Sunday 10 May 2020

***పేదరాశి పెద్దమ్మ...పొట్టేలు***

 ఒకరోజు పేదరాశి పెద్దమ్మ గడపలో కూకోని ఉంది. ఆ దారిగుండా ఆవూరి గుంటలు కొందరు వలలు,ఊజులు,టిర్రెలు ఎత్తిడ్లూ,పట్టుకొని పెద్దచెరువు  కాసి పెరిగెడతన్ర్రు... అందులో ఒకన్ని ఆపి విషయం కనుక్కొని తనూ పెడకన వున్న ఊజు తీసి బూజు దులిపి టిర్రి భుజాన తగిలించుకొని బయలుదేరింది. తొలుత చిన్న ఇలుసు దొరికింది. తరువాతప్రయత్నిస్తే పిత్తపరిగి,తరువాత చుక్క పరిగి,ఆనక బేడిసి,సీకొక్కెడం,జల్ల,బొడిగి,బొమ్మిడం,మిట్ట, తాటిమిట్ట,బురద మిట్ట,రొయ్య,ఎండ్రికి,పీత,మార్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతుంటే టిర్రెలో వేస్తూ అది తీసి ఇది.అలా అన్నీ నీటిలో వదిలేస్తూ ఉంది. చివరకు ఒక పెద్ద సవడ(కొరమీను)దొరికింది.దానితో తృప్తిచెంది, ఇంటిముఖం పట్టింది పెద్దమ్మ.
   కత్తిపీట, పొయ్యిబుగ్గి,పలక రాయి సిద్ధం చేసుకొని, సవడను పొయ్యిబుగ్గిలో పొరిపి,పీక పట్టుకొని కత్తిపీటకు ఆనించి కొయ్యబోతుంటే.... సవడ తననే దీనంగా చూస్తూ వదలమని వేడుకుంటున్నట్లుంది.
   పెద్దమ్మకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. పిల్లలు అందరూ ఎవరి దారి వారు చూసుకొని వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఒంటరి అయిపోయింది.కనుక ఈ సవడ వుంటే తనతో కాలక్షేపం అవుతుందని తలచి,సవడను నీటితో కడిగి, గోలెంలోని నీటిలో విడిచిపెట్టింది. 'బంగారూ' అని పేరు పెట్టుకుంది.షరాబులింటికెళ్ళి,చిన్న వ్యాపారంకమ్మి చేయించి బంగారుకి కుట్టించింది.  బంగారూ అని పిలిస్తే నీటిలోంచి పైకి వచ్చేది ఇన్ని నూకలేస్తే తినీసి ఎళ్ళిపోయేది.రోజూ పెద్దమ్మకు బంగారు లేనిదే గడిచేదికాదు.
    ఒకరోజు సంతకు బయలెలుతూ ఉట్టిపైన వండిన అన్నంపెట్టి, పక్కింటి వారికి ఇంటి తాళం ఇచ్చి అంబల్లేలకి మా బంగారుకి కొంచెం నూకలు వెయ్యండి అని చెప్పి వెళ్ళీంది. పకాల్లేలకి(10 గంటలకు) పక్కింటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళకు మర్యాద చెయ్యడానికి వూరిల్కి గుడ్డులకోసం వెళితే దొరకలేదు.ఏమి చెయ్యాలా పరువు పోద్ది అని ఆలోచిస్తుంటే  అప్పుడు వారికి పెద్దమ్మ పెంచుకుంటున్న సవడ గుర్తుకొచ్చింది. తరువాత నెమ్మదిగా పెద్దమ్మకు చెప్పుకోవచ్చనుకొని, ఆ సవడను కూర చేసి చుట్టాలకి వడ్డించేశారు.అలబొద్దులేలకి  పెద్దమ్మ సంతనుండి వచ్చి, ఆకలికి తాలలేక ఉట్టిమీదున్న వట్టన్నమేమి తింటానని పక్కింటికెళ్ళి చారో,కూరో కసింత ఇమ్మని అడిగితే,వాళ్ళు మిగిలిపోయిన ఇగురు(గ్రేవీ)సట్టి(మట్టిపాత్ర)తో పాటు ఇచ్చేసారు.
