Sunday 4 March 2018

        నడిమంత్రపు సిరి
 అర్ధరాత్రి వేళ భోజరాజు తన శయనాగారం లో నిద్రిస్తున్నాడు.శయనాగారం క్రిందనే రాజుగారి కోశాగారం వుంది. ఒక దొంగ కావలి వాళ్ళ కన్ను గప్పి కోశాగారానికి కన్నం వేసి ప్రవేశించాడు. విలువైన మణులు,రత్నాలూ, మాణిక్యాలూ మూట గట్టి భుజాన వేసుకొని బయట పదాడమని అనుకుంటూవుండగా ఎందుకో ఆ దొంగకు పాప భీతి,వైరాగ్యం కలిగాయి నేను పరుల సొమ్ము దొంగిలించి తప్పు చేస్తున్నానేమో పై జన్మకు యిదంతా ఋణభారమే కదా!
యత్ వ్యంగా: కుష్టి న శ్చాంధాః పంగ వశ్చ,దరిద్రణ:
పూర్వోపార్జిత పాపస్య ఫలమ స్నంతి దేహినః
అర్థము:--లోకం లో అంగ వైకల్యం గలవారు,కుష్టు వ్యాధి తో బాధ పడే వారు,కుంటి వాళ్ళు,గ్రుడ్డి వాళ్ళు, దరిద్రులూ వీరందరూ ఎప్పుడో చేసిన పాప ఫలం అనుభావిస్తున్నావారే కదా!అనే ఆలోచన వచ్చి ఆ మూట లన్నీ అక్కడే పడవేసి వెళ్లి పోదామనుకుంటుండగా పై భాగం లో పడుకున్న భోజ రాజు కు నిద్రా భంగ మైంది. ఆయన లేచి కిటికీ లోనుంచి ధారా నగరాన్ని,భవనాల్నీవెన్నెల వెలుగులో చూస్తుంటే ఆయనకు గర్వం కలిగింది. యింత కంటే ఏమి జీవితానికి ఏమి కావాలి అని అప్రయత్నంగా ఒక శ్లోకం పైకే గట్టిగా చెప్పాడు.
చేతోహరా యువతయ,సుహృదోనుకూలా:
సద్భాంధ వా ప్రణయ గర్భ గిరశ్చ భ్రుత్యాః
వల్గంతి దంతి నివహా:తరళా తురంగాః
అర్థము:--(ఆహా! నాకేమి తక్కువ?)మనోహరమైన అందగత్తె లు,అనుకూలురైన మిత్రులు,సజ్జనులైన బంధువులు,యెంతో ప్రేమతో సేవించే సేవకులు,దూకుడు గల గజ సేనలు,ధాటీ అయిన గుర్రాలు వున్నాయి.
ఈ శ్లోకం కింద వున్న దొంగకు వినిపించి . వాడు వెంటనే నాలుగో పాదం అప్రయత్నముగా గట్టిగా యిలా పూర్తీ చేశాడు
"సమ్మీలనే నయనయో:నహి కించిదస్తి!" ఒక్కసారి కళ్ళు మూత పడగానే (చనిపోయిన తర్వాత)పైన చెప్పిన సౌభాగ్యాలేవీ వుండవు. యిలా గట్టిగా చెప్పగానే కావలి వాళ్లకు వాడు దొరికి పోయాడు. వాళ్ళు వాడిని రాజు గారి దగ్గరకు తీసుకొని వెళ్లారు. రాజు దొంగ చేయ బోయిన దొంగతనం గురించి పట్టించు కోకుండా అంత చక్కని సత్యం తో తన శ్లోకం పూర్తీ చేసి నందుకు తన బంగారు కడియాన్ని బహుమతి గా యిచ్చి యిక పై దొంగ తనాలు చేయకుండా బ్రతుకు అని మందలించి పంపేశాడు.
ఆ దొంగ ఆ కడియంను తీసుకొని తన నిరుపేద యైన స్నేహితుని యింటికి వెళ్ళాడు .
ఆ రాత్రిపూట నిద్రిస్తున్న స్నేహితుడిని లేపి, మిత్రమా! రాజుగారు ఈ కడియాన్ని నాకు బహూకరించారు. ఇది నాకంటే నీకే ఎక్కువ ఉపయోగం.నీవు తీసుకో. ఇది రాజుగారి స్వంత ఆభరణం చాలా విలువైనది. చౌకగా తెగనమ్మవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ మిత్రుడు మరునాడే ఆ కడియాన్ని ఒక బంగారు దుకాణము లో అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో ఖరీదైన బట్టలూ,ఆభరణాలూ కొనుక్కొని తిరుగసాగాడు. చుట్టుపక్కలవాళ్ళు
కూటికి గతిలేని వీడికి ఒక్కరోజులో యింత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అని ఆరా తీసి
సంగతి కనుక్కొని ఆ షావుకారుతో సహా రాజభటులకు అప్పగించారు. వాళ్ళు వారిద్దరినీ
రాజసభలో ప్రవేశ పెట్టారు. రాజుగారు ఆ కడియాన్ని గుర్తించి ఈ కడియం నీకెక్కడిదని
గద్దించి అడిగారు. అప్పుడు ఆ పేదవాడు రాజుకొక శ్లోకం చెప్పాడు.
భేకై: కోటర శాయిభి:,మృతమివ క్షా౦తర్గత౦ కఛ్ఛపై:
పాఠీనై: పృథు పంక పీఠ లుఠనాత్-అస్మిన్ ముహుర్మూర్చితం
తస్మిన్. శుష్క సరస్యకాల జలదే నాగత్య తచేష్టితం
యేనా కుంభ నిమగ్న వన్య కరిణాం యూధై: పయః పీయతే
రాజా! ఒక ఎండి పోయిన చెరువున్నది. అందులో నీరు లేక నేలబొరియల్లో పడుకున్న కప్పలున్నాయి. తాబేళ్లు భూమిలోకి వెళ్లి చచ్చిపోయినట్టు పడివున్నాయి. చేపలు నీరు చాలక ఆ ఎండిన బంకమట్టి పలకల మీద వెల్లకిలా పది తరుచు మూర్ఛ పోతున్నాయి.
అలాంటి ఎండిన సరస్సు లో అకాల౦ లో మేఘుడు వచ్చి కురిపించిన వర్షం వల్ల
పెద్ద అడవి ఏనుగులే మునిగి పోయి నీళ్లు తాగుతున్నాయి. (నిత్యదరిద్రుడనైన నాకు
అకస్మాత్తుగా సిరి లభించింది అని భావం)
రాజుకు అతని కవిత్వం నచ్చింది. ఆ కడియాన్ని తన స్నేహితుడిచ్చినాడని చెప్పకుండా నర్మగర్భితంగా చెప్పడం యింకా నచ్చింది. ఆ దొంగనే ఆ కడియాన్ని యిచ్చివుంటాడని ఊహించాడు. దాన్ని వీడు అమ్మి ఉంటాడని గ్రహించాడు.
అతనికి మరో లక్ష యిచ్చి పంపించాడు.
----------------

No comments:

Post a Comment