Tuesday 1 January 2013



ప్రియా!
  నిన్ను చూసిన తొలి చూపులో ఏదో తెలియని మధుర స్మృతి. ఇంతకు ముందెన్నడో ఎప్పుడో చూసిన గుర్తు లీలగా మెదులుతుంది. నీవు నాతో ఏదో బాస చేసినట్లు, నేను నీతో ఏవో ఊసులాడినట్లూ, మంచుతెరల దుప్పటిలో పుడమికాంత ఆదమరచి నిదురోతున్నప్పుడు, నీ నులివెచ్చని ఒడితలగడపై నేను తలవాల్చి నీకన్నులలోకి తదేకంగా చూస్తున్నప్పుడు నీ కురుల వింజామరలతో విసురుతుంటే మలయమారుతమేదో నాముఖాన్ని తాకినప్పుడు ఆప్పుడు కలిగిన పులకరింత ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నట్లుంది. నీ అద్దం లాటి చెక్కిలిపై నా ముఖ ప్రతిబింబము సుస్పష్టంగా కనిపిస్తుంటే,అనుకోకుండా నాచేతితో నీ బుగ్గతాకినప్పుడు సిగ్గుతో ఎరుపెక్కిన నీచెక్కిలి గులాబి మొగ్గలా ముడుచుకుంటే అరవిరిసిన లేత గులబి మొగ్గ నీ బుగ్గ నిగ్గు చూసి సిగ్గుతో తలవాల్చుకోలేదా?  ఆప్పుడే వచ్చిన గండుతుమ్మెద నీ ముఖపద్మము పై వాలాలని ఎంతో ఆశగా వచ్చి, సంపంగి పువ్వు వంటి నీ ముక్కును చూసి గక్కున వెనుతిరిరుగలేదా(సంపంగి దగ్గరకు తుమ్మెదలు రావుకదా!)
 అప్పుడే ఉదయిస్తున్న చంద్రబింబం నీ ముఖం పైనున్న కురులు చిరుగాలికి తొలగిపోగా కనిపించిన ముఖ చంద్రాన్ని చూసి అప్పుడే చంద్రోదయం అయిందా అని తడబడి మబ్బుచాటుకు వెళ్ళి దాగుకోలేదా?
 మధుర మదిరా రసాఛ్ఛాదిత మదురసాపూరిత అధరసుధామధురసాన్ని గ్రోలాలని నా పెదవులు ఎంత ఆరాట పడలేదూ?
  మధుమాసంలొ ఒక సాయంసంధ్యాసమయంలో మరుమల్లెలు విరబూసి సౌగంధాన్ని వెదజల్లుతూ సోయగాలను వొలికిస్తున్న వేళలో మందహాసం తో మత్తెక్కించి వలపులు చిలికే ఆ వగలాడి చూపుతో పిలువక పిలిచే భావాలను రేపుతూ  నా ఎదలో నాకే తెలియని అలజడులను సృష్టిస్తూ, మదిని దోచిన చిన్నదానా!నీవు నా ఎదుటనే నిలుచుంటే మనసు దాచుకోలేక నీ ఎడద పై వాలలని నా ఎదలో రగిలే విరహాగ్నిని చల్లార్చుకోవాలని ఎంత తహతహలాడలేదూ?
    హేమంతఋతువు, చల్లని రేయి,అప్పుడే మంచు తెరలలను తొలగించుకొంటూ బాల శశిబింబము కురిపిస్తున్న వెన్నెల వెలుగులు నా విరహాగ్నిని నిప్పులను విసనకర్రతో విసిరినట్లు మరింత అధికం చేయుచున్నాయి. ఆ తరుణంలో నీ రాక గ్రీష్మఋతువు మిట్టమద్యాహ్నం భానుని తీక్షణ కిరణ తాకిడికి వేడెక్కిన సుర్యకాంతశిల పై పడిన మంచు వర్షం వలే నాకు హర్షం కలిగించలేదా? పరవశాన నీ చెక్కిలి తాకిన న పెదవులు చిరునవ్వుల అలికిడికి చిరుగాలి సవ్వడికి అదిరె చిగురాకుపెదవులు చిలికిన మధువును మరిగి నా చూపులు నీ పెదవులు దాటి ఎటులైనా మరలాలని ఎంత ప్రయత్నించలేదూ?
   నీవు లేక పోయినా, నీరూపం నా హృదయ మందిరంలో ఇంకా పదిలంగానే ఉంది. నీ చూపు నా పై లేక పోయిన న కన్నుల్లో నీరూపం ఇంకా కదలాడుతూనే వుంది. నిను తాకకపొయినా నీ మనసంతా నలోనే పరచుకొని ఉంది.
   వెన్నెల్లో విరబూసిన విరజజుల నడిగాను నీ చిరుదరహసపు అరవిరిసిన పెదవుల మాటున వెదజల్లిన వెన్నెలల చిరు దంతపు వెలుగుల చూసి తను రాల్చిన విరజాజులెమో నని తడబడినాయట.
    ................ఇంకా ఈలేఖ రాయడానికి  సమయం లేక నా ప్రియను కలవడనికి స్వప్న లోకాని వెళ్ళుచున్నాను.
              _____మీ ప్రియమైన ప్రియుడు.

No comments:

Post a Comment