Thursday, 24 January 2013


మురళి|| తొలి వలపు ||

నిను కాంచిన మొదలు
నా తలపులు తెరిచెను తలుపులు

నిను చూసిన క్షణమే
నా హృదిలో పడినది ముద్రణ

నిను తలచిన తడవే
నా తనువున కలిగెను అలజడి

నువు ఎదురైనంతనే
నా యెదలో  ఏదో ఆరాటము

నీ మృధు భాషణమే
నాకది మదిరాపాన సేవనము

నీ చిరు దరహాసము
నా మదిలో మధుమాసము

నీ అదిరే అధరము
నా పెదవులకది మదుపానము

నీ మెరిసే చెక్కిలి
నా ప్రతిబింబము చూపే అద్దము

నీ వలపు చూపులు
నా యెడదను నాటిన అంబకము

నీ నిరతము చింతన
నాకది మధురమైన  భావనము

నీ తొలి వలపు తియ్యదనం
నాలో రేగే భావనలకు మూలధనం

రాయల వారిని పెద్దన పొగడిన పద్యం)
శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా 
నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !

( అర్జునుడు, సింహము, క్షితి - మూడింటిలోని లోపాలు గణించక పోతేనే 
వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదం లో సింహం తో
పోల్చ రాదంటూనే పద్యం చివర "రాజ సింహమా" అని పిలవడం ఏం సబబు ?
అని తప్పు చూపించి తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం)

కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్ తార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో
గలగంబారుతునేగె నీవయనుశంకన్ కృష్ణరాయాధిపా !!

(ఇంకొక పద్యం)
నరసింహ కృష్ణ రాయని
కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభి త్తురంగ కమనీయంబై !
‎|| దమ్మిడీ||
ఒకరోజు పేదరాశి పెద్దమ్మ వేకువజామునే నిద్రలేచి, వాకిలి ఊడ్చుతూ వుండగా ఒక దమ్మిడీ దొరికందట.ఉదయాన్నే లక్ష్మిదేవి దొరికిందని సంబరపడి, ఆ దమ్మిడీని బియ్యం దాచే కుండలో వేసిందట.అన్నం వండడానికి ఆకుండలోని బియ్యాన్ని చేటలో ఒంపి దోసెడు బియ్యం మరల కుండలో వేసి, ఆదమ్మిడిని కూడా అందులో వేసిందట. కొన్ని బియ్యం ఎసరులో పోసి, మిగిలిన బియ్యం కిరాణా దుఖాణానికి తీసుకుపోయి ఆబియ్యానికి బదులుగా నూనె చింతపండు,ఉప్పు,కారం,దినుసులూ తీసుకువచ్చింది.
మద్యాహ్నం తన కొడుకులకు వడ్డించి,తనూ తిని విశ్రాంతి తీసుకుంది.కొడుకులు పొలంకి వెళ్ళిపోయారు.సాయంత్రం కుండలో బియ్యం ఉన్నాయనుకొని తీయబోయింది పెద్దమ్మ. కుండకు సగం ఉన్నాయి బియ్యం. పరద్యానంలో ఆబియ్యాన్ని చేటలో వేసి వంటకు ఉపక్రమించింది.దోసెడు బియ్యం కుండలో వేసి,దమ్మిడీని కూడా అందులో వేసింది.రాత్రి అందరూ భోంచేసారు.
మరుదినం వేకువనే నిద్రలెచి,నిళ్ళకుపోయి,స్నానాధికాలు ముగించి,వంతకు ఉపక్రమించి,కుండ తీయబోతే కుండలో సగానికి బియ్యం ఉన్నాయి. కొడుకులెవరాన తెచ్చి వేసారేమోననుకొని వంటచేసి,దమ్మిడీని కుండలోనే భద్రపరచి,దోసెడు బియ్యం అందులో వేసింది. రాత్రి వంట కోసం కుండలో చూడబోతే కుండకు సగానికి బియ్యం ఉన్నాయి.ఆశ్చర్యం .కొడుకులనడిగింది. మేమెవ్వరం బియ్యం అందులో వెయ్యలేదన్నారు వారు. ఎవ్వరూ వెయ్యకపొతే ఈ బియ్యం ఎలా వచ్చాయని తెలుసుకోవాలని అనుకుంది పెద్దమ్మ.ఆ రాత్రి నిద్రపోలేదు కుండ వైపే చూస్తూ గమనించసాగింది రాత్రంతా. తెల్లవారి కుండలో చూస్తే సగానికి బియ్యం ఉన్నాయి.ఈదమ్మిడీ ప్రభావం వల్లనే ఇదంతా జరిగిందని అనుకొని, దమ్మిడి తీసి చూసింది. బియ్యం ఎలావేసినవి అలాగే వున్నాయి.
పెద్దమ్మ ఆనందానికి అవధుల్లేవు కొడుకులతో ఆ దమ్మిడి మహత్యం గూర్చి చెప్పింది. ఆ కుండలో నుండి తీసి ఒక పెద్ద గూనలో ఆదమ్మిడిని వేసి కొంచెం బియ్యం వేసి చూడగా ఆ గూనకు సగం వరకు బియ్యం తయారైనవి. ఈవిధంగా తయారైన బియ్యాన్ని అమ్మి తొందరలోనే ధనవంతులయ్యారు. 
ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న ఎలుగుబంటి పేద్దమ్మ ఇంటికి వచ్చి, దమ్మిడీ ఇమ్మన్నది, ఇవ్వకపోతే ఈరాత్రికి నిన్ను మింగేస్తానని వెళ్ళిపోయింది. పెద్దమ్మ దిగులుతో కొడుకులకోసం ఎదురుచూడసాగింది. పెద్దకొడుకులు వచ్చారు వారితో చెబితే "ఇప్పూడే వస్తాము" అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయారు. చిన్నోడొచ్చాడు. చిన్నోడుతో చెబితే సరే రానీ చూద్దాం దాని పని పడతాను అని బళ్ళెం తీసి సానరాయి మీద నూరుతున్నాడట."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని మినుములు అడిగాయట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి ద్వారందగ్గర దాగుకో. మళ్ళీ "సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని పిచ్చుక అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి గూటిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని తేలు అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి పెడక(చూరు) దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని ఉప్పు అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి పొయ్యిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని పీత అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి బిందిలో దాగుకో."సర్...సర్...సర్..." "చిన్నోడా చిన్నోడా బళ్ళెమెందుకు నూరుతున్నావు" అని దుడ్డుకర్ర అడిగిందట. ఎలుగుబంటిని చంపడనికి.అన్నాడు చిన్నోడు. ఐతె నేనూ నీకు సాయం చేస్తాను నువ్వెళ్ళి తలుపుమూల దాగుకో.అని చెప్పి చిన్నోడు అటక పైన దాగున్నాడట.
బాగా పొద్దుపోయింది యెలుగుబంటి పెద్దమ్మ ఇంటికి వచ్చింది తలుపేసి ఉంది. తన బలం అంతా ఉపయోగించి విసురుగా వచ్చి తలుపును ఢీకొట్టింది ఎలుగు. అంతే ఒక్క ఉదుటున లోనికి పడింది. కిందనున్న మినుములపై పడి జారి దొర్లుకుంటూ వెళ్ళి గోడను ఢీకొట్టింది.దులపరించుకొని, కింద ఏమున్నాయో చూద్దామని, గూటిలో దీపం తీయబోతే పిచ్చుక తన రెక్క్లతో ఆర్పేసింది. పెడకన అగ్గిపెట్టె ఉంటుందేమోనని వెత్కుతుంటే తేలు కుట్టింది.ఏది కుట్టిందో చూద్దామని 
పొయ్యిలో నిప్పులు రాజేసి మంట వెలిగిద్దామని మూతిపెట్టి ఊదితే ఉప్పుపేలి తన కంటిలోకి దుమ్మంతా ఎగిరి పడింది.
ఎలుగుబంటికి కళ్ళు మండుతుంటే నీటితో కళ్ళు కడగాలని బిందిలో చేయి పెట్టింది. అంతే పీత తన డెక్కలతో వేలు కత్తిరించింది. తలుపు మూలనున్న దుడ్డుకర్ర దిబ్బడ దబ్బడమని ఎలుగుబంటి వీపు విమానం మోత మొగిస్తుంటే, అటక పైనుండి చిన్నోడు బళ్ళెం పట్టుకొని దిగి చంపబోయాడు. యెలుగుబంటి తనను చంపవద్దని వెడుకుంటె, క్షమించి విడిచిపెట్టి ,బుద్ధిగా బ్రతుకు, మాజోలికి ఇక రావద్దంటూ చెప్పాడు.

