Thursday 24 January 2013

‎|| దమ్మిడీ||
ఒకరోజు పేదరాశి పెద్దమ్మ వేకువజామునే నిద్రలేచి, వాకిలి ఊడ్చుతూ వుండగా ఒక దమ్మిడీ దొరికందట.ఉదయాన్నే లక్ష్మిదేవి దొరికిందని సంబరపడి, ఆ దమ్మిడీని బియ్యం దాచే కుండలో వేసిందట.అన్నం వండడానికి ఆకుండలోని బియ్యాన్ని చేటలో ఒంపి దోసెడు బియ్యం మరల కుండలో వేసి, ఆదమ్మిడిని కూడా అందులో వేసిందట. కొన్ని బియ్యం ఎసరులో పోసి, మిగిలిన బియ్యం కిరాణా దుఖాణానికి తీసుకుపోయి ఆబియ్యానికి బదులుగా నూనె చింతపండు,ఉప్పు,కారం,దినుసులూ తీసుకువచ్చింది.
మద్యాహ్నం తన కొడుకులకు వడ్డించి,తనూ తిని విశ్రాంతి తీసుకుంది.కొడుకులు పొలంకి వెళ్ళిపోయారు.సాయంత్రం కుండలో బియ్యం ఉన్నాయనుకొని తీయబోయింది పెద్దమ్మ. కుండకు సగం ఉన్నాయి బియ్యం. పరద్యానంలో ఆబియ్యాన్ని చేటలో వేసి వంటకు ఉపక్రమించింది.దోసెడు బియ్యం కుండలో వేసి,దమ్మిడీని కూడా అందులో వేసింది.రాత్రి అందరూ భోంచేసారు.
మరుదినం వేకువనే నిద్రలెచి,నిళ్ళకుపోయి,స్నానాధికాలు ముగించి,వంతకు ఉపక్రమించి,కుండ తీయబోతే కుండలో సగానికి బియ్యం ఉన్నాయి. కొడుకులెవరాన తెచ్చి వేసారేమోననుకొని వంటచేసి,దమ్మిడీని కుండలోనే భద్రపరచి,దోసెడు బియ్యం అందులో వేసింది. రాత్రి వంట కోసం కుండలో చూడబోతే కుండకు సగానికి బియ్యం ఉన్నాయి.ఆశ్చర్యం .కొడుకులనడిగింది. మేమెవ్వరం బియ్యం అందులో వెయ్యలేదన్నారు వారు. ఎవ్వరూ వెయ్యకపొతే ఈ బియ్యం ఎలా వచ్చాయని తెలుసుకోవాలని అనుకుంది పెద్దమ్మ.ఆ రాత్రి నిద్రపోలేదు కుండ వైపే చూస్తూ గమనించసాగింది రాత్రంతా. తెల్లవారి కుండలో చూస్తే సగానికి బియ్యం ఉన్నాయి.ఈదమ్మిడీ ప్రభావం వల్లనే ఇదంతా జరిగిందని అనుకొని, దమ్మిడి తీసి చూసింది. బియ్యం ఎలావేసినవి అలాగే వున్నాయి.
పెద్దమ్మ ఆనందానికి అవధుల్లేవు కొడుకులతో ఆ దమ్మిడి మహత్యం గూర్చి చెప్పింది. ఆ కుండలో నుండి తీసి ఒక పెద్ద గూనలో ఆదమ్మిడిని వేసి కొంచెం బియ్యం వేసి చూడగా ఆ గూనకు సగం వరకు బియ్యం తయారైనవి. ఈవిధంగా తయారైన బియ్యాన్ని అమ్మి తొందరలోనే ధనవంతులయ్యారు. 
ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న ఎలుగుబంటి పేద్దమ్మ ఇంటికి వచ్చి, దమ్మిడీ ఇమ్మన్నది, ఇవ్వకపోతే ఈరాత్రికి నిన్ను మింగేస్తానని వెళ్ళిపోయింది. పెద్దమ్మ దిగులుతో కొడుకులకోసం ఎదురుచూడసాగింది. పెద్దకొడుకులు వచ్చారు వారితో చెబితే "ఇప్పూడే వస్తాము" అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు. చిన్నోడొచ్చాడు. చిన్నోడుతో చెబితే సరే రానీ చూద్దాం దాని పని పడతాను అని బళ్ళెం తీసి సానరాయి మీద నూరుతున్నాడట."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని మినుములు అడిగాయట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి ద్వారందగ్గర దాగుకో. మళ్ళీ "సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని పిచ్చుక అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి గూటిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని తేలు అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి పెడక(చూరు) దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని ఉప్పు అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి పొయ్యిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని పీత అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి బిందిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని దుడ్డుకర్ర అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి తలుపుమూల దాగుకో.అని చెప్పి చిన్నోడు అటక పైన దాగున్నాడట.
బాగా పొద్దుపోయింది యెలుగుబంటి పెద్దమ్మ ఇంటికి వచ్చింది తలుపేసి ఉంది. తన బలం అంతా ఉపయోగించి విసురుగా వచ్చి తలుపును ఢీకొట్టింది ఎలుగు. అంతే ఒక్క ఉదుటున లోనికి పడింది. కిందనున్న మినుములపై పడి జారి దొర్లుకుంటూ వెళ్ళి గోడను ఢీకొట్టింది.దులపరించుకొని, కింద ఏమున్నాయో చూద్దామని, గూటిలో దీపం తీయబోతే పిచ్చుక తన రెక్క్లతో ఆర్పేసింది. పెడకన అగ్గిపెట్టె ఉంటుందేమోనని వెత్కుతుంటే తేలు కుట్టింది.ఏది కుట్టిందో చూద్దామని 
పొయ్యిలో నిప్పులు రాజేసి మంట వెలిగిద్దామని మూతిపెట్టి ఊదితే ఉప్పుపేలి తన కంటిలోకి దుమ్మంతా ఎగిరి పడింది.
ఎలుగుబంటికి కళ్ళు మండుతుంటే నీటితో కళ్ళు కడగాలని బిందిలో చేయి పెట్టింది. అంతే పీత తన డెక్కలతో వేలు కత్తిరించింది. తలుపు మూలనున్న దుడ్డుకర్ర దిబ్బడ దబ్బడమని ఎలుగుబంటి వీపు విమానం మోత మొగిస్తుంటే, అటక పైనుండి చిన్నోడు బళ్ళెం పట్టుకొని దిగి చంపబోయాడు. యెలుగుబంటి తనను చంపవద్దని వెడుకుంటె, క్షమించి విడిచిపెట్టి ,బుద్ధిగా బ్రతుకు, మాజోలికి ఇక రావద్దంటూ చెప్పాడు.

No comments:

Post a Comment