ్మల్ని దండిస్తారు,” అంటూ, మరుగుజ్జు పిల్లలు ఆందోళన పడ్డారు. సింహళీయుడు వాళ్ళను దింపి, నాలుగు అంగల్లో రాజు కూర్చున్న చోటికి వెళ్ళి, అతన్ని నడుము పటుకుని పైకెత్తాడు. రాజు కీచుగా భయంతో కేకపెట్టాడు. ఆ కేక విని అన్ని పక్కల నుంచీ విషపుబాణాలు గల భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు. "వాళ్ళు నన్నేమైనా చేశారో, నిన్ను నలిపి పారేస్తాను. వాళ్ళను ముందు దూరంగా ఉండమను," అన్నాడు సింహ ళీయుడు రాజుతో, దూరం పొమ్మని రాజు తన భటులకు కేకపెట్టాడు. "నా స్నేహితులను ఖైదులో పెట్టించా వుట. వాళ్ళను ముందు విడిపించు. వాళ్ళు నీకేమి అపకారం చేశారు? వాళ్ళను వెంటనే విడిపించక పోయావో ఈ లంకకు మరొక రాజును ఏర్పాటు చేస్తాను," అన్నాడు సింహళీయుడు. "నీ యిష్టప్రకారం చేస్తాను. నన్ను ముందు దించు,” అన్నాడు రాజు. సింహ ళియుడు రాజును కిందపెట్టాడు. రాజు తన భటులను పిలిచి, రాక్ష సులను ఖైదు నుంచి విడిపించి తీసుకురమ్మని ఉత్తరు విచ్చాడు. కొంత సేపటికి ఓడ తాలూకు మనుషులంతా భటులు వెంట అక్కడికి పచ్చారు. సింహళీయుణ్ణి చూడ గానే వాళ్ళకు ప్రాణం లేచివచ్చింది. "వీళ్ళు అబద్ధం చెప్పారు. తుఫాను వచ్చిందన్నారు. తమ ఓడ సముద్రంలో కదలలేని స్థితిలో ఉన్నదన్నారు. అ మాటలు నమ్మదగినవి కాదు. అందుచేత నాకు వాళ్ళపైన అనుమానం కలిగి ఖైదులో పెట్టిం చాను," అన్నాడు రాజు సింహళీయుడితో, "అందులో ఆబద్ధం ఏమీలేదు. మా ఓడ చుక్కాని విరిగి రేవులో ఉన్నది. మేము దానికి కొత్త చుక్కాని ఏర్పాటు చేసుకునే దాకా మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తే, తరవాత మా దారిన మేము పోతాం," అన్నాడు సింహళీయుడు. రాజు అందుకు సమ్మతించాడు. ఒక్కరోజులో ఓడకు కొత్త చుక్కాని ఏర్పాటయింది. " ఇక మనం బయలుదేరుదాం." అన్నాడు సింహళీయుడు. "రత్నాలు తీసుకోకుండా ఎలా పోతాం?" అన్నారు మిగిలినవాళ్ళు, సింహళీయుడు తన మిత్రులైన మరు గుజ్జు పిల్లలను పిలిచి, "మాకు కూడా గోలీ లాడుకోవాలని ఉన్నది. మీరు మీ స్నేహితులను కొందరిని వెంట పెట్టుకుని కొండ మీదికి వెళ్ళి పెద్ద పెద్ద గోలీరాళ్ళు పట్టుకురండి. మాకు చిన్న చిన్న గోలీలు చాలవు. అందుచేత పెద్ద పెద్ద గోలీరాళ్ళు తీసుకురండి. తరవాత వాటిని మేము గోలీ లుగా తయారు చేసుకుంటాం,” అన్నాడు. సాయంకాలాని కల్లా పది పన్నెండుమంది. మరుగుజ్జు పిల్లలు పెద్ద పెద్ద ముడి మణు లను తెచ్చి సింహళీయుడి ముందు పెట్టారు. సింహళీయుడు వాటిని తన మిత్రులందరికీ పంచాడు. తరవాత వాళ్ళు ఓడ ఎక్కి ప్రయాణం సాగించారు.

No comments:

Post a Comment