Tuesday, 1 January 2013

మురళి ||సౌందర్యము||

నీ తొలిచూపు తొలకరులే విరిజల్లులు కురియగ

నీ దరహాసపు చంద్రికలే విరికలువలు విరియగ


నీ నవనీతపు చెక్కిలిలే జిలుగులు వొలకగ

నీ వూసుల గుసగుసలే కవితలు పలుకగ


నీ అదిరే అధరములే మధువులు వొలకగ

నీ చెదిరే కురువీచికలే వింజామర వీచగ


నీ బెదిరే చూపులే మరులను కురిపించగ

నీ మరిగే పొంగులు బడబాగ్నిని రగిలించగ


నీ పొంగే పరువము విరహమునే రేపగ

నీ సుందర రూపమే విందులు పంచివ్వగ 

dt 31/12/12 time 7:50 PM


ప్రియా!
  నిన్ను చూసిన తొలి చూపులో ఏదో తెలియని మధుర స్మృతి. ఇంతకు ముందెన్నడో ఎప్పుడో చూసిన గుర్తు లీలగా మెదులుతుంది. నీవు నాతో ఏదో బాస చేసినట్లు, నేను నీతో ఏవో ఊసులాడినట్లూ, మంచుతెరల దుప్పటిలో పుడమికాంత ఆదమరచి నిదురోతున్నప్పుడు, నీ నులివెచ్చని ఒడితలగడపై నేను తలవాల్చి నీకన్నులలోకి తదేకంగా చూస్తున్నప్పుడు నీ కురుల వింజామరలతో విసురుతుంటే మలయమారుతమేదో నాముఖాన్ని తాకినప్పుడు ఆప్పుడు కలిగిన పులకరింత ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నట్లుంది. నీ అద్దం లాటి చెక్కిలిపై నా ముఖ ప్రతిబింబము సుస్పష్టంగా కనిపిస్తుంటే,అనుకోకుండా నాచేతితో నీ బుగ్గతాకినప్పుడు సిగ్గుతో ఎరుపెక్కిన నీచెక్కిలి గులాబి మొగ్గలా ముడుచుకుంటే అరవిరిసిన లేత గులబి మొగ్గ నీ బుగ్గ నిగ్గు చూసి సిగ్గుతో తలవాల్చుకోలేదా?  ఆప్పుడే వచ్చిన గండుతుమ్మెద నీ ముఖపద్మము పై వాలాలని ఎంతో ఆశగా వచ్చి, సంపంగి పువ్వు వంటి నీ ముక్కును చూసి గక్కున వెనుతిరిరుగలేదా(సంపంగి దగ్గరకు తుమ్మెదలు రావుకదా!)
 అప్పుడే ఉదయిస్తున్న చంద్రబింబం నీ ముఖం పైనున్న కురులు చిరుగాలికి తొలగిపోగా కనిపించిన ముఖ చంద్రాన్ని చూసి అప్పుడే చంద్రోదయం అయిందా అని తడబడి మబ్బుచాటుకు వెళ్ళి దాగుకోలేదా?
 మధుర మదిరా రసాఛ్ఛాదిత మదురసాపూరిత అధరసుధామధురసాన్ని గ్రోలాలని నా పెదవులు ఎంత ఆరాట పడలేదూ?
  మధుమాసంలొ ఒక సాయంసంధ్యాసమయంలో మరుమల్లెలు విరబూసి సౌగంధాన్ని వెదజల్లుతూ సోయగాలను వొలికిస్తున్న వేళలో మందహాసం తో మత్తెక్కించి వలపులు చిలికే ఆ వగలాడి చూపుతో పిలువక పిలిచే భావాలను రేపుతూ  నా ఎదలో నాకే తెలియని అలజడులను సృష్టిస్తూ, మదిని దోచిన చిన్నదానా!నీవు నా ఎదుటనే నిలుచుంటే మనసు దాచుకోలేక నీ ఎడద పై వాలలని నా ఎదలో రగిలే విరహాగ్నిని చల్లార్చుకోవాలని ఎంత తహతహలాడలేదూ?
    హేమంతఋతువు, చల్లని రేయి,అప్పుడే మంచు తెరలలను తొలగించుకొంటూ బాల శశిబింబము కురిపిస్తున్న వెన్నెల వెలుగులు నా విరహాగ్నిని నిప్పులను విసనకర్రతో విసిరినట్లు మరింత అధికం చేయుచున్నాయి. ఆ తరుణంలో నీ రాక గ్రీష్మఋతువు మిట్టమద్యాహ్నం భానుని తీక్షణ కిరణ తాకిడికి వేడెక్కిన సుర్యకాంతశిల పై పడిన మంచు వర్షం వలే నాకు హర్షం కలిగించలేదా? పరవశాన నీ చెక్కిలి తాకిన న పెదవులు చిరునవ్వుల అలికిడికి చిరుగాలి సవ్వడికి అదిరె చిగురాకుపెదవులు చిలికిన మధువును మరిగి నా చూపులు నీ పెదవులు దాటి ఎటులైనా మరలాలని ఎంత ప్రయత్నించలేదూ?
   నీవు లేక పోయినా, నీరూపం నా హృదయ మందిరంలో ఇంకా పదిలంగానే ఉంది. నీ చూపు నా పై లేక పోయిన న కన్నుల్లో నీరూపం ఇంకా కదలాడుతూనే వుంది. నిను తాకకపొయినా నీ మనసంతా నలోనే పరచుకొని ఉంది.
   వెన్నెల్లో విరబూసిన విరజజుల నడిగాను నీ చిరుదరహసపు అరవిరిసిన పెదవుల మాటున వెదజల్లిన వెన్నెలల చిరు దంతపు వెలుగుల చూసి తను రాల్చిన విరజాజులెమో నని తడబడినాయట.
    ................ఇంకా ఈలేఖ రాయడానికి  సమయం లేక నా ప్రియను కలవడనికి స్వప్న లోకాని వెళ్ళుచున్నాను.
              _____మీ ప్రియమైన ప్రియుడు.