     అన్నం లో ఆ ఇగురు కలుపుకొని తింటుంటే పంటికింద ఏదో రాయి తగిలింది. తీసి చూస్తే యాపారంకమ్మి, "ఇందులోకి ఎలా వచ్చింది,వచ్చిందబ్బా!!!? కొంపతీసి మా బంగారును పక్కింటోళ్ళు ఏటైనాసేసీసినారేటి...!!!?" అనుకొంటు గోళెం దగ్గరకు వెళ్ళి, "బంగారూ" "బంగారూ" అంటూ పిలిచింది పెద్దమ్మ. ఇంకెక్కడి బంగారు?. నీటిలో సెయ్యెట్టి తడిమి సూత్తే బంగారు నేదు. ఇది పక్కింటోళ్ళ పనే అనుకొని ఆళ్ళను నిలదీసింది.ఆలు ఇలగిలగ అని పెద్దమ్మకు నచ్చసెప్పడానికి శతయిదాలా పయత్నం సేసినారు.. కానీ ఇంతాది...పెద్దమ్మ...నోటికేదొత్తే అదే..పరువు తీసేత్తంది.ఫలితం నేకపోయింది.ఊరూ వాడా ఏకమయ్యేట్టు ఒకటే ఏడుపు, ఒకటే దీవెన,"మీకు రోజ్జెయ్య, మీకు గాడుప్పుట్ట, సంకటంపుట్ట,మీ మందమాసిపోనూ,గాలీవానెత్తుకుపోను,మీకు దినవారమెట్ట,మీ నెట్టిగొట్ట,మీకు పోగాలం రాను,మికు దిబ్బెయ్య,మీకు బుగ్గెత్తా,మీకు పిండం పెట్ట..మీకు దీశమెట్ట... మీకసిరమ్మిరిసియ్య, నూకాలమ్మ నవిలియ్య...మీ నోట్లో పుండుపుట్ట,మీకొక పాముపొడ,ముండగాసిన ముండపాపా మా బంగారే మీకు దొరికిందా?" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా రోజల్లా తిట్టింది. ఆతిట్లు వినలేక పక్కింటోళ్ళు తలుపేసుకున్నారు. పెద్దమ్మ అంతటితో ఆగకుండా ఆ ఊరిలో దాలినాయుడు దగ్గరకు వెళ్ళి తగువు పెట్టింది. దాలినాయుడు పక్కింటోలిని పిలిచి, పెద్దమ్మకు సవడ బదులుగా ఒక గొర్రె పిల్లనిమ్మని తీర్పుచెప్పాడు.
    పెద్దమ్మ ఆ గొర్రెపిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. అది పెరిగి పెద్దదయింది.
    ఒక రోజు ప్రక్క వూరిలో జాతర జరుగుతుంది. అందరూ జాతరకి వెళుతున్నారు. పొట్టేలు(గొర్రె పోతు) పెద్దమ్మతో ఇలా అంది "పెద్దమ్మా పెద్దమ్మా అందరూ యాత్రకు ఎలతన్నారు, నేనూ ఎలతాను "అని. ఎప్పుడూ అడగనిది అడిగిందని చెప్పి డబ్బులిచ్చి, పంపించింది."చీకటి పడిపోయేంతవరకూ అవీ,ఇవీ సూసుకోని ఉండిపోకు,ఒకాల సీకటిబడితే పార్రాకు. సుబ్బిశెట్టి గోరింటికెళ్ళి ఇలగిలగ పెద్దమ్మ తాలూకా అని చెబితే అతను మరియాద సేత్తాడు"అని జాగ్రత్తలు చెప్పి పంపించిచింది పెద్దమ్మ.