Sunday, 16 December 2012

పెళ్ళికి ముందు......

పున్నమి జాబిల్లిని చూస్తే

చెలి వదనం గుర్తొస్తుందట


ఆకాశంలో నెలవంకను చూస్తే

చిరునవ్వుల అధరం కనిపిస్తుందట


మధుమాసంలో మరుమల్లెను చూస్తే

మధువొలికె చిలిపి నవ్వే మదిదోచెనట


అరబూసిన వెన్నెలలో విరజాజిని చూస్తే

అరనవ్వుల పలువరుసల వెన్నెలలేనట


కరిమబ్బులలో మెరుపుతీగను చూస్తే


కరిగామని తనువే తలపునకొస్తుందట

పెళ్ళయ్యాక.......

పున్నమి జాబిల్లిని చూస్తే


పెనం మీద వేయాల్సిన దోశ కనిపిస్తుంది


ఆకాశంలో నెలవంకను చూస్తే


వంటింట్లో కూరలు తరిగే కత్తిపీట కనిపిస్తుంది


మధుమాసంలో మరుమల్లెను చూస్తే


బట్టలు వుతకగా వచ్చిన నురగ కనిపిస్తుంది



అరబూసిన వెన్నెలలో విరజాజిని చూస్తే


డాబా పై ఎండబెట్టిన వడియాలు గుర్తొస్తాయి


కరిమబ్బులలో మెరుపుతీగను చూస్తే


ఒకటో తారికున తీర్చాల్సిన అప్పులు గుర్తొస్తాయి

Tuesday, 13 November 2012


♥ఫేమిలీ పేక్♥
నేను ఈరోజు మందుగుండు కొందామని బజారుకు వెళ్ళాను
తారాజువ్వను అడిగాను నీధర ఎంతని?
పోరా నీవేమికొనగలవ్ నీవేమైనా రాజువా!
చిచ్చుబుడ్ది నడిగా ఎందుకింత చిన్నబోయావని
చెంచాడు మందు,పొట్టనిండా మన్నే వుందంది
భూచక్రం బాగుందని దగ్గరికెళ్ళి ముట్తబోయా
భుస్సుమని భుసకొట్టి,ఎంతదైర్యం? కొనడానికేనా! అంది
కాకరపువ్వొత్తులైనా కాసిన్ని కొందామనుకున్నా
ఆకాశానికి వువ్వెత్తున పైకెగసిందట దాని ధర
వెన్నముద్దల నడిగా నీ వెల ఎంతుంటుందని
కొన్న ముఖమేనా నీదని చిన్నబుచ్చింది
సీమ టపాసులైతే చవకగా ఉంటాయని చూస్తే
సీమదొరసానిలా సొగసు చూపిస్తున్నాయి
లక్ష్మిబాంబులు లక్షణంగా వున్నాయికదాని
నచ్చి వెలచూడబోతె కళ్ళుపచ్చగా అయిపోయాయి
మతాబులైతే భలేఅని కితాబుఇస్తారని చూస్తే
మతలబు మడతల బేరాలే అర్ధం కాలేదు
కొవ్వొత్తులైతే కొంతనయం అనుకొంటే
కొవ్వుకరిగి కిందటేడాది కంటే చిక్కిపోయాయి
 అందుకె ఫేమిలీ పేక్ తో సరిపెట్టుకున్నాను.
13/11/12 దీపావళి వెలుగులతో కాంతి విరజిమ్మినట్లు,
అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని కోరుకుంటూ.....!

Sunday, 11 November 2012

//బంగారు//
పేదరాశి పెద్దమ్మ ఒకరోజు వీధి గుమ్మంలో కూర్చొని ఉంది. ఆ దారిగుండా అవూరి యువకులు పిల్లలు కొందరు వలలు,ఊజులు,టిర్రెలు ఎత్తిడ్లూ,పట్టుకొని పెద్దచెరువు వైపుగా పరిగెడుతున్నారు. పెద్దమ్మ అందులో ఒకన్ని ఆపి విషయం కనుక్కొని తనూ పెడకన వున్న ఊజు తీసి బూజు దులిపి టిర్రి భుజాన తగిలించుకొని బయలుదేరింది. తొలుత చిన్న ఇలుసు దొరికింది. తరువాతప్రయత్నిస్తే పిత్తపరిగి,తరువాత చుక్క పరిగి,ఆనక బేడిసి,సీకొక్కెడం,జల్ల,బొడిగి,బొమ్మిడం,మిట్ట, తాటిమిట్ట,బురద మిట్ట,రొయ్య,ఎండ్రికి,పీత,మార్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దొరుకుతుంటే టిర్రెలో వేస్తూ అది తీసి ఇది.అలా అన్నీ నీటిలో వదిలేస్తూ ఉంది. చివరకు ఒక పెద్ద సవడ(కొరమీను)దొరికింది.దానితో తృప్తిచెంది, ఇంటిముఖం పట్టింది పెద్దమ్మ.
   కత్తిపీట, పొయ్యిబుగ్గి,పలక రాయి సిద్ధం చేసుకొని, సవడను పొయ్యిబుగ్గిలో పొరిపి,పీక పట్టుకొని కత్తిపీటకు ఆనించి కొయ్యబోతుంటే.... సవడ తననే దీనంగా చూస్తూ వదలమని వేడుకుంటున్నట్లుంది.
   పెద్దమ్మకు ఇప్పుడు ఎవ్వరూ లేరు. పిల్లలు అందరూ ఎవరి దారి వారు చూసుకొని వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఒంటరి అయిపోయింది.కనుక ఈ సవడ వుంటే తనతో కాలక్షేపం అవుతుందని తలచి,సవడను నీటితో కడిగి, గోలెంలోని నీటిలో విడిచిపెట్టింది. 'బంగారూ' అని పేరు పెట్టుకుంది.షరాబులింటికెళ్ళి,చిన్న వ్యాపారంకమ్మి చేయించి బంగారుకి కుట్టించింది.  బంగారూ అని పిలిస్తే నీటిలోంచి పైకి వచ్చేది ఇన్ని నూకలు వేస్తే తిని వెళ్ళిపోయేది.రోజూ పెద్దమ్మకు బంగారు లేనిదే గడిచేదికాదు.
    ఒకరోజు సంతకు బయలుదేరుతూ ఉట్టిపైన వండిన అన్నం,అన్నీ పెట్టి, పక్కింటి వారికి ఇంటి తాళం ఇచ్చి మద్యాహ్నవేళ మా బంగారుకి కొంచెం నూకలు వెయ్యండి అని చెప్పి వెళ్ళీంది. అలబొద్దుల వేళకి(10 గంటలకు) పక్కింటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళకు మర్యాద చెయ్యడానికి వూరిల్కి గుడ్డులకోసం వెళితే దొరకలేదు.ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే  అప్పుడు వారికి పెద్దమ్మ పెంచుకుంటున్న సవడ గుర్తుకొచ్చింది. తరువాత నెమ్మదిగా పెద్దమ్మకు చెప్పుకోవచ్చనుకొని, ఆ సవడను కూర చేసి చుట్టాలకి వడ్డింఛేశారు.సాయంత్రం పెద్దమ్మ సంతనుండి వచ్చి, ఆకలికి తాలలేక ఉట్టిమీదున్న వట్టన్నమేమి తింటానని పక్కింటికెళ్ళి చారో,కూరో కసింత ఇమ్మని అడిగితే,వాళ్ళు మిగిలిపోయిన ఇగురు(గ్రేవీ)సట్టి(మట్టిపాత్ర)తో పాటు ఇచ్చేసారు.
     అన్నం లో ఆ ఇగురు కలుపుకొని తింటుంటే పంటికింద ఏదో రాయి తగిలి టిసి చూస్తే వ్యాపారంకమ్మి, ఇందులోకి ఎలా వచ్చింది, కొంపతీసి మా బంగారును పక్కింటోళ్ళు ఏమైనా చేసారా ఏమిటి? అనుకొంటు గోళెం దగ్గరకు వెళ్ళి, "బంగారూ" "బంగారూ" అంటూ పిలిచింది పెద్దమ్మ. ఇంకెక్కడి బంగారు. నీటిలో చెయ్యి పెట్టి తడిమి చూస్తే బంగారు లేదు. ఇది పక్కింటోళ్ళ పనే అనుకొని వాళ్ళను నిలదీసింది.వళ్ళు ఇలగిలగ అని పెద్దమ్మకు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేసారు. కానీ ఫలితం లేకపోయింది.ఊరూ వాడా ఏకమయ్యేట్టు ఒకటే ఏడుపు, ఒకటే దీవెన,"మీకు రోజ్జెయ్య, మీకు గాడుప్పుట్ట, మీ మందమాసిపోనూ,మీకు దినవారమెట్ట,మీ నెట్టిగొట్ట,మీకు పోగాలం రాను,మికు దిబ్బెయ్య,మీకు బుగ్గెత్తా, మీకొక సంకటంపుట్ట,మీకొక పాముపొడ,ముండగాసిన ముండపాపా మా బంగారే మీకు దొరికిందా?" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా రోజల్లా తిట్టింది. ఆతిట్లు వినలేక పక్కింటోళ్ళు తలుపేసుకున్నారు. పెద్దమ్మ అంతటితో ఆగకుండా ఆ ఊరి నాయుడు దగ్గరకు వెళ్ళి తగువు పెట్టింది. నాయుడు పక్కింటోలిని పిలిచి, పెద్దమ్మ సవడ బదులుగా ఒక గొర్రె పిల్లనిమ్మని తీర్పుచెప్పాడు.
    పెద్దమ్మ ఆ గొర్రెపిల్లని అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. అది పెరిగి పెద్దదయింది.
    ఒక రోజు ప్రక్క వూరిలో జాతర జరుగుతుంది. అందరూ జాతరకి వెళుతున్నారు. పొట్టేలు(గొర్రె పోతు) పెద్దమ్మతో ఇలా అంది "పెద్దమ్మా పెద్దమ్మా అందరూ యాత్రకు వెలుతున్నారు, నేనుకూడా వెళతాను "అని. ఎప్పుడూ అడగనిది అడిగిందని చెప్పి డబ్బులిచ్చి, పంపించింది."చీకటి పడిపోయేంతవరకూ అవీ,ఇవీ చూసుకోని ఉండిపోకు,ఒకవేళ చీకటిపడితే రావద్దు. సుబ్బిశెట్టి గారింటికెళ్ళి ఇలగిలగ పెద్దమ్మ తాలూకా అని చెబితే అతను మర్యాద చేస్తాడు"అని జాగ్రత్తలు చెప్పి పంపించిచింది పెద్దమ్మ.
పొట్టేలు జాతరంతా తిరిగి కావలిసినవన్నీ కొనుక్కొని, చూడాల్సినవన్నీ చూసేసరికి పొద్దుబోయింది. సుబ్బిశెట్టి ఇంటికి వెళ్ళి ఇలగిలగ అని చెబితే అతను సామాన్ల గది చూపించి అక్కద పడుకోమని చెప్పాడు. ఆగదిలో ఒక బస్తా నిండా వజ్రాలు,మరో బస్తా నిండా రత్నాలు, ముత్యాలు, బంగారం,పగడాలు, ఒకటేమిటి? ఆసంపదను చుసేసరికి కొంచెం స్వార్దం పుట్టింది పొట్టేలుకు. ఒక్కో బస్తాలో కొంచెం కొంచెం బంగారు కాసులు,రత్నాలు,వజ్రాలు,ముత్యాలు అన్నీ మింగేసి పెందిలకదనే షావుకారికి చెప్పి బయలుదేరింది. నడవలేక నడవలేక వస్తున్న పొట్టేలు దారిన పోతున్న తలయారితో "నేను వచ్చేస్తున్నానని చెప్పి బొంత పరిసి,రోకలి సిద్దం చెయ్య"మని చెప్పింది. పెద్దమ్మ బెంగపెట్టుకోని ఏటిజరిగిండా అని ఎదురుచూస్తూ కూర్చుంది. జరిగిన సంగతంతా పెద్దమ్మకు చెప్పగా రోకలి తో కుడి ప్రక్క పొడిస్తే ఇన్ని వజ్రాలు నోటింట పడ్డాయట.ఎడమ ప్రక్క పొడిస్తే ఇన్ని రత్నాలు పడ్డాయట. పడిన సంపదని కొలవడానికి పక్కింటోలింటికి సోలకు వెళ్ళింది."ఏమిటి కొలుస్తాదా చూడాలని సోల అడుగున చింతపండు అంటించి ఇచ్చారు.
   కొలిచి గూనలోవేసి దాచింది పెద్దమ్మ. సోల వారిది వారికిచ్చివేసింది.సోల అడుగున వున్న రత్నాలను,వజ్రాలను చూసి అశ్చర్యపోయారు పక్కింటివారు. పెద్దమ్మ దగ్గరకి వచ్చి ఆరా తీయగా ఇలగిలగ అని చెప్పింది.
  పక్కింటోళ్ళు ఒక కుక్కను పెంచుతున్నారు. వారు ఆకుక్కకు ఇలగిలగ అనిచెప్పి యాత్రకు పంపారు. ఆ కుక్క యాత్రలో కనిపించినవన్నీ కొనుక్కొని తిని సాయంత్రానికి సుబ్బిశెట్టి ఇంటికిపడుకోవడానికి వెళ్ళింది. అర్ధరాత్రి నెమ్మదిగా సరుకుల గదిలోకి చొరబడి రత్నాలను మింగబోయింది. దురదృష్టం కలసి వచ్చింది. అదే సమయానికి శెట్టికి మెలికువ వచ్చింది,సామాన్లగది తెరిచి వుండడం చూసి,కర్రతీసి ఎవరు తీసారో చూడగా కుక్క కనిపించింది.అంతే కర్రతో నడుముకడ్డంగా ఒక్కటేశాడు. అంతే కైయ్...కైయ్... మంటూ కుక్క ఒకటే పరుగు.
   