పొట్టేలు జాతరంతా తిరిగి కావలిసినవన్నీ కొనుక్కొని, చూడాల్సినవన్నీ చూసేసరికి పొద్దుబోయింది. సుబ్బిశెట్టి ఇంటికి వెళ్ళి ఇలగిలగ అని చెబితే అతను సామాన్ల గది చూపించి అక్కడ పడుకోమని చెప్పాడు. ఆగదిలో ఒక బస్తా నిండా వజ్రాలు,మరో బస్తా నిండా రత్నాలు, ముత్యాలు, బంగారం,పగడాలు, ఒకటేమిటి? ఆసంపదను చుసేసరికి కొంచెం స్వార్దం పుట్టింది పొట్టేలుకు. ఒక్కో బస్తాలో కొంచెం కొంచెం బంగారు కాసులు,రత్నాలు,వజ్రాలు,ముత్యాలు అన్నీ మింగేసి పెందిలకదనే షావుకారికి చెప్పి బయలుదేరింది. నడవలేక నడవలేక వస్తున్న పొట్టేలు దారిన పోతున్న తలయారితో "నాను పారొత్తన్నానని,బెంగెట్టుకోవద్ద"ని చెప్పి "బొంత పరిసి,రోకలి సిద్దం చెయ్య"మని చెప్పింది. పెద్దమ్మ బెంగపెట్టుకోని ఏటిజరిగిందా అని ఎదురుచూస్తూ కూర్చుంది. జరిగిన సంగతంతా పెద్దమ్మకు చెప్పగా రోకలి తో కుడి ప్రక్క పొడిస్తే ఇన్ని వజ్రాలు నోటింట పడ్డాయట.ఎడమ ప్రక్క పొడిస్తే ఇన్ని రత్నాలు పడ్డాయట. పడిన సంపదని కొలవడానికి పక్కింటోలింటికి సోలకు వెళ్ళింది."ఏమిటి కొలుస్తాదా చూడాలని సోల అడుగున చింతపండు అంటించి ఇచ్చారు.
   కొలిచి గూనలోవేసి దాచింది పెద్దమ్మ. సోల వారిది వారికిచ్చివేసింది.సోల అడుగున వున్న రత్నాలను,వజ్రాలను చూసి అశ్చర్యపోయారు పక్కింటివారు. పెద్దమ్మ దగ్గరకి వచ్చి ఆరా తీయగా ఇలగిలగ అని చెప్పింది.
  పక్కింటోళ్ళు ఒక బేపి(కుక్క)ను పెంచుతున్నారు. వారు ఆబేపి(కుక్క)కి ఇలగిలగ అనిచెప్పి యాత్రకు పంపారు. ఆ బేపి(కుక్క) యాత్రలో కజ్జిపుండలు,కనికులు,జీడిలు,నెయ్యుండలు ,బూర్లు ,గార్లు ,బూందీఉండలు,పోకుండలు ,అరిసిలు ,పొంగడాలు,ఉటంకులు,కరకజ్జము,కాజాలు..బాల్సులు...మడతకాజాలు...సున్నుండలు...రవ్వలాడూలు...పాలమింజిలు..కొబ్బరి మిఠాయి..సేగొడాలు..జంతికులు...సుప్పులు...కనిపించినవన్నీ కొనుక్కొని తిని సాయంత్రానికి సుబ్బిశెట్టి ఇంటికిపడుకోవడానికి వెళ్ళింది. అర్ధరాత్రి నెమ్మదిగా సరుకుల గదిలోకి చొరబడి రత్నాలను మింగబోయింది. దురదృష్టం కలసి వచ్చింది. అదే సమయానికి శెట్టికి మెలికువ వచ్చింది,సామాన్లగది తెరిచి వుండడం చూసి,కర్రతీసి ఎవరు తీసారో చూడగా కుక్క కనిపించింది.అంతే కర్రతో నడుముకడ్డంగా ఒక్కటేశాడు. అంతే కైయ్...కైయ్... మంటూ కుక్క ఒకటే పరుగు.
    ఖాలీ కడుపు తోనిగాని ఇంటికెల్లినానా గొల్లోలు ఊరుకోరు. అందుకని గడ్డి,మన్నూగిన్నూ అన్నీ తినీసి
   నడలేక నడలేక జోగుకోని ఊగుకోని వస్తుంది. ఆ దారిని ఆలూరి మడియారి ఎల్తుంటే "అన్నా!అన్నా! నేనొచ్చీసరికి ఆగమవుద్ది బెంగెట్టుకోవద్దని మాకోనారికి కవురెట్టీరయ్యా నీకు పున్నెముంతాది."
      బేపి ఇంటికొచ్చీసింది. "ఎంత దనం మోసికొచ్చిందో మాతల్లి మాలచ్చిమి" అంటూ పరుపేసీసి బేపిని తొంగుండెట్టీసి రోకల్దెచ్చి ఈ పక్కన బొడిస్తే ఇంత మన్నూ, ఆ పక్కన బొడిస్తే ఇంత గడ్డీ పడ్డాయట.
   "ఓలె దరిద్రగొట్టుదానా ...ముదనస్టపుదానా...సెండాలందానా...ఏటి తినీసినావే..." అంటూ రోకలి కర్రతోటి నడుము జారగొట్టీసినారు. కంయ్యి...కంయ్యి...మంటూ బేపి ఒకటే పరుగు......

No comments:

Post a Comment