Wednesday, 7 November 2012


మురళి//నీలమా? ఎరుపా?//



చంద్రుని చుట్టూ గుడి కట్టిందంటే 

ఎండిన పైరుల గుండెలలో ఊపిరి 

నిండే జడి వానల తడి ఉంటుందని

ఎండిన డొక్కల రైతన్నల ఆశలు

అడియాశలు చేసిందిగదా ఈ నీలం



పొట్టకొచ్చిన పచ్చని పైరుపంటల చూసి

పొట్టనిండినదని పరవశమున రైతన్నలు 

పగిలిన నేలను చూసి గుండెపగిలి ఏడ్వగా

గుడి గట్టెనులే మడితడియును అని సంబరపడి 


ఘడియైనాకాకమునుపే ఓ నీలంతుఫాను

నీలుగుతూ నిక్కుతు నలుపెక్కిన రక్కసిలా

నిలువున ముంచెత్తుతు జడివానై కురియగ

అలజడి రేగెను అన్నదాత ఎడదలొ 


వరదల పాలైన ఏడాది రెక్కల కష్టం

ఐపోయెనులే బూడిదలో పోసిన పన్నీరు

రైతు కళ్ళల్లో నిండెన రక్తపు కన్నీరు



చేరిన వరదలు చెరువును తలపగ

బరువై బతుకులు, గుండెలు చెరువైపోగా

ఉండాలో, కడతేరాలో తేల్చుకోలేక 

తిండికికరువై రైతన్న తల్లడిల్లిపోగా

dt. 06-11-12

Monday, 29 October 2012

మురళి// వాకబు //

నను వీడిన నిను మరువలేక

మనసంతా కల్లోలమై నిలువలేక


నీ తలపుల భావనలను విడువలేక

నువు నడయాడిన నందన వనిలో


నీజ్ఞాపకాల సోయగమును సోకాలని

నువు తాకిన తరు శాఖల వాలాలని


నినుతాకిన సుమ సౌరభాన్ని గ్రోలాలని

నువు సాకిన నీడజముల తాకాలని


నువు పెంచిన సుమతరువుల కాంచాలని

మనసు నిలువలేక వచ్చితినా....


మల్లెలనడిగితిని నీచిరునామాఎక్కడని

నిను జూసిన మల్లెలు తెల్లబోయినవట


తుమ్మెదలనడిగితిని నీకబురిమ్మని

నీఅధరమధురసాస్వాదనలో మైమరచినవట



మధుమాసమునడిగితిని నీపదముల జాడేదని

చామంతుల చూపించి ఈవన్నెలరాశిని

నిముషమునకుముందేకన్నానని చెప్పినది


కరిమబ్బునడిగితిని నీ అలికిడి ఏదని

మెరుపుతీగల నడుమ తెలుసుకోలేవట


జాబిల్లినడిగితే మలిసంధ్య వేళలో నీకన్నుల

కలువ రేకుల లో తొంగిజూసి మరిచెనట


పండువెన్నెలనడిగితిని మనసు తాలలేక

ముఖ చంద్రుని కాంచి చిన్నబొయినవట

dt 29/10/12

Thursday, 25 October 2012


 చెమర్తకారి

ఒకరోజు భోజరాజు, కాళిదాసు మారువేషాలలో రాజ్య పర్యటనకి వెలుతున్నారు. ఒక గ్రామంలో ఉదయాన్నే ఒక

ఇల్లాలు కల్లాపి చల్లుతూ ఉంది. ఇంతలో దగ్గరలోని ఒక చెట్టుపై కాకి "కావ్ కావ్" మని అరిచింది. అంతే కల్లాపి పాత్ర

అక్కడే పడేసి,తన మొగుడ్ని వాటేసుకొని "ఓరి నా మొగుడో..." అంటూ భయపడి,వణికిపోతూ అతన్ని

వాటేసుకుందట.

    ఆ సన్నివేశాన్ని చూసిన భోజుడు కాళిదాసుతో "నారాజ్యం లో ఇంత పిరికివారు ఉంటారా"అన్నాడట. అప్పుడు

కాళిదాసు "పట్టపగలు కాకి అరిస్తే భయపడే ఆడది అర్ధరాత్రి కావేరీ నదిని అవలీలగా దాటిపోతుందట" అని అన్నాడు.

కావేరీ నదిలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. పగలే యెవ్వరూ దాటలేరు.

    కాళిదాసు చెప్పాడంటే నమ్మవలసిందే... అని గూఢచారులను నియమించి ఆమెను ఒక కంట

కనిపెట్టమన్నాడట.

   ఆమె తన ఇంటికి వచ్చిన కుక్కలను తలుపులేసి చంపి వాటి మాంసాన్ని ఒక బుట్టలో పెట్టి మొగుడుకి రాత్రి

భోజనం లో నల్లమందు కలిపి పడుకోబెట్టి అర్ధరాత్రి ఆ బుట్టను మోసుకుంటు కావేరీ నది దాటుతూ తనను

తినబోవడానికి వచ్చే మొసళ్ళకు ఈ మాంస ఖండాలను విసురుతూ కావేరీ నదిని అవలీలగా దాటిపోయి ఆవలి

తీరాన వున్న తన ప్రియుని రోజూ కలుసుకుంటుందట.

Wednesday, 17 October 2012


మురళి// ఉపమానం //
మన స్నేహాన్ని పువ్వుతో పోల్చకు
ఎందుకంటే పువ్వు వాడిపోతుంది

మనస్నేహాన్ని కడలితో పోల్చవద్దు
ఎందుకంటే ఉప్పగా ఉంటుంది అది

మన స్నేహాన్ని మంచుతో పోల్చకు
ఎందుకంటే అది కరిగిపోతుంది చూడు

మన స్నేహాన్ని వసంతంతో పోల్చకు
శిశిరం వచ్చిందంటే మోడుబారిపోతుంది

మనస్నేహాన్ని కాలంతో పోల్చకు
ఎందుకంటే అది కదిలిపోతుంది

మనస్నేహాన్ని గువ్వతో పొల్చకు
ఎందుకంటె అది ఎగిరిపోతుంది

మన స్నేహాన్ని సుధతో పోల్చకు
ఎందుకంటే అది దేవతల సొంతం

మన స్నేహాన్ని తేనెతో పోల్చకు
ఎందుకంటే అది ఎత్తులో ఉంటుంది

మన స్నేహాన్ని స్వర్గంతో పోల్చకు
ఎందుకంటే అక్కడ అనుబంధాలుండవు

మరి దేనితో పోల్చాలి...........

అవినీతితో పోల్చు
ఎందుకంటే అది శాశ్వతంగా ఉంతుంది

అన్యాయంతో పోల్చు
ఎందుకంటే అదెప్పుడు తరిగిపోదు

అధర్మంతో పోల్చు
అదెప్పుడూ నాలుక్కాళ్ళతో నడుస్తుంది

లంచగొండితనంతో పోల్చు
అది వేళ్ళు పాతుకు పోయింది

దారిద్యంతో పోల్చు
అది అంతులేనంత ఉంది

పేదరికంతో పోల్చు
అది దిదినాభివృద్ధి చెందుతూవుంది

తే 17/10/12 దీ రాత్రి 7.45










Sunday, 14 October 2012


మురళి//ఆరాటము//
మధుమాసపు వెన్నెలలో
మరుమల్లెల జల్లులలో
మదిని దోచిన చిన్నది
ఎచట దాగి యున్నది
ఎదుట రాకయున్నది

నీ బుగ్గమీది  నిగ్గు చూచి
అరవిరిసిన గులాబి మొగ్గ
సిగ్గులతో తలదాచుకున్నది
నా చెంపకెంత చెలగాటమో
నీ బుగ్గపైన నిగ్గులన్నినిమరాలని

నీ పెదవులపై  మధువుజూచి
తనివితీర తాగాలని తుమ్మెద
సంపంగి ముక్కు జూసి వెళ్ళి పోయె
నా పెదవులకెంత పరితాపమో
నీఅధరసుధామధురసాన్ని గ్రోలాలనీ

నీ మోము కాంతి మెరుపు చూసి
చందమామ సిగ్గుతో మంచు దుప్పటి
తీసి ముఖముపై కప్పుకున్నది
నా కన్నులకెంత ఉబలాటమో
నీకన్నులతో బాసలు చేయాలని

నీ మేని చాయ మెరుపు చూసి
విరబూసిన చిరుచామంతి
సిగ్గుతో ముఖము చాటువేసింది
నా యెడదకు యెంత ఆరాటమో
నీయెద పైన పదిలంగా వాలాలని
తే14/10/12దీ రాత్రి 9.00




Friday, 12 October 2012

మురళి// విస్మయము//

చంద్రుని చూస్తే కలువలు వికసిస్తాయి అంటారు

మరి చంద్రునిలోనే కలువలు వికసించాయేమిటి?


నీటి లో చేపలు విహరిస్తూవుంటాయంటారు 

కానీ చేపలలోనే నీరు ఉంది ఎందుకు?


కలువలపై తుమ్మెదలు వాలుతాయంటారు

మరి కలువలే తుమ్మెదలైనాయేమిటీ?


సంపంగి దక్కరకు తుమ్మెదలు రావు అంటారు?

ఐనా సంపంగి ఇరువంకలా తుమ్మెదలున్నాయి!?



చంద్రునిలో చంద్రులు ఉదయిస్తాయా ఎప్పుడైనా?

చంద్రునిలో పలువరుసచంద్రికలు వెన్నెలలు కాసాయి



గిరిశృంగముల పై పయోధరములుంటాయి గానీ

పయోధరముల పై గిరిశృంగములున్నాయేమిటి?


జలధరంబుల దాటి చంద్రబింబముండు కానీ

చంద్రబింబము పైన జలధరంబులున్నవేమి?



ఇట్లు చూపరులకు విస్మయము కల్గునట్లుగా

కనులు,ముఖము,ముక్కు,పలువరుసలు,

కురులు,పయోధరములు అమరియున్నవి.


తే 12/10/12దీ 8.45 రాత్రి

Thursday, 11 October 2012


మురళి// పొంగడాల చెట్టు //
 ఒకరోజు పేదరాశి పెద్దమ్మ సోలు ఎండబోసిందట. ఒక అడవి పంది ఆ చోలుని తినబోతే పెద్దమ్మ చేటతో కొట్టిందట. చేటడు వెంట్రుకలు రాలాయాట,వాటిని పులుసులో వేసి కొడుకులకు వడ్డిస్తే వారు అడిగారు."ఈ రోజు పులుసు రుచిగా వుంది, ఏమిటి కలిపావు" అని.పెద్దమ్మ విషయం చెప్పింది.ఐతే ఆఅడవి పందిని వేటాడి పట్టుకొస్తామని బయలుదేరి వెళ్ళారు వారంతా.
     వెళ్ళినవాళ్ళు రెండు రోజులైనా తిరిగిరాకపోయేసరికి చిన్నోడితో చెప్పింది. చిన్నోడు ఒక చురకత్తి పట్టుకు బయలుదేరాడు. అడవిలో వెతకగా వెతకగా పందుల జాడ తెలిసింది. అటుగా వెళ్ళి వాటిని వుల్లగించాడు.ఒక పెద్ద అడవిపంది వీడిపై తిరగబడి మింగేసింది.కడుపు లోపల అన్నలందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు అడిగారు"నువ్వు ఇక్కడికెలాగ వచ్చావు"అని.ఇలగిలగ అనిచెప్పాడు చిన్నోడు.చురకత్తి తీసి పంది కడుపుని కోసుకొని అందరూ బయటపడ్డారు.పందిని ఒక పెద్ద కర్రకు కట్టి ఇంటికి తీసుకు వచ్చారు. పెద్దమ్మ వీళ్ల రాకకు సంతోషించి, వారిని స్నానానికి వెళ్ళమని చెప్పి మాంసం వండింది.మిగిలినది ఊరందరికి పంచింది.కొడుకులు వస్తే వారికి వరుసగా వడ్డించింది. ముందు పెద్దోడు,తరువాత రెందోవాడు అలా...చివరకి చిన్నోడు.అందరూ కొసరి కొసరి వడ్డించుకోగా చిన్నోడి దగ్గరికి వచ్చేసరికి మాంసం అంతా అయిఫొయింది. ఆఖరుకి ఆ ఇగురులో అన్నం పొరిపి వేసింది చిన్నోడికి. అందరూ ఆవురావురుమని తింటున్నారు.చిన్నోడు "ఒరే పెద్దన్నా పెద్దన్నా ఒక్క సితకియ్యురా" అని,"అబ్బా నేనెందుకిస్తాను" అన్నాడు వాడు."ఒరే రెండన్నా, రెండన్నా చిన్న ముక్కియ్యురా" అంటే వాడూ ఇవ్వలేదు. ఇలా అందరినీ అడిగితే అందరూ "ఇవ్వము" అన్నారు. చివరకు చిన్నన్నను అడిగాడు. వాడు చీకి చీకి ఒక దుమ్ము ఇచ్చాడు. ఆదుమ్ముని సప్పరించుకోని జోబులో దాచుకున్నాడు.
     మర్నాడు ఆవులను మేతకు తోలుకెలుతూ దుమ్ము తీసి చీకుతూ వున్నాడు. అది కాస్తా జారిపోయింది,ఒకపుట్టలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు.అప్పుడన్నాడు"నేను రేపు ఈ యేలకి వొచ్చీసరికి మొక్కవ్వకపోయావో పెద్దన్న గొడ్డలి తో ఒక్కటేసేస్తాను".మరుచటి రోజుకి మొక్కైంది.వచ్చాడు,చూసాడు,మళ్ళీ అన్నాడు"రేపీపాటికి పొంగడాల చెట్టవ్వక పోనావా చిన్నన్న గొడ్డలితో నరికేస్తాను". మరచటినాటికి చెట్టై పోయింది.మళ్ళీ అన్నాడు"రేపీపాటికి పువ్వులుపూసి కాయలు కాయకపోయావో నడిపన్న గొడ్డలితోటి అడ్డగ నరికేస్తాను.మరునాటికి కాయలు కాసింది."రేపొచ్చేసరికి పొంగడాలు పండకపోయావో అన్నకొక గొడ్డలి తెచ్చి అన్ని ముక్కలు చేసేస్తాను" అన్నాడు చిన్నోడు.
     ఎప్పుడెప్పుడు తెల్లారుతాదా అని ఎదురుచూసాడు. చివరకు తెల్లారేసరికి, పొంగడాలవాసన వస్తే చెట్టుదగ్గరకి వెళ్ళాడు చిన్నోడు పలకర్ర చేసుకోవడం మరిసిపోయి చెట్టెక్కి పొంగడాలను తెంపుకోని తింటున్నాడు. ఆవాసనకి పెద్దన్న వచ్చాడు,ఒరే చిన్నోడా ఒక్క పొంగడమియ్యురా అంటే "నువ్వు చిన్న సితకియ్యురా అంటే ఇచ్చావేటి? నేనివ్వను" అన్నాడు,"మాతమ్ముడువికదూ ఈసారి ఇస్తాలే" అన్నాడు అన్న.అప్పుడు చిన్న పిసరంత ఇచ్చాడు.అలగే అందరూ వచ్చి అడిగితే అలగే చిన్నపిసర్లు ఇచ్చి పంపించేశాడు. చివరకు చిన్నన్న వచ్చి అడిగితే "ఓరె నీకెందుకివ్వనేస్ చెట్టెక్కురా నీకెన్ని కావాలంటే అన్ని తినురా" అని అన్నాడు. ఇద్దరూ అన్ని పొంగడాలూ తినేశారు.
dt 11/10/12.8.00PM.

Wednesday, 10 October 2012


మురళి//తొట్రుపాటు//
కురుల సంపద చీకటిగొన్న అపరాదమేమియని
మానసమందు అనునయించు నంతలో
ముఖచందురుని వెన్నెల కాంతుల గని విస్తుపోయె

చిన్నబోయిన పెదవుల సిగ్గులను జూచి చింతించి
అధరసుధారసాపూరముల ధారల గ్రోలి
పరవశమ్మున మధురసాస్వాదనమున మునిగిపోయె

మృదుల కోమలయుతమైన కరయుగము గాంచి
మధుర భావనమున మదిని మెచ్చుకొనగ
కఠిన కర్కష పాషాణ సదృశ పయోధరము గాంచి
సద్భావము నంతయు సమసు కొనియె

నిరుపేద తనుమధ్యమ కడుదీన స్థితిని గాంచి
జాలిపడి, బాధపడి, మనసున కలతనొందె
ఒత్తుకొనివచ్చు కుచకుంభోద్వృత్తి జూచి
విస్మయంబు గొలుప విషమచిత్తమయ్యె

క్షీణగతినున్న ఉదరపు కడు(పు)పేద స్థితిని జూచి
కారుణ్యభావముదయింప ఎడదను తల్లడిల్లె
దృత్యోన్నతోధ్రుతినున్న కటివలయము గాంచ
కారుణ్యభావమంతలో అంతరించె

వైవిధ్యభరితమైన అంగాంగనను గాంచి
విషమాకృతులు చూడ్కికి తొట్రుకొనగ
రాత్రి7:35... తే10-10-12దీ


మురళి//తొట్రుపాటు//
కురుల సంపద చీకటిగొన్న అపరాదమేమియని
మానసమందు అనునయించు నంతలో
ముఖచందురుని వెన్నెల కాంతుల గని విస్తుపోయె

చిన్నబోయిన పెదవుల సిగ్గులను జూచి చింతించి
అధరసుధారసాపూరముల ధారల గ్రోలి
పరవశమ్మున మధురసాస్వాదనమున మునిగిపోయె

మృదుల కోమలయుతమైన కరయుగము గాంచి
మధుర భావనమున మదిని మెచ్చుకొనగ
కఠిన కర్కష పాషాణ సదృశ పయోధరము గాంచి
సద్భావము నంతయు సమసు కొనియె

నిరుపేద తనుమధ్యమ కడుదీన స్థితిని గాంచి
జాలిపడి, బాధపడి, మనసున కలతనొందె
ఒత్తుకొనివచ్చు కుచకుంభోద్వృత్తి జూచి
విస్మయంబు గొలుప విషమచిత్తమయ్యె

క్షీణగతినున్న ఉదరపు కడు పేద స్థితిని జూచి
కారుణ్యభావముదయింప ఎడదను తల్లడిల్లె
దృత్యోన్నతోధ్రుతినున్న కటివలయము గాంచ
కారుణ్యభావమంతలో అంతరించె

వైవిధ్యభరితమైన అంగాంగనను గాంచి
విషమాకృతులు చూడ్కికి తొట్రుకొనగ
రాత్రి7:35... తే10-10-12దీ

Tuesday, 9 October 2012


స్నేహమనే కొలనిలో
చేపను నేనైతే......
గాలం వేసి గాయం చేస్తావో
గాయం చేసి ప్రాణం తీస్తావో
గాలై వీచి ప్రాణం పోస్తావో!

స్నేహమనే కడలిలో
పడవను నేనైతే.....
సుడివై నడి ముంచుతావో
చుక్కానివై దారి చూపుతావో
తెరచాపవై దరి చేర్చుతావో!

స్నేహమనే తోటలో
పువ్వును నేనైతే....
తుంటరివై త్రుంచెదవో
గొంగలివై మ్రింగెదవో
తుమ్మెదవై మధు గ్రోలెదవో!

స్నేహమనే కొండపై
బండను నేనైతే....
సమ్మెటవై పిండిని చేసెదవో
ఉలివై ప్రతిమను మలిచెదవో
గుడి గుండియలో నిలిపెదవో!

స్నేహమనే వసంతంలో
కోయిల నేనైతే....
బోయవై గొంతు కోసెదవో
మావివై చిగురునిచ్చెదవో
శ్రోతవై గానము మెచ్చెదవో!

Monday, 8 October 2012




ఓ వాలుకన్నుల వయ్యారీ
నీ ఓర చూపులు విసరకే

ఓ కొంటె చూపుల కోనంగీ
జుంటి తుమ్మెదలంపకే

ఓ చేపకన్నుల చిన్నారీ
చూపు బాణాల విడువకే

ఓ మొలక నవ్వుల నెలవంకా
మనసు నంతను దోచకే

ఓ లేత బుగ్గల లలితాంగీ
గుండెలలజడి లేపకే

ఓ చురిక చూపుల సంపంగీ
గుండె కోతను కోయకే

ఓ చంద్రకాంతుల చిరుదంతీ
వేడి వెన్నెల విరియకే

ఓ బృకుటికా దనుర్ధారీ
వలపు బాణాలను వేయకే

ఓ నీలి కురులా నీలవేణీ
మరుల వింజామర దాచకే

ఓ చొట్ట బుగ్గల సొగసరీ
బెట్టు ఇంకను మానవే

ఓ మందహాసపు మరుమల్లీ
మదిని మంటలు రేపకే